2023లో థియేటర్లకు వచ్చిన 'ది కేరళ స్టోరీ' సినిమా, సంచలన విజయాన్ని సాధించింది. అనేక వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా, రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ గా 'ది కేరళ స్టోరీ 2' రూపొందింది. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఫిబ్రవరి 27వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ రోజు (మే1వ తేదీ) నుంచి ఈ సినిమా 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది.
దివ్య (అదితి భాటియా) అందమైన యువతి. సరదాగా రీల్స్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా రాణించాలనేది ఆమె కోరిక. అయితే రీల్స్ విషయంలో ఆమె ధోరణి పద్ధతిని దాటి వెళుతూ ఉండటంతో, తల్లిదండ్రులు అసహనాన్ని వ్యక్తం చేస్తారు. రషీద్ (యుక్తమ్) మాత్రం ఆమెను ఎంకరేజ్ చేస్తాడు. దాంతో అతనిపట్ల ఆమెకి గల ప్రేమ మరింత బలపడుతుంది. తల్లిదండ్రులకు చెప్పకుండా రషీద్ తో వెళ్లిపోతుంది.
ఇక సురేఖ (ఉల్కా గుప్తా) యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. జర్నలిస్ట్ సలీమ్( సుమీత్)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. ఆధునిక భావాలతో పెరిగిన సురేఖ, అతనితో లివింగ్ ఇన్ రిలేషన్ కి అంగీకరిస్తుంది. తను తీసుకున్న నిర్ణయం సరైనది కాదని తల్లిదండ్రులు ఎంతగా చెప్పినా ఆమె వినిపించుకోదు. సమాజాన్ని చూసే దృష్టి కోణాన్ని మార్చుకోమని వాళ్లపై ఆమె మండిపడుతుంది. సలీమ్ ను తాను పూర్తిగా అర్థం చేసుకున్నానంటూ గడప దాటుతుంది.
ఇక 'జావెలిన్ త్రో' జాతీయస్థాయి క్రీడలో పాల్గొనడానికి అవసరమైన కసరత్తు చేయడంలో 'నేహా' (ఐశ్వర్య ఓజా) బిజీగా ఉంటుంది. నేహాను ఎంకరేజ్ చేస్తూ ఆమె ప్రేమను సంపాదిస్తాడు రాజు. ఆమెకి ఇష్టమైన కోచ్ ను కలుసుకునేలా చేస్తానని తీసుకుని వెళతాడు. అతని అసలు పేరు ఫైజన్ అనే సంగతి ఆ తరువాత తెలియడంతో నేహా బిత్తరపోతుంది. ఇక దివ్య .. సురేఖ కూడా ముస్లిమ్ యువకుల కారణంగా కన్నవాళ్లకు దూరమవుతారు. అక్కడ వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఆ ఉచ్చులో నుంచి వాళ్లు ప్రాణాలతో బయటపడతారా లేదా? అనేది మిగతా కథ.
హిందూ మతానికి చెందిన యువతుల చుట్టూ ప్రేమ పేరుతో ఎలాంటి ఉచ్చు బిగుసుకుంటోంది, ఆ తరువాత వాళ్లు బలవంతంగా ఎలా మతం మార్చబడుతున్నారు అనే అంశాలను ప్రధానంగా చేసుకుని 'ది కేరళ స్టోరీ' రూపొందింది. అప్పట్లో ఆ సినిమా అనేక వివాదాల మధ్య విడుదలై, సంచలన విజయాన్ని నమోదు చేసింది. అదే తరహా కథతో రూపొందిన సినిమానే 'ది కేరళ స్టోరీ 2'. ముగ్గురు హిందూ యువతుల చుట్టూ ఈ కథ నడుస్తుంది.
మూడు ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతుల చుట్టూ ఈ కథను అల్లుకున్నారు. హిందువుల జీవనశైలిలో ఆచార సంప్రదాయాలు ముడిపడిపోయి ఉంటాయి. అయితే ఆధునిక భావాల పేరుతో కొంతమంది యువతులు పెద్దల మాటలను పక్కన పెడుతూ ముందుకు వెళుతున్నారు. అలాంటి యువతులు ఎలాంటివారి ఉచ్చులో పడుతున్నారు. అందులో నుంచి బయటపడలేక ఎలాంటి హింసలు అనుభవిస్తున్నారనేది దర్శకుడు టచ్ చేశాడు.
హిందూ మతానికి చెందిన యువతులు మాయమాటలను నమ్మి ఎలా మోసపోతున్నారు. వాళ్లకి తెలియకుండా వాళ్ల చుట్టూ ఎలాంటి ఒక ప్రమాదకరమైన 'వల' పన్ని ఉంది. ప్రేమ పేరుతో విసిరిన వలలో వాళ్లు ఎలా చిక్కుకుంటున్నారు? 'లవ్ జిహాద్' అనేది చాపకింద నీరులా ఎలా జరుగుతోంది? అనే విషయాలను వాస్తవాలకి చాలా దగ్గరగాఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
హిందువులలో చాలా కుటుంబాల వారు తమ ఆచార వ్యవహారాల గొప్పతనాన్ని తమ పిల్లలకు చెప్పవలసిన అవసరం ఉందనే విషయాన్ని దర్శకుడు టచ్ చేశాడు. అలాగే ఆశయసాధనలో ఉన్న అమ్మాయిలు, ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరాన్ని ప్రస్తావించారు. కన్నవాళ్ల ఆందోళనను అమ్మాయిలు అర్థం చేసుకోవాలనే విషయాన్ని స్పష్టం చేశారు.
ఇక హిందువులందరిలో ఐకమత్యం లేకపోవడం వలన, మనకెందుకులే అనుకుంటూ ఎవరిదారిలో వారు పోతుండటం వలన ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా దర్శకుడు తెరపైకి తీసుకుని వచ్చాడు. అందరూ ఏకమైనప్పుడే ఇలాంటి ఒక కుట్రను ఛేదించగలమనే విషయాన్ని స్పష్టం చేశాడు. ముస్లిమ్స్ లో కొందరు గొప్పవాళ్లు పేర్లను ఒక పాత్రతో చెప్పిస్తూ, కథను బ్యాలెన్స్ చేసే ప్రయత్నం కూడా జరిగింది.
ప్రధానమైన పాత్రలను పోషించిన ఉల్కా గుప్తా .. అదితి భాటియా .. ఐశ్వర్య ఓజా తమ పాత్రలకు న్యాయం చేశారు. కామాఖ్య నారాయణ్ సింగ్ ఈ కథను తెరపై ఆవిష్కరించిన తీరు బాగుంది. హిందూ అమ్మాయిలను ట్రాప్ లో పడేసే సన్నివేశాలతో ఫస్టాఫ్ .. ఆ తరువాత వాళ్లు ఫేస్ చేసే పరిస్థితులతో సెకండాఫ్ కొనసాగుతుంది.
ఇంటర్వెల్ బ్యాంగ్ తో సెకండాఫ్ పై ఆసక్తిని పెంచిన విధానం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి మరీ నాటకీయంగా .. రొటీన్ గా అనిపిస్తుంది. అభిజిత్ చౌదరి కెమెరా పనితనం .. మన్నన్ షా నేపథ్య సంగీతం .. సంజయ్ శర్మ ఎడిటింగ్ కథను మరింత బలంగా నడిపించడానికి దోహదం చేశాయి.నెక్స్ట్ ఏం జరగనుందనేది ప్రేక్షకులు ఊహించగలిగేలా ఉండటం .. ఊహించినట్టుగానే జరగడం ఈ కథలో ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది.
'ది కేరళ స్టోరీ 2' (జీ 5) మూవీ రివ్యూ!
The kerala Story 2 Review
Movie Details
Movie Name: The kerala Story 2
Release Date: 2026-05-01
Cast: Ulka Gupta,Aditi Bhatia ,Aishwarya Ojha,Sumit Gahlawat,Arjan Singh Aujla,Yuktam Kholsa
Director: Kamakhya Narayan Singh
Music: Mannan Shaah
Banner: Sunshine Pictures
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer