'కర' - మూవీ రివ్యూ!

ధనుశ్ కథలను ఎంచుకునే తీరు .. పాత్రలను సెలెక్ట్ చేసుకునే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలనే ఆయన ఎంచుకుంటూ వెళుతుంటాడు. ఆ పాత్రలకు పూర్తి న్యాయం చేస్తుంటాడు. ఆయన సక్సెస్ గ్రాఫ్ కి ప్రధానమైన కారణం కూడా ఇదే. అలాంటి ధనుష్ నుంచి వచ్చిన తాజా చిత్రమే 'కర'. విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజు (ఏప్రిల్ 30)న థియేటర్లకు వచ్చింది. 

'కరసామి' (ధనుశ్)ను అతని సన్నిహితులంతా 'కర' అని పిలుస్తుంటారు. తన స్నేహితుడైన మురుగేశ్ తో కలిసి దొంగతనాలు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. మల్లి (మమితా బైజు)తో ఆయన పెళ్లి జరుగుతుంది. అయితే ఒక మారుమూల గ్రామంలో నివసించే అతని తల్లిదండ్రులకు ఈ విషయం తెలియదు. 16 ఏళ్ల క్రితం ఇంట్లో నుంచి డబ్బు తీసుకుని పారిపోయిన కరసామి కోసం వాళ్లు ఎదురుచూస్తూనే ఉంటారు. మళ్లీ ఇంతకాలానికి తన భార్యతో కలిసి కరసామి ఆ ఊళ్లో అడుగుపెడతాడు.  

కరసామి దొంగతనాలు మానేసి, ప్రస్తుతం తాను ఉంటున్న టౌన్లో బ్యాంక్ లోన్ తీసుకుని ఒక 'మెస్' పెట్టాలని అనుకుంటాడు. అందుకు షూరిటీగా తన 8 ఎకరాల భూమి కాగితాలు పెట్టుకోవచ్చనే ఉద్దేశంతో సొంత ఊరుకు వస్తాడు. అయితే అక్కడ పంటలు పండకపోవడంతో రైతులంతా అప్పులతో బాధలు పడుతుంటారు. తన తండ్రి వ్యవసాయం చేసే 8 ఎకరాల పొలంతో పాటు, మిగతా వాళ్లందరి భూములు బ్యాంకు తాకట్టులో ఉన్నాయనే విషయం అర్థమవుతుంది. 

మరికొంతకాలంలో ఆ పొలాలన్నీ ఆ బ్యాంకు జప్తు చేయనుందనే విషయం కరసామికి అర్థమవుతుంది. రైతులంతా ఇలా రోడ్డున పడుతుండటానికి సూత్రధారి ఒక ప్రైవేట్ బ్యాంకుకి చెందిన 'ముత్తు సెల్వన్' (జయరామ్) అనే విషయం కరసామి తెలుసుకుంటాడు. అతని బ్యాంకుకే కన్నం వేసి, ఆ డబ్బుని తిరిగి అదే బ్యాంకులో జమచేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? వాటిని అతను ఎలా అధిగమిస్తాడు? అనేది కథ.
   
గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. తమకి పంటను ఇచ్చే భూమిని వాళ్లు దైవంగా భావిస్తూ ఉంటారు. తమ పూర్వీకుల సమాధులను కూడా పొలాలలోనే కడుతూ ఉంటారు. ఆ మట్టిలోనే తాము కూడా కలిసిపోవాలనే ఒక బలమైన కోరికతో ఉంటారు. తమ ప్రాణం పోతున్నా అలాంటి భూమిని అమ్ముకోవడానికి ఒప్పుకోరు. అలాంటి ఒక తండ్రి కథ ఇది. 

ఇక భూమి అనేది వారసత్వంగా తమకి సంక్రమించే ఆస్తిగా మాత్రమే కొందరు చూస్తుంటారు. తమ అవసరాల కోసం ఆ భూమిని అమ్మేయడానికి వాళ్లు ఎంతమాత్రం వెనుకాడరు. అలాంటివాళ్లకి ఆ నేలతో తమ తల్లిదండ్రులకు గల ఎమోషన్స్ అర్థం కావు. ఆ పొలాన్ని అమ్మేసుకుని అవతల పడాలనే వాళ్లు ఎదురుచూస్తుంటారు. అలాంటి ఒక బలమైన ఉద్దేశంతో ఉన్న ఒక కొడుకు కథ ఇది.

 కెరియర్ లో తనకి రావలసిన క్రెడిట్ ను ఇతర అధికారులు పట్టుకుపోతుంటే, అమాయకంగా చూస్తూ వచ్చిన పోలీస్ అధికారి భరతన్ (సూరజ్ వెంజరమూడు). రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న అతను, కరసామిని చట్టానికి అప్పగించి పేరు తెచ్చుకోవాలనే పట్టుదలతో ఉంటాడు. ఇక ధనదాహంతో ఆరాటపడే బ్యాంకు చైర్మన్ ముత్తు సెల్వన్ పాత్రలో జయరామ్ కనిపిస్తాడు. ఈ నాలుగు ప్రధానమైన పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతుంది.

దర్శకుడు ప్రేక్షకుల దగ్గర ఏ విషయాన్ని దాచకుండా ఈ కథను నడిపించాడు. ఎవరు చేస్తున్నారు? .. ఎందుకు చేస్తున్నారు? అనే విషయం ఆడియన్స్ కి ముందుగానే చెప్పేస్తాడు. ఇక హీరో ఉద్దేశమేమిటో .. అతను ఏం చేయాలనుకుంటున్నది కూడా చెబుతాడు. తన ముందున్న సమస్యను హీరో ఎలా పరిష్కరిస్తాడు? అనేది తెలుసుకోవడం కోసం మాత్రమే ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. 

 ఈ కథలో కరసామి ఓ దొంగ. ఆయన దొంగతనానికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించిన విధానం ఈ సినిమాకి హైలైట్ గా అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్ గా 'ఆడుకాలం' నరేన్ బ్యాంకు కి వచ్చిన సీన్ కూడా చాలా రోజుల పాటు గుర్తుండిపోతుంది.    ఈ దృశ్యాలు సింపుల్ గా అనిపిస్తూ .. సీరియస్ గా కనిపిస్తూ .. కామెడీ టచ్ తో నవ్విస్తాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ వైపు నుంచి కూడా ఈ కథ కనెక్ట్ అవుతుంది.

ధనుశ్ పాత్రను డిజైన్ చేసిన విధానం బాగుంది. తన కోరిక నెరవేరితే చాలని అనుకున్న కరసామి, ఆ తరువాత తన తండ్రి కల నిజమైతే చాలని భావిస్తాడు. చివరికి తన ఊరంతా ఎదుర్కుంటున్న సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. ఆయన పాత్రలోని ఈ మార్పులను ఆవిష్కరిస్తూ వెళ్లిన విధానం ఆకట్టుకుంటుంది.

పేరు కోసం ఆరాటపడే పాత్రలో సూరజ్ వెంజరమూడు .. డబ్బు కోసం పరిగెత్తే పాత్రలో జయరామ్ నటన ఆకట్టుకుంటుంది. కేఎస్ రవికుమార్ పాత్ర నిడివి తక్కువే అయినా, ఆయన పాత్ర చూపిన ప్రభావం ఎక్కువేనని చెప్పాలి. మమితా బైజు నటన కూడా ఓకే.  తేని ఈశ్వర్ ఫొటోగ్రఫీ బాగుంది. జీవీ ప్రకాశ్ కుమార్ బాణీలు ఓ మాదిరిగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంటుంది.

ఈ కథ నిదానంగా మొదలవుతుంది .. నింపాదిగా నడుస్తుంది. ఎక్కడా హడావిడి కనిపించదు. అలాగని బోర్ అనిపించదు. ఎందుకంటే కథాకథనాలు .. సన్నివేశాలు బలంగా ఉంటాయి .. ఎమోషన్స్ తో ముడిపడి ఉంటాయి. యాక్షన్ సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ధనుశ్ కెరియర్లో ఒక మంచి కంటెంట్ గా నిలిచిపోయే ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. 

Movie Details

Movie Name: Kara

Release Date:

Cast: Dhanush, Mamitha Baiju, KS Ravikumar, Karunas, Jayaram, Prithvi Rajan

Director: Vignesh Raja

Producer: Ishari K Ganesh

Music: GV Prakash Kumar

Banner: Vels Film International

Kara Rating: 2.75 out of 5

Trailer

More Movie Reviews