కొంతకాలం క్రితం వరకూ తెలుగు ప్రేక్షకులు, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ కథలపట్ల ఆసక్తిని కనబరుస్తూ వచ్చారు. అయితే ఓటీటీ అందుబాటులోకి వచ్చిన తరువాత కొరియన్ సినిమాలు .. సిరీస్ ల పట్ల ఎక్కువ కుతూహలాన్ని చూపుతున్నారు. దాంతో కొరియన్ సిరీస్ లకు తెలుగు అనువాదంతో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అలా వచ్చిన మరో సిరీస్ గా 'ఇఫ్ విషెస్ కుడ్ కిల్' కనిపిస్తోంది. 8 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్, ఈ నెల 24వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.
అది కొరియాలోని ఒక హైస్కూల్. అక్కడ గెన్ - వూ (బేక్ సన్ - హూ) అతని స్నేహితులు కలిసి చదువుకుంటూ ఉంటారు. ఈ ఐదుగురు స్నేహితులతో లిమ్ నా-రి( కాంగ్ మి-నా), సే-య (జియోన్ సో - యంగ్) గెన్ - వూను ప్రేమిస్తూ ఉంటారు. ఆ బృందంలో 'హా - జూన్'(హ్యూన్ వూ-సిక్) ఫస్టు మార్కులు తెచ్చుకుంటూ ఉంటాడు. అయితే ఈ సారి అతనితో పాటు 'యాంగ్ ఓక్' కూడా మంచి మార్కులు తెచ్చుకోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తుంది.
'గిరిగో' పేరుతో కోరికలు నెరవేర్చే యాప్ ఒకటి ఉందనీ, ఆ యాప్ లోకి వెళ్లి కోరిక చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతుందని తన ఫ్రెండ్స్ తో యాంగ్ ఓక్ చెబుతాడు. తనకి అన్ని మార్కులు రావడానికే కారణం అదేనని అంటాడు. ఆ యాప్ లింక్ వాళ్లకి పంపిస్తాడు. అయితే యాంగ్ ఓక్ కోరిక తీరిన దగ్గర నుంచి 24 గంటలకు సంబంధించిన సమయం కౌంట్ డౌన్ మొదలవుతుంది. ఆ కౌంట్ డౌన్ పూర్తయ్యే సమయానికి అతను సూసైడ్ చేసుకుని చనిపోతాడు. గెన్-వూ కూడా ఆ యాప్ లో తన కోరిక చెప్పుకుంటాడు. ఆ కోరిక తీరగానే అతని కౌంట్ డౌన్ మొదలవుతుంది.
కోరికను నెరవేర్చిన 24 గంటలలో ఆ కోరిక కోరినవారిని ఏదో అదృశ్య శక్తి చంపేస్తుందని వాళ్లు గ్రహిస్తారు. ఆ యాప్ ని డిలీట్ చేయడానికీ .. కౌంట్ డౌన్ కి సంబంధించిన టైమర్ ను ఆపేయడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోతోంది. ఒకసారి కౌంట్ డౌన్ మొదలైందంటే, వారి మరణం సంభవించేవరకూ ఇక దానిని ఆపటం అసాధ్యమనే విషయం అర్థమవుతుంది. దాంతో దీని వెనుక ఏదో క్షుద్రశక్తి ఉందని భావించిన 'హా జూన్', మాంత్రికురాలైన తన అక్కయ్య 'హా -యాంగ్'ను ఆశ్రయిస్తాడు.
అప్పుడు 'హా-యాంగ్' ఏం చేస్తుంది? గతంలో ఏం జరిగింది? యాప్ ను క్రియేట్ చేసింది ఎవరు? ఈ యాప్ కీ, క్షుద్రశక్తులకి మధ్య గల సంబంధం ఏమిటి? ఈ విషయాన్ని ఛేదించడంలో వాళ్లకి ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి? భయంకరమైన ఈ వలయంలో నుంచి సే-య వాళ్లు ఎలా బయటపడతారు? అనేదే కథ.
కొరియన్ సిరీస్ లు చూసే అలవాటు ఉన్నవారికి, వాళ్ల సినిమాలలో మంచి ఫీల్ ఉంటుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. లవ్ స్టోరీస్ విషయంలో వాళ్లు మరిన్ని మార్కులు కొట్టేస్తూ ఉంటారు. అలాంటి ఒక వాతావరణంలోనే ఈ కథ మొదలవుతుంది. హైస్కూల్ వాతావరణం .. టీనేజ్ స్టూడెంట్స్ .. ఆకర్షణలు .. ప్రేమలు .. క్లాస్ రూమ్స్ లో అల్లర్లుతో ఈ సిరీస్ ఆరంభమవుతుంది. ఆ తరువాతనే హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ సినిమాలను తలపిస్తుంది.
క్షుద్రశక్తులకు సంబంధించిన కథలు రకరకాల కోణాలలో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాయి. మాంత్రికులు .. మంత్రగత్తెలు .. వాళ్లు చేసే ప్రయాగాలు చూస్తూనే వచ్చారు. చేతబడి - వశీకరణ మొదలైన అంశాలకు సంబంధించిన కంటెంట్ ను ఆదరిస్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమా విషయానికి వచ్చేసరికి, ఒక యాప్ కి .. క్షుద్రశక్తిని జోడిస్తూ కథను అల్లుకుంటూ వెళ్లిన విధానం కొత్తగా అనిపిస్తుంది.
క్షుద్రశక్తితో ముడిపడిన ఒక యాప్ .. ఆ యాప్ కారణంగా జరుగుతున్న మరణాల నుంచి బయటపడటానికి స్టూడెంట్స్ పడే పాట్లు .. వాళ్లకి సాయపడటానికి ఒక మాంత్రికురాలు చేసే ప్రయత్నాలతో ఈ కథ చాలా ఉత్కంఠభరితంగా సాగుతూ వెళుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కూడా ఈ కథను మరింత బలంగా నమ్మడానికి దోహదం చేస్తుంది.
కోరిన కోరికలను నెరవేర్చే ఒక యాప్ .. కోరికను నెరవేర్చిన 24 గంటలలో సదరు వ్యక్తుల మరణానికి కారణమవుతూ ఉంటుంది. పొంతనలేని రెండు అంశాల మధ్య అల్లుకున్న ఈ కథ ఎలా ఉంటుందో ఏమో అని సందేహం తప్పకుండా కలుగుతుంది. కానీ మన ఆలోచనలను అటు వైపు వెళ్లనీయకుండా భయపెడుతూ వెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఆర్టిస్టులంతా తమ పాత్రలకు జీవం పోశారు.
కథ మధ్యలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ .. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ .. క్లైమాక్స్ సన్నివేశాలను డిజైన్ చేసిన తీరు బాగుంది. చివరి రెండు ఎపిసోడ్స్ ఆడియన్స్ లో మరింత ఉత్కంఠను రేకెత్తిస్తూ నడుస్తాయి. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం చూస్తే, హాలీవుడ్ సినిమాలకి ఎంత మాత్రం తగ్గకుండా భయపెడుతుంది.
ఇది కేవలం ఫొటోగ్రఫీ పరంగా .. సౌండ్ ఎఫెక్ట్స్ పరంగా మాత్రమే భయపెట్టే సినిమా కాదు. విపరీతమైన రక్తపాతంతో కూడిన దృశ్యాలు అనేకం కనిపిస్తాయి. రక్తం వర్షం .. రక్తపు వరద .. రక్తం ఎగజిమ్మడం వంటి సన్నివేశాలు భయాపెట్టేస్తాయి. తలపక్కకి తిప్పుకునేలా చేస్తాయి. హారర్ థ్రిల్లర్ సినిమాలను చూసే అలవాటు ఉన్నవారు, సరైన కంటెంట్ దక్కిందనే అనుకుంటారు. అలవాటు లేనివారు ఈ సిరీస్ ను చూడకపోవడమే మంచిది.
'ఇఫ్ విషెస్ కుడ్ కిల్' (నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!
If Wishes Could Kill Review
Movie Details
Movie Name: If Wishes Could Kill
Release Date: 2026-04-24
Cast: Jeon So young, track and field ,Kang Mi na,Baek Sun ho, Hyun Woo-seok
Director: Park Youn seo
Music: -
Banner: CJ ENM Studios - Kairos Makers
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer