'మామ్లా లీగల్ హై' .. 2024లో వచ్చిన కోర్టు రూమ్ కామెడీ డ్రామా. అప్పట్లో 8 ఎపిసోడ్స్ తో రూపొందిన సిరీస్ ఇది. రవికిషన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఆ సిరీస్ కి మంచి ఆదరణ లభించింది. అలాంటి ఈ సిరీస్ నుంచి సీజన్ 2 గా, మరో 8 ఎపిసోడ్స్ ను వదిలారు. ఈ నెల 3వ తేదీ నుంచి హిందీతో పాటు మిగతా భాషలలోను అందుబాటులోకి వచ్చింది.
అది ఢిల్లీ పరిధిలోని 'పట్పర్ గంజ్' జిల్లా కోర్టు. ప్రతిరోజూ అక్కడికి ఎన్నో కేసులు వస్తుంటాయి. ఆ కేసులకు సంబంధించినవారితో అక్కడ ఎప్పుడూ హడావిడితో కూడిన ఒక వాతావరణం నెలకొని ఉంటుంది. అక్కడికి వచ్చినవారి స్వభావాలు న్యాయవాదులను ఇబ్బందిపెడుతూ ఉంటాయి. కొత్తగా వచ్చిన కేసులను దక్కించుకుని తమ సత్తా చాటుకోవాలనే పట్టుదలతో జూనియర్ లాయర్లు ఉంటారు. వాళ్ల మధ్య గ్రూపులు .. ఆ గ్రూపుల మధ్య పోటీ గట్టిగా ఉంటుంది.
అలాంటి జిల్లా కోర్టులో న్యాయవాదిగా ఎంతో అనుభవం ఉన్న త్యాగి (రవి కిషన్), జడ్జిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. అయితే ఆయన ప్రమాణ స్వీకారం సరిగ్గా జరగలేదని భావించిన కమిటీ, జడ్జిగా ఆయన అధికారాలను తాత్కాలికంగా నిలిపివేస్తుంది. తాను మరోసారి ప్రమాణ స్వీకారం చేయనని త్యాగి మొండికేస్తాడు. అతని అభిప్రాయం సరైనదేనంటూ కొంతమంది మద్దతుగా నిలుస్తారు. అది కమిటీ సభ్యులను ఇరకాటంలో పడేస్తుంది.
కోర్టులో రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఆ పరిమాణాలను ఛాంబర్ లోని సుజాత .. విశ్వాస్ పాండే .. మింటూ .. అనన్య .. పరిశీలిస్తూ ఉంటారు. ఎవరి కేసులకు సంబంధించిన సమస్యలను వాళ్లు చక్కబెడుతూనే, జరుగుతున్న పరిణామాలను ఒక కంట గమనిస్తూ ఉంటారు. వాళ్ల ముందుకు వచ్చిన ఆ కేసులు ఏమిటి? ఆ సమస్యలను వాళ్లు ఎలా పరిష్కరిస్తారు? త్యాగికి ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి? అనేది కథ.
ఇది ఒక జిల్లా కోర్టు చుట్టూ తిరిగే కథ. న్యాయవాదులు .. న్యాయమూర్తులు .. కేసులు .. అందుకు సంబంధించిన రాజకీయ పరిణామాలను ప్రధానంగా చేసుకుని ఈ కథ ముందుకు వెళుతుంది. కేసులకు సంబంధించిన సవాళ్లు .. వాటిని ఎదుర్కోవడానికి నానా పాట్లు పడే జూనియర్లతో ఈ కథ నడుస్తూ ఉంటుంది. ప్రతి కేసును ఒక కథగా నడిపించిన తీరు మెప్పిస్తుంది.
కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు .. అత్తగారి వేధింపులకు సంబంధించిన సమస్య ఒకటైతే, రౌడీలను హీరోలుగా ఊహించుకుని వాళ్ల అభిమానులుగా మారిపోతున్న పిల్లల సమస్య ఒకటి. పెర్ఫ్యూమ్ వాడటం వలన వచ్చిన ఎలర్జీ .. అందుకు సంబంధించిన నష్టపరిహారంపై పోరాడే వారు ఒకరైతే, తన పట్ల ఇంటి ఓనర్ అసభ్యంగా ప్రవర్తించిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన నికుంజ్ కేసు ఒకటి. ఇలా ఒక్కో కేసును ఒక్కో కథగా మలుపులు తీసుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది.
జిల్లా కోర్టు .. ఆ పరిసరాలు .. లాయర్లు .. కేసులు .. బాధ్యులు .. ఇలా అనేక రకాల స్వభావాలు కలిగినవారి పాత్రలను క్రియేట్ చేసిన విధానం సహజత్వానికి దగ్గరగా అనిపిస్తుంది. అయితే ఈ పాత్రలను కామెడీచ్ తో ఆవిష్కరిస్తూ వెళ్లారు. ప్రతికేసు ఒక కథగా .. హాస్యభరితంగా తీర్చిదిద్దారు. అయితే కామెడీ ఆశించిన స్థాయిలో పండలేదు. చాలావరకూ అనవసరమైన హడావిడిగానే అనిపిస్తుంది.
ప్రతి కేసులో .. ప్రతి కథలో ఆసక్తికరమైన మలుపులు లేకపోవడం నిరాశ పరుస్తుంది. నెక్స్ట్ ఏం జరుగనుందా అనే ఒక కుతూహలం ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. కొన్ని కేసులు .. వాటికి సంబంధించిన కథలు బలహీనంగా ఉండటం .. వాటిని సాగదీయడం ఇబ్బంది పెడుతుంది. జూనియర్లకు సవాళ్లు విసిరే కేసులు .. ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించే కేసులు లేకపోవడం .. కామెడీ పెద్దగా వర్కౌట్ కాకపోవడం నిరాశపరుస్తుంది.
రవికిషన్ మొదలు చాలామంది ఆర్టిస్టులు సీజన్ 2లో కొనసాగారు. ఎవరి పాత్రలో వారు చాలా ఈజీగా చేసేశారు. కాకపోతే ఎంచుకున్న కథల్లో బలం లేకపోవడం వలన పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఆర్టిస్టుల పరంగా బలంగా .. కథాకథనాల పరంగా బలహీనంగా కనిపించే కంటెంట్ గా ఈ సిరీస్ ను గురించి చెప్పుకోవచ్చు.
'మామ్లా లీగల్ హై 2' (నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!
Maamla Legal Hai Review
Movie Details
Movie Name: Maamla Legal Hai
Release Date: 2026-04-03
Cast: Ravi Kishan, Naila Grrewal, Nidhi Bisht, Amith Joshi, Brajendra
Director: Rahul Pande
Music: -
Banner: Posham PA
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer