సహాయ నటుడిగా, విలన్‌గా విభిన్నమైన పాత్రలు, వైవిధ్యమైన సినిమాలను ఎంచుకునే సముద్రఖని, తన మనసుకు నచ్చిన సినిమాలు వస్తే ప్రధాన పాత్రల్లో నటిస్తుంటారు. ఆ కోవలోనే సముద్ర ఖని లీడ్ పాత్రలో నటించిన చిత్రం 'కార్మేని సెల్వం'. రామ్ చక్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? కథ ఏమిటి? రివ్యూలో తెలుసుకుందాం.
దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన సెల్వం ( సముద్ర ఖని), సంపత్ (గౌతమ్ మీనన్), దేవి దంపతుల వద్ద కార్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. సెల్వంను వాళ్లు ఇంట్లో వ్యక్తిగా చూస్తుంటారు. ఇక సెల్వం భార్య శాంతి (లక్ష్మీ) కూడా భర్తకు ఆసరాగా ఇడ్లీ బండి నడుపుతూ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటుంది. భార్యభర్తలు ఇద్దరూ ఎలాగైనా డబ్బులు దాచుకుని ట్యాక్సీ నడుపుకోవడానికి ఓ కారు, ఓ సొంతిల్లు కట్టుకోవాలని ఆశ పడుతుంటారు. ఇందుకోసం వారి రోజువారి సంపాదనలో కొంత డబ్బును దాచుకుంటారు. కానీ మేనకొడలు శుభాకార్యంలో సారె పెట్టే విషయంలో వీళ్లకు అవమానం జరుగుతుంది. దీంతో ఉన్న డబ్బుతో పాటు శాంతి తన మెడలో ఉన్న బంగారాన్ని కూడా అమ్మేసి సారె పెడుతుంది.
ఈ సమయంలోనే సెల్వం కుమారుడికి ప్రమాదం జరగడం, హాస్పటల్ ఖర్చు కోసం అప్పు చేయడం, డబ్బు కోసం సెల్వం, సంపత్ ఊర్లో లేని సమయాన్ని చూసి ఆయన కారుని ట్యాక్సీకి వాడటం మొదలు పెడతాడు. దీంతో పాటు తన తాహతుకు మించిన అప్పులు చేస్తాడు. ఈ అప్పులు తీర్చడానికి సెల్వం ఏకంగా దేశాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది? అసలు సెల్వం అప్పులు ఎందుకు చేశాడు? ఆ అప్పులు ఎలా తీర్చాడు? సెల్వం దేశాన్ని వదిలి ఎక్కడికి వెళ్లాడు? చివరికి జరిగిందేమిటి? అనేది మిగతా కథ.
మధ్య తరగతి మనిషి ఆడంబరాల కోసం, ఇతరులతో పోల్చుకుంటూ అప్పులు చేస్తే కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి? మనిషి ఉరుకుల పరుగుల జీవితంలో తన కోసం, కుటుంబం కోసం సమయం కేటాయించుకుండా, సంపాదన బిజీలో పడి ఎలాంటి మధురానుభూతులను కోల్పోతున్నాడు అనే రెండు విభిన్న అంశాలను దర్శకుడు ఈ చిత్రం ఇతివృత్తంగా తీసుకున్నాడు. 'కార్మేని సెల్వం'లాంటి మధ్య తరగతి వ్యక్తి, ప్రస్తుత మాయ ప్రపంచంలో పడి ఎలా అప్పుల పాలయ్యాడు? ఆ ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మళ్లీ ఎలాంటి తప్పులు చేయాల్సి వచ్చింది? అనేది దర్శకుడు ఈ కథ ద్వారా నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాడు.
సాధారణంగా ఇలాంటి సినిమాలు తెరపై ఆవిష్కరించే సమయానికి కథనం చాలా నిదానంగా ఉంటుంది. కథ, కథనాల్లో భావోద్వేగాలు ఉన్నప్పటికీ కథ ముందుకు జరగదు.ఈ సినిమాకు కూడా అదే మైనస్‌గా మారింది. సారె పెట్టే విషయంలో తన కుటుంబానికి అవమానం జరిగే మధ్య తరగతి మహిళ ఎలా రియాక్ట్ అవుతుందనే విషయాన్ని దర్శకుడు ఎంతో సహజంగా చూపించాడు. సెల్వం, శాంతిల మధ్య అనుబంధాన్ని ఎంతో ఎమోషనల్‌గా తెరకెక్కించాడు. ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి.
యజమాని సంపత్, కార్ డ్రైవర్ సెల్వంపై చూపే అభిమానం, సంపత్ భార్య విషయంలో సెల్వం భావోద్వేగం, ఇలాంటి సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. కుటుంబ కోసం ఓ మధ్య తరగతి వ్యక్తి పడే ఆరాటం, ఎదుర్కొనే అవమానాలు ఇలా ప్రతి అంశాన్ని దర్శకుడు ఈ చిత్రంలో ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. అయితే దర్శకుడు సినిమా ప్రీ క్లైమాక్స్ వరకు కూడా మిడిల్ క్లాస్ మనుషుల కష్టాలు, ఆడంబరాలకు పోతే వాళ్లు ఎదుర్కొనే ఇబ్బందులు చెప్పే ప్రయత్నం చెప్పడంతో పాటు ప్రీ క్లైమాక్స్‌లో సంపత్ పాత్రతో (గౌతమ్ మీనన్) ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నేను ఏమీ కొల్పోయానో తెలుస్తుంది.. అంటూ మరో జీవిత పాఠం చెప్పిస్తాడు.
ఈ రెండు అంశాలు కూడా ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతాయి. దర్శకుడు చాలా చిన్న కాన్సెప్ట్‌తో ఈ అంశాన్ని తెరకెక్కించినట్లుగా అనిపించినా.. ఈ కథాంశం వెనుక లోతైన భావన ఉంది. కమర్షియల్ అంశాలను పక్కన పెట్టి నిజాయితీగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పే ప్రయత్నంలో కొన్ని అంశాలు రీపీటెడ్గా అనిపిస్తాయి. ఓవరాల్‌గా 'కార్మేని సెల్వం' అక్కడక్కడా మనసుకు తాకే భావోద్వేగాలతో హృదయాలను హత్తుకున్నాడు.
మిడిల్ క్లాస్ వ్యక్తిగా సముద్ర ఖని సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌తో చెప్పాలనుకున్న విషయాన్ని కన్వే చేసినట్లుగా అనిపిస్తుంది. మధ్య తరగతి కుటుంబానికి అండగా నిలిచే మధ్య తరగతి భార్యగా లక్ష్మీప్రియ సరైన చాయిస్ అనిపించే విధంగా మెప్పించింది. గౌతమ్ మీనన్, అభినయ పాత్రలు బలమైన ముద్రను వేస్తాయి. దర్శకుడు తాను చెప్పాలనుకున్న విషయాన్ని కమర్షియల్ అంశాల పేరిట కథను పక్కదారి పట్టకుండా నిజాయితీగా తెరకెక్కించాడు. ఓవరాల్‌గా 'కార్మేని సెల్వం' అక్కడక్కడా బలమైన ఎమోషన్స్‌తో మనసుల్ని తాకుతుంది.
'కార్మేని సెల్వం' మూవీ రివ్యూ
Carmeni Selvam Review
Movie Details
Movie Name: Carmeni Selvam
Release Date: 2026-04-03
Cast: Samuthirakani, Gautham Vasudev Menon, Lakshmi Priya, Abhinaya, Karthik Kumar, Badava Gopi, Kothandam, Karan Chakravarthi, Shankara Narayanan V, Haritha Parakod
Director: Ram Chakri
Music: MAAS
Banner: Pathway Productions
Review By: Maduri Madhu
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer