'రాకాస' మూవీ రివ్యూ

సినిమాలు జనాదరణ పొందాలంటే ఎంచుకునే కథాంశంలో కొత్తదనంతో పాటు ఇంట్రెస్టింగ్‌ జోనర్‌ కూడా ముఖ్యం. అలాంటి ఇంట్రెస్టింగ్‌ జోనర్‌ల్లో ఒకటి హారర్‌ కామెడీ. ఇలాంటి నేపథ్య కథకు ఫాంటసీ అంశాలను కూడా జోడించి నిర్మించిన చిత్రం 'రాకాస'. సంగీత్‌ శోభన్‌ కథానాయకుడిగా రూపొందిన ఈ చిత్రాన్ని నిహారిక కొణిదెల నిర్మించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన 'రాకాస' ప్రేక్షకులను భయపెట్టిందా? ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని పంచింది? అనేది చిత్ర సమీక్షలో తెలుసుకుందాం. 

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అమెరికా నుంచి సొంత గ్రామానికి తిరిగొస్తాడు ఈరబాబు అలియాస్‌ వీరు (సంగీత్‌ శోభన్‌). కానీ తను ప్రేమించిన అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందని తెలుసుకున్న ఈరబాబు ఎలాగైనా ఆ పెళ్లిని ఆపాలని  స్నేహితుడు బాలు (గెటప్‌ శీను)తో కలిసి ప్లాన్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆ ఊరిలోనే ఉంటున్న సుబ్బలక్ష్మీ (నయన సారిక)ను కలుస్తాడు.  ఇక అనుకోకుండా  ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. పూర్వీకుల కాలం నుంచి ఊరికి ఉన్న శాపం ప్రకారం ఊరి కోటలో ఉండే రాక్షసుడు నరబలి కోరడం జరగుతుండేది.

 ఇందుకు వచ్చే మూడు హెచ్చరికల తరువాత నరబలికి సిద్ధమయ్యే పేరును ఊరి పెద్దలు ఖరారు చేస్తారు. ఆ వ్యక్తిని కోటలోకి పంపితే ఊరి సుభిక్షంగా ఉంటుందనేది వారి నమ్మకం. లేకపోతే ఊరంతా నాశనమవుతుందని భయపడుతుంటారు. అయితే కొన్ని కారణాల వల్ల ఊరి కోటలోకి ఈరబాబు వెళ్లాల్సి వస్తుంది. మరి కోటలోకి వెళ్లిన వీరబాబు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? కోటలోకి వెళ్లిన ఆయన తిరిగొచ్చాడా? ఈరబాబు కోసం కోటలోకి వెళ్లిన బాలు, సుబ్బలక్ష్మీలు ఏం చేశారు? అసలు కోటలో ఉన్న రాక్షసుడు ఎవరు? ఇలాంటి అన్ని విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


సాధారణంగా హారర్‌ కామెడీ సినిమాలు అంటే.. ఒక కోట, అందులో ఆత్మలు, దెయ్యాలు, రాక్షసులు, హీరో, అతని స్నేహ బృందం  అనుకోకుండా ఆ కోటకు వెళ్లడం.. అక్కడ చిక్కుకోవడం, హీరో బృందం చేసే కామెడీ.. ఓ చిన్న ట్విస్ట్‌తో ఇంటర్వెల్‌ బ్యాంగ్‌...   చివర్లో రాక్షసుడిని అంతం చేసి కోట నుంచి సురక్షితంగా బయటపడటం.. ఇలాంటి నేపథ్యంతోనే సినిమాలు వస్తుంటాయి. ఇక 'రాక్షస' కూడా అచ్చంగా ఇలాంటి కథాంశంతోనే వచ్చింది. అయితే ఈ హారర్‌ కామెడీ కాస్త ఫాంటసీ అంశాలు జోడించారు. అయితే అన్ని హారర్‌ కామెడీ చిత్రాల తరహాలో ఈ చిత్రంలో ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేయలేదు. ఫాంటసీ అంశాలతో అలరించే ప్రయత్నం చేశారు మేకర్స్‌. 

అయితే ఇలాంటి సినిమాకు భయపెడుతూనే వినోదంతో అలరించడం ఎంతో ముఖ్యం.  ఈ సినిమా ఈ రెండు అంశాల్లో విఫలమైందని చెప్పాలి. సెకండాఫ్‌లో అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో మినహా హాస్యం పండలేదు. ఆడియన్స్‌ను పెద్దగా భయపెట్టే సన్నివేశాలు, థ్రిల్ల్‌ను పంచే సీన్స్‌ కూడా కనిపించవు. ఫస్ట్‌హాఫ్‌లో హీరో అమెరికా నుంచి తిరిగిరావడం, హీరోని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకునే సన్నివేశాలు మినహా ఎక్కడా కూడా ఏ సన్నివేశం కూడా కామెడీని జనరేట్‌ చెయ్యవు. ద్వితీయార్థంలో హీరో కోటలోకి వెళ్లినప్పుడైనా హిలేరియస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుందని ఆశించిన ఆడియన్స్‌ అక్కడక్కడా నవ్వుకుంటూ సంతృప్తిపడాల్సి వస్తుంది. 

పతాక సన్నివేశాలు, అందులో భాగంగా రాక్షసుడు, హీరో, హీరో బృందం మధ్య వచ్చే సీన్స్‌ మాత్రం ఎంగేజింగ్‌గా ఉంటాయి. ద్వితీయార్థం తరహాలోనే  ఇంటర్వెల్‌కు ముందు భాగంలో కూడా సరైన ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఈ చిత్రబృందం ప్రమోషన్స్‌తో తెచ్చిన బజ్‌కు తగిన అంచనాలకు సరిపోయే విధంగా ఈ చిత్ర కథాంశం, కంటెంట్‌ లేకపోవడం ఈ చిత్రానికి మైనస్‌గా మారింది. ఓవరాల్‌గా అక్కడక్కడ నవ్విస్తూ, భయపెడుతూ 'రాకాస' ఆడియన్స్‌కు పూర్తిస్థాయి వినోదాన్ని మాత్రం అందించలేక పోయింది.

మ్యాడ్‌, మ్యాడ్‌-2 చిత్రాల్లో పూర్తి స్థాయి కామెడీ పాత్రలో నటించిన సంగీత్‌ శోభన్‌ ఈ సినిమాలో కాస్త విభిన్నమైన పాత్రలో కనిపించాడు. ఈరబాబు పాత్రలో తనదైన ఎనర్జీతో అలరించాడు. అయితే సన్నివేశాల్లో కామెడీ లేకపోవడంతో తనదైన నటనతో అలరించే ప్రయత్నం చేశాడు. గెటప్‌ శ్రీను, వెన్నెల కిషోర్‌, నయన సారిక అక్కడడక్కడా నవ్వించారు. వెన్నల కిషోర్‌ పాత్ర కూడా నవ్వించే ప్రయత్నం చేసినా, ఫలించలేదు.బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్‌ విద్యార్థి, రోహన్‌ రాయ్‌లు ఈ చిత్రంలో నటించారు. 

పాటలు, నేపథ్య సంగీతం ఫర్వాలేదు.  దర్శకురాలిగా మాసస శర్మ  తను అనుకున్న సన్నివేశాలు ప్రజెంట్‌ చేయగలిగినా, రచనా పరంగా మరింత శ్రద్ద పెట్టి ఉంటే ఆ సన్నివేశాలు బలంగా కనిపించేవి. కథకు తగిన విధంగా నిర్మాణ విలువలు ఉన్నాయి. ఓ డిఫరెంట్‌ ఎటెంప్ట్‌ చేయాలన్న నిర్మాత అభిరుచికి, బలమైన రచనా బృందం తోడైతే ఈ సినిమా ఫలితం మరో స్థాయిలో ఉండేది. 

హారర్‌ కామెడీ జోనర్‌, ఫాంటసీ సినిమాలను ఇష్టపడే వారికి 'రాకాస' అక్కడక్కడా నవ్విస్తూ.. భయపెడుతూ.. అలరిస్తుంది. ఇంట్రెస్టింగ్‌ జోనర్‌తో వచ్చిన ఈ సినిమాకు, ఆడియన్స్‌లో మంచి బజ్‌ కూడా తోడవ్వడంతో  ఈ వీకెండ్‌ బాక్సాఫీస్‌ కలెక్షన్లు మాత్రం ఆశాజనకంగానే ఉంటాయి.

Movie Details

Movie Name: Rakasa

Release Date:

Cast: Sangeeth Shobhan, Nayana Sarika, Vennela Kishore, Brahmaji, Tanikella Bharani, Ashish Vidyarthi, Getup Srinu, Sukwinder Singh, Annapurna, Aman, Anoop Singh Thakur, Ramana Bhargav, Vasu Inturi, Rohini , Rohan

Director: Manasa Sharma

Producer: Niharika Konidela, Umesh Kumar Bansal

Music: Anudeep Dev

Banner: Zee Studios, Pink Elephant Pictures

Rakasa Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews