హెబ్బా పటేల్ .. చైతన్యరావు .. అభినవ్ గోమఠం ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమా 'రేపు ఉదయం 10 గంటలకు'. కామెడీ టచ్ తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. గతంలో 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో'.. 'ఓ పిట్టకథ' సినిమాలకి దర్శకత్వం వహించిన చెందు ముద్దు, ఈ సినిమాను తెరకెక్కించాడు. మార్చి 14వ తేదీన థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు. ఈ నెల 27వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ కి వచ్చింది.
హైదరాబాదులో మల్లేశం (అభినవ్ గోమఠం) అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఓ రాత్రి వేళ అతను ఒక డెడ్ బాడీని తీసుకుని కాకినాడ బయల్దేరతాడు. ఆ డెడ్ బాడీతో పాటు ఆ వ్యక్తి తాలూకు మేనేజర్ రామ్మూర్తి (ఇంటూరి వాసు) ఉంటాడు. సమయానికి డెడ్ బాడీని కాకినాడకు చేర్చమని అతను మల్లేశాన్ని రిక్వెస్ట్ చేస్తాడు. మర్నాడు ఉదయం 10 గంటలకల్లా కాకినాడ చేరుస్తానని మల్లేశం అతనికి ధైర్యం చెబుతాడు.
హైదరాబాద్ కి చెందిన ప్రసాద్ - కీర్తి ప్రేమించుకుంటారు. పెద్దలను ఎదిరించలేక పారిపోతుండగా బైక్ ఆగిపోతుంది. దాంతో అటుగా వస్తున్న మల్లేశం అంబులెన్స్ ఎక్కుతారు. కీర్తి తండ్రి ఫోన్ చేసి విషయం చెప్పడంతో, ఆ జంటను పట్టుకోవడానికి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ 'ఆర్ముగం' కాకినాడ రూట్లో బయల్దేరతాడు. ఇక అదే దారిలో రఘు (చైతన్యరావు) దివ్య (హెబ్బా పటేల్) కార్లో వస్తుంటారు. పెళ్లికి ముందు ఒకసారి ఆ అనుభవం ఎలా ఉంటుందో చూడటం కోసం అతను దివ్యను మాట్లాడుకుంటాడు.
ఆ కాసేపట్లోనే దివ్యతో రఘుకి సాన్నిహిత్యం పెరుగుతుంది. తనకి రవీందర్ ( శ్రీకాంత్ అయ్యంగార్) కారణంగా ప్రాణాపాయం ఉన్న విషయాన్ని ఆ సమయంలోనే ఆమె రఘుకి చెబుతుంది. మరునాడు ఉదయం 10 గంటలకల్లా తనని కాకినాడకు చేర్చమని ఆమె అతన్ని రిక్వెస్ట్ చేస్తుంది. ఇక జానీ (ఇమ్మాన్యుయేల్) కనకరాజు (దామరాజు కిరీటి) డ్రగ్స్ కి సంబంధించిన ముఠాను తప్పించుకుని కాకినాడ రూట్లో పారిపోతూ ఉంటారు. మరునాడు ఉదయం 10 గంటలకల్లా కాకినాడ చేరుకోవాలనేది వాళ్ల ఆలోచన.
కీర్తి తండ్రి ఎవరు? దివ్య తనని ఎవరు చంపుతారని భయపడుతోంది? కనకరాజు - జానీని వెంటాడుతున్న మాఫియా ముఠాకి నాయకుడు ఎవరు? మల్లేశం తన అంబులెన్స్ లో తీసుకుం వెళుతున్న డెడ్ బాడీ ఎవరిది? అనే అంశాలు ఈ కథలో ప్రధానమైనవిగా కనిపిస్తాయి.
ఇది ఒక్క రాత్రిలో జరిగే కథ. ఒక్క రాత్రి ఎన్నో సంఘటనలకు .. సన్నివేశాలకు నిలయంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతీ రోజు రాత్రి హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్లే వారు ఎంతోమంది ఉంటారు. ఎవరి అవసరం కోసం వారు తమ గమ్యస్థానం దిశగా సాగిపోతూనే ఉంటారు. అయితే తరుముకొస్తున్న ప్రమాదం బారి నుంచి తప్పించుకోవడానికి ఎవరికి వారిగా బయల్దేరిన కొందరు ఎలాంటి పరిస్థితులలో తారసపడతారు? అనేది ఈ కథలోని ప్రధానమైన అంశం.
హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్లే హైవే పై ప్రధానమైన పాత్రలను పరిగెత్తిస్తూనే, వాళ్ల జీవితాలలోని ఎమోషన్స్ ను ఆవిష్కరించడానికి దర్శకుడు తన వంతు ప్రయత్నం చేశాడు. ప్రేమ .. సంతోషం .. ఆనందం .. డబ్బు కోసం ఆయా పాత్రలు పరిగెత్తే విధానాన్ని .. అందుకు గల కారణాలను ఆసక్తికరంగా చెప్పడానికి తమవంతు ప్రయత్నం చేశారు. ఆడియన్స్ ను ఆలోచింపజేసేలా దర్శకుడు ఈ కథను అల్లుకుంటూ వెళ్లాడు.
కాంత .. కనకం .. కీర్తి .. అనేవి వెంటపడితే దక్కేవి కాదు, వాటంతట అవి రావాలనే ఒక కొటేషన్ చుట్టూ దర్శకుడు తయారు చేసుకున్న ఈ కాన్సెప్ట్, కామెడీ టచ్ తో సాగుతుంది. చాలావరకూ ఈ కథ హైవేపైనే పరిగెడుతుంది. ఛేజింగులు గట్రా హడావిడి ఉంటుంది. కథలో కొత్తదనం కనిపించదు. గతంలో ఇలాంటి సినిమాలు చాలా చూసేశాం కదా అనే అనిపిస్తుంది.
'రేపు ఉదయం 10 గంటలకు' అనే ఈ టైటిల్ కాస్త ఆసక్తిని రేకెత్తించేదే. ఆ సమయానికి ఏం జరుగుతుంది? ఏం జరగనుంది? అనే ఒక ఒక కుతూహలం పెరుగుతుంది. పాత్రలన్నీ ఆ సమయానికి గమ్యం చేరుకోవలసి ఉంటుంది. అయితే చేరుకుంటారా లేదా? అనే ఒక ఉత్కంఠత మనకి కలగదు. ఎందుకంటే వాళ్ల సమస్యకు .. ఆ సమయానికి ఆ స్థాయి ప్రాధాన్యత ఉన్నట్టుగా కనిపించదు.
ఎవరి పాత్ర పరిధిలోవారు నటించారు. సునీల్ కుమార్ నామా కెమెరా పనితనం .. ప్రిన్స్ హెన్రీ నేపథ్య సంగీతం .. వెంకట ప్రభు ఎడిటింగ్ కంటెంట్ కి తగినట్టుగానే సాగుతాయి. చివర్లో ఒక చిన్న ట్విస్ట్ తో సింపుల్ కంటెంట్ ను తనదైన స్టైల్లో ఆవిష్కరించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. అయినా ఇది పెద్దగా ప్రభావితం చేయలేకపోవడం కనిపిస్తుంది.
'రేపు ఉదయం 10 గంటలకు'(అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Repu Udayam 10 Gantalaku Review
Movie Details
Movie Name: Repu Udayam 10 Gantalaku
Release Date: 2026-03-27
Cast: Hebah Patel, Chaithanya Rao, Abhinav Gomatam, Inturi Vasu, Damaraju Kireeti
Director: Chendu Muddu
Music: Prince Henry
Banner: Mango Mass Media
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer