మంచి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కథానాయకుల్లో సంతోష్ శోభన్ ఒకరు. ఆయన ఈ పదేండ్లలో నటించిన సినిమాల్లో 'ఏక్ మినీ కథ' మాత్రమే ఫర్వాలేదనిపించింది.కానీ ఆయన కెరీర్‌కు బ్రేక్ నిచ్చే విజయం ఇంత వరకు ఆయనను వరించలేదు. ఈసారి తాజాగా 'సంతోష్ శోభన్' 'కపుల్ ఫ్రెండ్లీ' అనే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రేమికుల రోజున ఈ సినిమాను విడుదల చేశారు. ఈ చిత్రం ఎలా ఉంది? హీరో శోభన్‌కు విజయం వరించిందా? లేదా రివ్యూలో తెలుసుకుందాం..
శివ (సంతోష్ శోభన్) తనకు ఇష్టమైన ఇంటీరియర్ డిజైనింగ్‌లో డిప్లమా చేసి ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తుంటాడు. ఇందుకోసం సొంత ఊరు నెల్లూరు నుంచి చెన్నయ్‌కు వస్తాడు. నెలలు గడుస్తున్న ప్రాజెక్టులు టేకప్ చేసే చాన్స్ రాదు. దీంతో ఖర్చుల కోసం పార్ట్‌టైమ్ బైక్ రైడర్‌గా పనిచేస్తు ఖర్చులకు సంపాందించుకుంటుంటాడు. ఈ సమయంలోనే అనుకోకుండా మిత్ర (మానస వారణాసి)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె కూడా ఇంట్లో ఇష్టం లేని పెళ్లి నుండి తప్పించుకుంటానికి చెన్నయ్ వచ్చి ఐటీ జాబ్ కోసం ప్రయత్నిస్తుంది. ఈ ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది? ఇక ఇద్దరూ ఒకే ఇంట్లో సహజీనవం చేస్తుంటారు. ఆ తరువాత ఏమైంది? శివకు ప్రాజెక్టులు వచ్చాయా? మిత్ర పరిచయంతో శివ జీవితంలో చోటు చేసుకున్న మార్పులేమిటి? ఈ ఇద్దరి ప్రేమ పెళ్లిగా మారిందా? ఇందుకోసం ఎదురైన అడ్డంకులు ఏమిటి? అనేది మిగతా కథ. అది వెండితెరపై చూడాలి.
ఈ రోజు అనుకున్నది ఈ రోజు చేసేయాలి.. లేకపోతే రేపు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ప్రేమించిన వారు బాగుండాలి అనుకోవడమే కాదు వాళ్ల ప్రక్కన కూడా మనం ఉండాలి. వాళ్లతో అందమైన తీపి గుర్తుల్ని పోగేసుకోవాలి.. జీవితాన్ని ఆనందంగా గడపాలి అనేది ఈ చిత్ర కథ సారాంశం. అయితే ఇదేమీ కొత్త ప్రేమకథ కాదు. దర్శకుడు ఈ కథను చెప్పిన విధానం, తెరపై ఆవిష్కరించిన విధానం అందరి హృదయాలను హత్తుకుటుంది. కెరీర్లో స్థిరపడటానికి ప్రయత్నించే కుర్రాడు, సింపుల్‌గా ఈ సినిమాలోని డైలాగ్‌లా లివింగ్కే ఛాన్స్ లేనోడు లివింగ్ టు గెదర్ లైఫ్ గడపాల్సి వస్తే వాళ్లిద్దరి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? ఇద్దరి మనోభావాలు ఎలా కలిశాయి? అనేది ఈ చిత్ర కథాంశం. ఈ చిత్రం మొదటి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు దర్శకుడు ఈకథను ఓ ఎమోషనల్ జర్నీలా చూపించిన తీరు అందరిని కట్టిపడేస్తుంది. సినిమా స్లోగా, నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ వున్నా ఎక్కడా కూడా ఆడియన్స్‌కు బోర్ కట్టదు. పాత్రలతో, వారి భావోద్వేగాలతో ప్రేక్షకుడు ట్రావెల్ చేస్తున్న ఫీల్ ఉంటుంది. ముఖ్యంగా సినిమాలో శివ, మిత్ర ఇద్దరూ కలిసి మిత్ర ఉండటం కోసం హాస్టల్ కోసం వెతికే సన్నివేశాలు కాస్త లెంగ్తీగా అనిపించింది. ఈ సన్నివేశాలతో పాటు ఇద్దరూ కలిసి సహజీవనం చేసే సమయంలో జరిగే సన్నివేశాలు చాలా రొటిన్‌గా అనిపించాయి.
కథనం చాలా నెమ్మదిగా, అందరి ఊహలకు అందే విధంగా కొనసాగుతుంది. ఈ సీన్స్‌ల్లో కొత్తదనం చూపించి ఉంటే సినిమా వేగంతో పాటు ఫ్రెష్ షీల్ వచ్చేది. శివ ప్రాజెక్టులతో బిజీ అవ్వడం, కోరుకున్న ప్రొఫెషన్ దిశగా డెవలప్ అయ్యే సన్నివేశాలు, అందుకు మిత్ర సహకారం ఇలాంటి సన్నివేశాలు అలరిస్తాయి. కథ కేరళలో ఓపెన్ చేసిన విధానం, ప్లాష్‌బ్యాక్, మళ్లీ ప్రజెంట్‌లోకి కథ ఈ అంశం విషయంలో మాత్రం కామన్ ఆడియన్స్ కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఫస్టాఫ్ మొత్తం సరదాగా, ప్రశాంతంగా సాగిపోతుంది.
సెకండాఫ్‌లో సినిమా పూర్తి ఎమోషనల్ జర్నీగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఇద్దరి సహజీవనం విషయం తల్లిదండ్రులకు తెలిసినప్పుడు జరిగే సన్నివేశాల్లో కథలో వేగంతో పాటు ఎమోషనల్ డోస్ కూడా పెరిగింది. ఈ సంఘర్షణలో హీరో, హీరోయిన్ల మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు, వారి భావోద్వేగాలు అందరి హృదయాలను తాకుతాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు, మనసును బరువెక్కించడంతో పాటు ఆ భావోద్వేగాలు కంటతడి పెట్టిస్తాయి. ఇది 'గీతాంజలి' అంత గొప్ప ప్రేమకథ కాకపోయినా ఆ చిత్రాన్ని మాత్రం గుర్తుకు తెస్తుంది.
శివ పాత్రలో సంతోష్ శోభన్ ఎంతో పరిణితి చెందిన నటుడిలా కనిపించాడు. అతని నటన ఎంతో సహజంగా అనిపించింది. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో ఓ అనుకోని నిజం తెలిసినప్పడు ఆ భావోద్వేగభరిత సన్నివేశాల్లో సంతోష్ చూపించిన నటన అందరి మనసుల్ని హత్తుకుంటుంది. మిత్రగా మానస పాత్రలో ఒదిగిపోయింది. ప్రతి సన్నివేశంలో సంతోష్‌తో పోటీ పడి నటించింది. ఇద్దరి జోడి బాగుంది.
రాజీవ్ కనకాల హీరోయిన్ తండ్రి పాత్రలో, హీరో తండ్రి పాత్రలో గోపరాజు రమణ హుందాగా కనిపించారు. ఇలాంటి సినిమాకు సంగీతం బాగుంటే మరింత ప్లస్ అయ్యేది. నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను క్యారీ చేసింది. కేరళలో సన్నివేశాలతో పాటు రాత్రి చిత్రీరించిన సీన్స్‌ల్లో డైరెక్టర్ ఫోటోగ్రఫీ ప్రతిభ ఎలివేట్ అయ్యింది. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ఎంతో క్వాలిటీగా, సినిమా మూడ్‌ను తెలిపే విధంగా ఉంది. చిత్ర నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
'కపుల్ ఫ్రెండ్లీ' కొత్త కథ కాకపోయినా దర్శకుడు ఎంతో హృద్యంగా, భావోద్వేగపూరితంగా తెరకెక్కించిన విధానం అందరి హృదయాలకు హత్తుకుంటుంది. 'కపుల్ ఫ్రెండ్లీ' మీ మనసుకు హత్తుకునే ఎకో ఫ్రెండ్లీ, ఆర్గానిక్ ప్రేమకథగా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అయితే ఇది పూర్తిగా మల్టీప్లెక్స్ ఆడియన్స్ అలరించే సినిమా. ప్రేమకథలను, లవ్‌లోని ఎమోషన్స్‌ను ఇష్టపడే వారికి 'కపుల్ ఫ్రెండ్లీ' ఓ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ సినిమా భావనను కలిగిస్తుంది.
'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ రివ్యూ
Couple Friendly Review
Movie Details
Movie Name: Couple Friendly
Release Date: 2026-02-14
Cast: Santosh Soban, Manasa Varanasi,Rajeev Kanakala, Goparaju Ramana
Director: Ashwin Chandrasekha
Music: Aditya Ravindran
Banner: UV Creations
Review By: Maduri Madhu
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer