లవ్ .. రొమాన్స్ నేపథ్యంలోని కథలలో, తనదైన మాస్ యాక్షన్ మార్క్ చూపిస్తూ విజయ్ దేవరకొండ ముందుకు వెళుతున్నాడు. అలాంటి విజయ్ దేవరకొండ ఈ సారి చారిత్రక నేపథ్యంలో కథను ఎంచుకుని .. లుక్ మార్చుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అలా ఆయన చేసిన సినిమానే 'రణబాలి'. పెళ్లి తరువాత విజయ్ దేవరకొండ - రష్మిక కలిసి చేసిన సినిమా కావడంతో సహజంగానే అంచనాలు పెరిగిపోయాయి. గతంలో చారిత్రక నేపథ్యం కలిగిన 'శ్యామ్ సింగరాయ్'తో నానీకి హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృత్యన్, ఈ సినిమాతో విజయ్ దేవరకొండకి కూడా హిట్ ఇచ్చినట్టేనా అనేది చూద్దాం.
అది 1870ల నాటి కాలం .. భారతదేశంపై ఆంగ్లేయులు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న రోజులవి. బ్రిటీష్ కమిషనర్ (ఆర్నాల్డ్ వస్లూ) సీమ ప్రాంతం నుంచి 5 లక్షల టన్నుల ధాన్యాన్ని గూడ్స్ రైళ్ల ద్వారా తరలించి, మద్రాస్ ఓడరేవు నుంచి ఇంగ్లండ్ కి చేరవేసే ఆలోచనలో ఉంటాడు. అయితే అతనికి 'శింగనమల' ప్రాంతం నుంచి సవాల్ ఎదురవుతుంది. ఎందుకంటే 'రణబాలి' (విజయ్ దేవరకొండ) ఆ ప్రాంతానికి రక్షకుడిగా ఉంటాడు. అతనిని ఎదిరించే ధైర్యం .. ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేవని ఆ ప్రాంత ప్రజలు నమ్ముతూ ఉంటారు.
'శింగనమల' ప్రజలు అక్కడి కొండపై గల గుహలో ఉన్న ఒక అతీత శక్తి తమని కాపాడుతుందని నమ్ముతుంటారు. 'రణబాలి' కారణజన్ముడనే విషయాన్ని అతని తల్లితో ఆ శక్తియే చెబుతుంది. అతను ఈ భూమిపైకి వచ్చిన కార్యం పూర్తవడానికి రెండు పుష్కరాల సమయం పడుతుందనీ, ఆ తరువాత అతను సమాధి చేయబడతాడని ఆ శక్తి చెబుతుంది. ఆ గండం నుంచి అతనిని గట్టెక్కించమని అందరి దేవుళ్లకి ఆ తల్లి దణ్ణం పెట్టుకుంటూ ఉంటుంది. అతను వయసులోకి అడుగుపెట్టిన తరువాత జయమ్మ ( రష్మిక)తో వివాహాన్ని జరిపిస్తుంది.
సీమ ప్రాంతంలో కరవు ఏర్పడటానికి ప్రకృతి కారణం కాదనీ, తమ ప్రాంతంలోని ధాన్యాన్ని ఇంగ్లండ్ కి తరలించడానికి బ్రిటీష్ కమిషనర్ ప్రయత్నించడమేనని 'రణబాలి'కి అర్థమవుతుంది. దానిని అడ్డుకోవడానికి అతను రంగంలోకి దిగుతాడు. అతని కారణంగా తిరుగుబాటు దారుల సంఖ్య పెరుగుతుందని భావించిన బ్రిటీష్ కమిషనర్, ఆవేశంతో బరిలోకి దిగుతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆంగ్లేయ అధికారి కోరిక నెరవేరుతుందా? రణబాలి ప్రయత్నం ఫలిస్తుందా? అనేది మిగతా కథ.
ఆంగ్లేయుల కాలంలో వాళ్ల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ ఆయా ప్రాంతాలలో వీరులు పుట్టుకొచ్చారు. ఆ వీరుల నాయకత్వంలో అక్కడి ప్రజలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. అలా రాయలసీమ ప్రాంతం వైపు నుంచి ఆంగ్లేయుల పెత్తనాన్ని వ్యతిరేకించిన వీరుడిగా 'రణబాలి'ని దర్శకుడు తెరపైకి తీసుకొచ్చాడు. రాయలసీమను మరింత కరవులోకి తోసేయడానికి ప్రయత్నించిన ఒక ఆంగ్లేయ అధికారికి .. అందుకు అడ్డుపడిన రణబాలికి మధ్య జరిగిన పోరాటమే ఈ కథ.
'రణబాలి' కారణజన్ముడిగా పుట్టడం .. వీరుడిగా ఎదగడం .. జయమ్మను పెళ్లి చేసుకోవడం .. అప్పటి వరకూ ఊరికి మొనగాడుగా ఉన్న ఆయన, ఆ తరువాత ఆ ప్రాంతంవారి ఆకలి తీర్చడానికి సిద్ధపడటం ఫస్టాఫ్ లో ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ఇక ఆంగ్లేయ అధికారులకు వ్యతిరేకంగా అతను సాగించే ప్రయాణం .. చేసే పోరాటం సెకండాఫ్ గా తెరపైకి వస్తాయి. మొత్తం మీద లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్స్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.
చరిత్రకు సంబంధించిన ఘట్టాలను పుస్తకాలలో చదువుకోవడం తేలికగా ఉంటుంది. అందుకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించడం మాత్రం అంత ఆషామాషీ విషయమేం కాదు. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ కూడా ఈ విషయంలో కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే పూర్తి ఫోకస్ ను చరిత్రపై పెట్టి, ఎంటర్టైన్ మెంట్ కి సంబంధించిన అంశాలను నిర్లక్ష్యం చేశాడనిపిస్తుంది.
కథలో వినోదపరమైన అంశాలు చాలా తక్కువగా ఉండటం, చరిత్రకు సంబంధించిన ఘట్టాలను తేదీలు .. సంవత్సరాలతో కూడిన క్లిప్పింగ్స్ తో చూపించడం వలన, డాక్యుమెంటరీ ఫ్లేవర్ తగులుతుంది. ఆసక్తిని రేకెత్తించే ఎత్తులు .. పయ్యెత్తులు లేకపోవడం కాస్త అసంతృప్తిని కలిగిస్తాయి. ప్రీ క్లైమాక్స్ .. సముద్రతీరంలో జరిగే క్లైమాక్స్ ఫరవాలేదు. ఆ తరువాత వచ్చే సన్నివేశాలు కొనసాగింపుగా అనిపిస్తాయి.
యాక్షన్ వైపు నుంచి చూస్తే కావలసినంత రక్తపాతం కనిపిస్తుంది. రొమాన్స్ .. ఎమోషన్స్ వైపు నుంచి మాత్రం గాఢత లోపించినట్టు అనిపిస్తుంది. కథ బలమైనదే అయినప్పటికీ .. కథనం చాలా నిదానంగా సాగుతుంది. ఇక ఇటు రణబాలి తల్లికి సంబంధించి తీసుకున్నా .. అతని భార్యకి సంబంధించి చూసుకున్నా కాన్పు సన్నివేశాలు ఆడియన్స్ ను ఇబ్బందిపెడతాయి.
విజయ్ దేవరకొండ - రష్మిక కెమిస్ట్రీ గురించి ఆడియన్స్ కి తెలిసిందే. డిఫరెంట్ లుక్ తో .. ఇద్దరూ చాలా ఈజ్ తో చేశారు. ఆర్నాల్డ్ వస్లూ డీసెంట్ గా కనిపిస్తూ .. సైలెంట్ గానే తన విలనిజం చూపించారు. ఫొటోగ్రఫీ బాగుంది .. సీమ ప్రాంతానికి సంబంధించిన లొకేషన్స్ ను కవర్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. అజయ్ - అతుల్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. బాణీల వైపు నుంచి చూసుకుంటే, 'ఏందయ్యా సామీ' పాట మాత్రమే మనసుకు హత్తుకుంటుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ఓ మాదిరిగా ఉంది .. ట్రిమ్ చేయవలసిన సన్నివేశాలు కొన్ని కనిపిస్తాయి.
రాహుల్ సాంకృత్యన్ అల్లుకున్న ఈ కథ ఆసక్తికరమైనదే. అయితే ఆవిష్కారణ దగ్గరికి వచ్చేసరికి వేగం లోపించిన కథనంతో కదులుతుంది. 1870 కాలం నాటి వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించడంలో ఆయన సక్సెస్ అయ్యాడని చెప్పాలి. విజయ్ దేవరకొండ - రష్మిక లుక్ .. నటన ఆకట్టుకుంటాయి. వాళ్లిద్దరి కెరియర్లో గుర్తుండిపోయే పాత్రలనే చెప్పాలి. కాకపోతే వాళ్లిద్దరి మధ్య రొమాన్స్ .. డ్యూయెట్లు ఆడియన్స్ ఆశించిన స్థాయిలో పడలేదేమో అనే భావన మాత్రం కలుగుతుంది.
'రణబాలి' - మూవీ రివ్యూ!
Ranabaali Review
Movie Details
Movie Name: Ranabaali
Genre: Action, Biography, Drama
Release Date: 2026-10-16
Cast: Vijay Devarakonda, Rashmika, Arnold Vosloo,
Director: Rahul Sankrityan
PRO: -
Music: Ajay - Athul
Banner: Mythri Movie Makers
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer