'డార్క్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Dark Review
తమిళంలో రూపొందిన ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. కె. జగన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, అజయ్ కార్తీ - అంచనా నేత్రున్ ప్రధానమైన పాత్రలను పోషించారు. జులై 3వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఆగస్టు 21వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేసింది. అలాంటి ఈ సినిమా రీసెంటుగా తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.
విఘ్నేశ్ (అజయ్ కార్తీ) తన స్నేహితుడు చూసిన జాబ్ లో చేరడం కోసం 'చెన్నై' చేరుకుంటాడు. అద్దె తక్కువగా ఉన్న ఇంటి కోసం గాలిస్తూ, మొత్తానికి ఒక ఇంటిని పట్టుకుంటాడు. ఆ ఇంటి ఓనర్ కరుణాకర్ ( భాగ్యరాజా). చాలా తక్కువ రెంట్ కి డాబా పైపోర్షన్ రెంట్ కి ఇవ్వడానికి కరుణాకర్ అంగీకరిస్తాడు. గతంలో ఆ పోర్షన్ లో ముగ్గురు కుర్రాళ్లు రెంట్ కి ఉండేవారని విఘ్నేశ్ తో కరుణాకర్ చెబుతాడు. అయితే ఆ ముగ్గురులో 'జీవా' అనే యువకుడు, సతీశ్ - మోహన్ అనే ఇద్దరు స్నేహితులను దారుణంగా హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని అంటాడు.
ఆ తరువాత ఓ ఇద్దరు కుర్రాళ్లు రెంట్ కి వచ్చారనీ, కానీ ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పి పారిపోయారని అంటాడు కరుణాకర్. అప్పటి నుంచి దెయ్యాల భయంతో పై పోర్షన్ లోకి ఎవరూ రాలేదని చెబుతాడు. అతను గనుక పై పోర్షన్ లో రెంట్ కి ఉంటే, అక్కడ దెయ్యాలు లేవని ఊళ్లో వాళ్లు నమ్ముతారని అంటాడు. అప్పుడు తన ఇంటిని అమ్మేసి, సొంత ఊరుకు వెళ్లి హ్యాపీగా బ్రతకాలని అనుకుంటున్నట్టుగా చెబుతాడు. రెంట్ తక్కువగా ఉండటంతో, ఆ మర్నాడే ఆ పోర్షన్ లోకి విఘ్నేశ్ దిగిపోతాడు.
కరుణాకర్ కూతురు 'ప్రియదర్శి' కూడా తండ్రితో కలిసి అదే ఇంట్లో ఉంటూ ఉంటుంది. ఆమె చాలా దిగాలుగా ఉండటం విఘ్నేశ్ గమనిస్తాడు. ఆమెను గురించి కరుణాకర్ ఏమీ మాట్లాడకపోవడం కూడా అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాత్రి వేళ కాగానే ఆ పోర్షన్ లో దానంతట అదే టీవీ ఆన్ అవుతూ ఉంటుంది. దోశలు పొసే ప్యాన్ .. ఒక బుక్ ఎగిరొచ్చి పడుతుంటాయి. టీవీ కనెక్షన్ తీసేసినా, ప్యాన్ - బుక్ ను పూడ్చేసినా అలాగే జరుగుతూ ఉంటుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ ముగ్గురు కుర్రాళ్లు ఎందుకు చనిపోతారు? విఘ్నేశ్ అక్కడి నుంచి సేఫ్ గా బయటపడతాడా? అనేది మిగతా కథ.
చెన్నైలోని ఒక ఇంట్లో ముగ్గురు కుర్రాళ్లు అనుమానాస్పద స్థితిలో చనిపోతారు. ఆ ముగ్గురూ దెయ్యాలై తిరుగుతున్నారని అంతా నమ్ముతుంటారు. ఆ విషయం తెలిసి కూడా అద్దె తక్కువగా ఉందని అందులోకి దిగుతాడు విఘ్నేశ్. ఇక అప్పటి నుంచి ఆ ఇంట్లో అతనికి ఎలాంటి భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి? ఆ పరిస్థితులను అధిగమించడానికి అతను ఏం చేస్తాడు? అక్కడి నుంచి అతను ప్రాణాలతో బయటపడతాడా లేదా? అనేదే ఈ కథలోని ప్రధానమైన అంశం.
గతంలో ఏదో ఒక సంఘటన జరిగిన ఇంట్లోకి ఎవరో ఒకరు అద్దెకి దిగడం, అక్కడి ప్రేతాత్మలు వాళ్లని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టడం వంటి కథలతో ఇంతకుముందు చాలానే సినిమాలు వచ్చాయి. ఈ కథలో ప్రేతాత్మలుగా మారిన వాళ్లు ఎవరు? అందుకు గల కారణం ఏమిటి? అనేదే ఆడియన్స్ ను వెయిట్ చేయిస్తూ ఉంటుంది. దెయ్యాన్ని నేరుగా చూపించకుండానే దర్శకుడు తెరపై కథానాయకుడిని .. ఆడియన్స్ ను భయపెట్టే ప్రయత్నం చేస్తూ వెళ్లాడు.
ఆ ఇంట్లో అద్దెకి దిగిన ముగ్గురు కుర్రాళ్లు ఎందుకు చనిపోయారనే ఒకే ఒక్క విషయం తెలుసుకోవడం కోసమే, నిదానంగా సాగుతూ వచ్చిన ఈ కథను ఆడియన్స్ భరిస్తూ వెళతారు. అప్పటివరకూ అసలు విషయాన్ని ఎవరూ గెస్ చేయలేని కథేమీకాదు. కొంతమంది గెస్ చేయగలుగుతారు. అలాంటి పరిస్థితులలోనే ఫ్లాష్ బ్యాక్ ను రివీల్ చేస్తారు. దాంతో అప్పటివరకూ ఉన్న పట్టు సడలిపోయి, ఈ కథ మరింత బలహీనపడుతుంది.
నిజంగానే దెయ్యాలు హడావిడి చేస్తున్నాయా? లేదంటే ఇదంతా తన సైకలాజికల్ ఫీలింగా? అనే ఒక ఆలోచనలో .. అయోమయంలో కథానాయకుడు పడిపోతాడు. దర్శకుడు ఆడియన్స్ ను కూడా అదే అయోమయంలో పడేసే ఒక ప్రయత్నం చేశాడు. అందువలన ప్రయోజనం ఏమిటనేది మనకి అర్థం కాదు.
సాధారణంగా ఈ తరహా సినిమాల విషయంలో ఫొటోగ్రఫీ .. సౌండ్ ఎఫెక్ట్స్ ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. కానీ ఈ సినిమాలో అలాంటివేం లేవు. సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ వాటిని పక్కన పెట్టేశారు. రవిశక్తి ఫొటోగ్రఫీ .. మను రమేశన్ నేపథ్య సంగీతం .. కథిరేశన్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి.
ఈ సినిమాలో నాలుగు ప్రధానమైన పాత్రలు ఉన్నాయి. సరిగ్గా చెప్పాలంటే కథానాయకుడి పాత్ర ఒక్కటే ప్రధానమైనదని అనుకోవచ్చు కూడా. నాలుగు గోడల మధ్య ఏకపాత్రాభినయం ఎక్కువ. భయపడుతున్న హీరోను చూపించి మనలను భయపెట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఒక రకంగా ఇదో ప్రయోగం అనుకున్నాడేమో. చీకటి భయపెడుతుంది .. మనలోని భయాలకు తగిన రూపాలను చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ చీకటి లేదు .. చివరివరకూ దెయ్యము కనిపించదు. చివర్లో కనిపించినా మనకి భయమూ వేయదు .. కొన్ని దెయ్యాల కథలు అంతే!
Movie Details
Movie Name: Dark
Genre: Horror, Thriller
Release Date: 2026-09-18
Cast: Ajay Karthi,Anchana Nethrun,Natty Subramaniam,K. Bhagyaraj ,VTV Ganesh
Director: Kalyan K Jegan
PRO: -
Music: Manu Ramesan
Banner: MG Studios
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer