మలయాళంలో రూపొందిన ఒక యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీకి వచ్చింది. ఆ సినిమా పేరే 'కాటాలన్'. ఆంటోని వర్గీస్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, సునీల్ .. కబీర్ దుహాన్ సింగ్ .. దుషారా విజయన్ కీలకమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాకి పాల్ జార్జ్ దర్శకత్వం వహించాడు. మే 28వ తేదీన థియేటర్ లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 11వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.

'అనకొల్లి' అటవీ ప్రాంతంలో ఏనుగులు ఎక్కువగా ఉంటాయి. 'మారి' (సునీల్) చూపు ఆ అడవిపై పడుతుంది. ఏనుగు దంతాలతో అక్రమ వ్యాపారం చేయడానికి అతను ఒక అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. పోలీసులు .. ఫారెస్టు అధికారులు తన వ్యాపారానికి అడ్డుపడకుండా వాళ్లకి పెద్దమొత్తంలో లంచాలు ముట్టజెపుతుంటాడు. ఆ చుట్టుపక్కల ఉండే గిరుజనులు తన పట్ల భయంతో బ్రతికేలా చేస్తాడు.

అయితే 'ఎడ్డీ' (కబీర్ దుహాన్ సింగ్) మాత్రం 'మారి' వ్యాపారానికి అడ్డుపడుతూ ఉంటాడు. తన తండ్రిని చంపిన ఏనుగులపై కోపం ఒక పక్కన .. తన బిజినెస్ ను 'మారి దెబ్బకొడుతున్నాడనే ద్వేషం ఒక పక్కన 'ఎడ్డీ'ని బలమైన శత్రవుగా మారుస్తాయి. 'ఎడ్డీ'కి రాజకీయ నాయకులతో .. పోలీస్ అధికారులతో దగ్గర సంబంధాలు ఉండటంతో, ఒక చురుకైన అనుచరుడు కావాలనే ఉద్దేశంతో 'ఆంటోని'( ఆంటోని వర్గీస్)ను 'మారి రంగంలోకి దింపుతాడు. ఆంటోనీ వచ్చిన తరువాత 'మారి' బిజినెస్ పుంజుకోవడంతో, ఆంటోనీని అడ్డుతప్పించాలని ఎడ్డీ గ్యాంగ్ నిర్ణయించుకుంటుంది.                 

'మారి' కోసం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఆంటోనికి, తన సహచరుడైన అలీకి జరిగిన అన్యాయం కళ్లు తెరిపిస్తుంది. 'మారి'కి ఏ మాత్రం మానవత్వం లేదని గ్రహించిన ఆంటోని, తన బృందానికి తానే నాయకుడిగా నిలబడాలని నిర్ణయించుకుంటాడు. అది పసిగట్టిన 'మారి' ఏం చేస్తాడు? అతని కారణంగా ఆంటోనికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అడవిపై పెత్తనం కోసం జరిగే ఈ పోరాటంలో చివరికి గెలిచేదెవరు? అనేది కథ.

'కాటాలన్' అంటే 'వేటగాడు' అని అర్థం. అడవిచుట్టూ .. అక్కడ జరిగే ఏనుగు దంతాల వ్యాపారం చుట్టూ తిరిగే కథ ఇది. అడవిలోకి రహస్యంగా ప్రవేశించి .. అక్కడి ఏనుగులను చంపేసి .. వాటి దంతాలను స్మగ్లింగ్ చేసే కథలతో గతంలో చాలానే కథలు వచ్చాయి. దాదాపు అదే లైన్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. అడవిపై ఆధిపత్యం కోసం ఇద్దరు నాయకుల మధ్య వార్ నడుస్తూ ఉంటే, ఒక సాధారణ యువకుడు వచ్చి, వాళ్లిద్దరి అటకట్టిస్తూ ఎలా ఎదిగాడనేదే ప్రధానమైన కథాంశం.

'మారి' అనే వ్యక్తి తుపాకీతో గిరిజనులను భయపెట్టి .. అధికారులకు డబ్బుతో ఆశపెట్టి తన పబ్బం గడుపుకుంటూ ఉంటాడు. తన శత్రువుల ఆటకట్టించడం కోసం ఆంటోనిని చేరదీయడం ..  అతని ద్వారా మరింత ఎదగడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ పరిగెడుతుంది. మారి నిజస్వరూపం తెలుసుకున్న ఆంటోని, అతని సామ్రాజ్యాన్ని కూల్చడానికి సిద్ధపడటం వంటి సన్నివేశాలతో సెకండాఫ్ కొనసాగుతుంది. 

అడవి .. ఏనుగులు .. వేట .. దంతాల తరలింపు .. చెక్ పోస్టులు .. కాల్పులు .. ఇలా ఈ కథ పరిగెడుతూ ఉంటుంది. అయితే చూస్తున్న ప్రేక్షకులకు పెద్దగా ఏమీ అనిపించదు. ఎందుకంటే ఇది రొటీన్ కథ కాబట్టి .. రొటీన్ కంటెంట్ కాబట్టి. ఇంతవరకూ వచ్చిన అన్ని కథల్లో కనిపించిన మోసాలు .. ద్వేషాలు .. వ్యూహాలనే ఈ సినిమాలోనూ చూపించారు. కథలో కాల్పులే తప్ప, ఎక్కడా కొత్తదనమనేది కనిపించదు. క్లైమాక్స్ లో మరింతగా హింసను పెంచారంతే. 

ఈ సినిమాలో సునీల్ పాత్ర బాగుంది. ఆయన విలన్ గా కనిపించినప్పటికీ, హీరోను డామినేట్ చేసే పాత్ర ఇది. ఆయన యాక్టింగ్ మాత్రం ఆకట్టుకుంటుంది. కబీర్ దుహాన్ సింగ్ ను కూడా బలమైన విలన్ గానే ఎత్తుకున్నారు. కానీ ఎందుకో పోను పోను ఆ పాత్రను బలహీనపరుస్తూ వెళ్లారు. దుషారా విజయన్ మంచి ఆర్టిస్ట్. కాకపోతే ఆమెను సరిగ్గా ఉపయోగించుకోలేదని అనిపిస్తుంది. ఆంటోనీ వర్గీస్ .. జగదీశ్ .. ఇలా అంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

అజనీశ్ లోక్ నాథ్ - రవి బస్రూర్ సంగీతం ఫరవాలేదు. ఫారెస్టు నేపథ్యంలో లొకేషన్స్ ను తెరపైకి తీసుకొచ్చిన విధానం బాగుంది. ఎడిటింగ్ ఓ మాదిరి మార్కులనే సంపాదించుకుంటుంది. దర్శకుడు ఈ కథను ముఠా నాయకుల మధ్య ఆధిపత్య పొరుగునే చూపిస్తూ వెళ్లాడు. ఎక్కడా ఫ్యామిలీ డ్రామాగానీ .. ఎమోషన్స్ గాని లేవు. అక్కడక్కడా కాస్త కనిపించినా అవి పండలేదు. లవ్ .. రొమాన్స్ అనే మాటలకు అసలు ఛాన్సే లేదు. వ్యూహాలు .. ప్రతి వ్యూహాలు ఆసక్తికరంగా లేకపోవడం కూడా అసంతృప్తిని కలిగిస్తుంది.