తమిళ .. తెలుగు భాషల్లో మాస్ యాక్షన్ హీరోగా విశాల్ కి మంచి క్రేజ్ ఉంది. తమిళంతో పాటు తెలుగులోను ఆయన సినిమాలు తప్పకుండా రిలీజ్ అవుతూ ఉంటాయి. అలా ఆయన నుంచి రీసెంటుగా వచ్చిన సినిమానే 'మకుటం'. సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి విశాల్ దర్శకత్వం వహించడం విశేషం. ఆగస్టు 14వ తేదీన విడుదలైన ఈ సినిమా, 'అమెజాన్ ప్రైమ్'లో ప్రత్యక్షమైంది. తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ భాషల్లో ఈ నెల 11వ తేదీ నుంచి అందుబాటులో ఉంది.

'కృపాకరం' (విశాల్) ఒక చిన్నపాటి జాబ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. భార్య 'జమున' (దుషారా విజయన్) ఇద్దరు పిల్లలు .. ఇదే అతని కుటుంబం. ఎవరితో ఎలాటి గొడవలు లేకుండా చాలా ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేస్తుండటంతో, సెకండ్స్ లో ఒక కారు తీసుకుంటాడు. భార్య బిడ్డలను తీసుకుని సరదాగా ఒక ట్రిప్ కి వెళతాడు. ఆ సమయంలోనే వాళ్లు మాఫియా ముఠాకి చెందిన 'నాగ' (అజయ్) అనుచరుల కంటపడతారు. 

'నాగ'కి మాఫియా నాయకుడైన 'లింగా'తో గొడవలు ఉంటాయి. నాగతో పాటు 'మార్టిన్' .. 'లాలా' ఇద్దరూ కూడా 'లింగా'పై పగతీర్చుకునే సమయం కోసం వెయిట్ చేస్తుంటారు. అలాంటి సమయంలోనే, 'లింగా' కొడుకు కృపాకరం ఫ్యామిలీని నాగ అనుచరులు చూస్తారు. అతనిని 'లింగా' అనుకుని ఒక్కసారిగా దాడి చేస్తారు. కృపాకరం ఆ షాక్ నుంచి తేరుకునేలోగా అతని భార్యను .. కూతురును ఆ గ్యాంగ్ చంపేస్తుంది. జరిగిన సంఘటనకి కారకుడు తన తండ్రి అని తెలిసి కృపాకరం కోపంతో రగిలిపోతాడు.

కృపాకరం తన తండ్రికి దూరంగా ఎందుకు ఉండవలసి వస్తుంది? తండ్రి కారణంగా తాను ఫ్యామిలీని కోల్పోవడం పట్ల కృపాకరం ఎలా స్పదిస్తాడు? తన కారణంగా తన కొడుకు బాధపడటంతో లింగా ఏం చేస్తాడు? ఆయనను మాఫియా వైవు నడిపించిన పరిస్థితులు ఎలాంటివి? అసలు లింగాతో నాగ - మార్టిన్ - లాలాకి ఉన్న గొడవేంటి? తన భార్యాబిడ్డల మరణానికి కారకులైన గ్యాంగ్ పై కృపాకరం ఎలా రివేంజ్ తీర్చుకుంటాడు? అనేది కథ.

మాస్ యాక్షన్ హీరోగా విశాల్ కి మంచి క్రేజ్ ఉంది. ఈ తరహా సినిమాలు ఇంతకుముందు ఆయన చాలా చేశాడు. అలాంటి విశాల్ అదే జోనర్లోని ఒక సినిమాకి దర్శకత్వం వహించాడు అనగానే అభిమానులు గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. విడుదలకి ముందే అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా ఆయన ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషంగా చెప్పుకున్నారు. అలాంటి ఈ సినిమా, థియేటర్ల వైపు నుంచి హిట్ టాక్ ను తెచ్చుకోలేకపోయింది.

కృపాకరం భార్య పిల్లలు .. చాలీచాలని జీతం .. కారు కొనాలనే ఆశ .. కొనడంలో ఎదురయ్యే అవమానాలు .. కొన్న తరువాత ఎదురయ్యే ఇబ్బందులతో ఫస్టాఫ్ నడుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకూ కొడుకు పాత్రతో నడవగా, ఆ తరువాత తండ్రి పాత్రగా 'లింగా' తెరపైకి వస్తుంది. అప్పటి నుంచి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గా లింగా కథ ఎక్కువగా కొనసాగుతుంది. కారు కొనడానికి పడేపాట్లతో ఫస్టాఫ్ ను సాగదీస్తూ వెళ్లిన విశాల్, సెకండాఫ్ లో అంజలిని లవ్ లోకి దింపడానికి చేసే ప్రయత్నాలతో ఎక్కువ సమయాన్ని వృథా చేశాడు. 

సెకండాఫ్ లో 'లింగా' పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. అయితే ఆయన పాత్రలోని పవర్ ను చూపించకుండా, మాఫియా డాన్ కావడానికి ముందు .. అంజలిని ముగ్గులోకి దింపే సన్నివేశాలతోనే కాలక్షేపం చేయడం ప్రేక్షకులను నిరాశకు గురిచేస్తుంది. మాఫియా డాన్ గా ఎదిగిన తరువాత 'లింగా' పాత్ర గురించి పక్కనున్నవాళ్లు గొప్పలు చెప్పడమే తప్ప, అతగాడు చేసేది ఏమీ ఉండదు. తన గురించి చెబుతూ ఉంటే ఎంజాయ్ చేస్తూ స్టైల్ గా ఒక లుక్ విసరడం తప్ప.

 ఈ సినిమా ఫస్టాఫ్ విషయానికొస్తే, కృపాకర్ తానెవరన్నది బయట ప్రపంచానికి తెలియకుండా సింపుల్ లైఫ్ స్టైల్ ను కొనసాగిస్తూ ఉంటాడు. సెకండాఫ్ దగ్గరికి వచ్చేసరికి లింగా పాత్ర ప్రధానంగా, సముద్రం .. జాలరులు .. పోర్టుపై పెత్తనం .. అప్పటికే డాన్ గా ఉన్నవాళ్లు లింగాను ఆదరించడం .. షిప్పుల్లో అక్రమ రవాణా .. పోర్టు నుంచి సరుకును విడిపించడం వంటి  సన్నివేశాలతో సాగుతుంది. కొన్ని వందల సినిమాలలో ఆడియన్స్ చూసి చూసి విసుగెత్తిపోయిన సన్నివేశాలు ఇవి. ఏ మాత్రం అటు ఇటు కాకుండా అదే ట్రాక్ లో నడుస్తాయి. 

ఈ కథ 1965లో మొదలై 2025 వరకూ నడుస్తుంది. 'లింగా' పాత్ర 1980లలో నడుస్తుంది. ఆ కాలం నాటి కాస్ట్యూమ్స్ తో విశాల్ బాగానే ఇబ్బంది పెడతాడు. నిజానికి ఆయన ఆ పాత్రలో సరిగ్గా సెట్ కాలేదు కూడా.  ఇక 2025 కాలానికి చెందిన పాత్రలో విశాల్ యాక్టింగ్ మామూలే. దుషారా విజయన్ మంచి ఆర్టిస్ట్. కానీ యాక్టింగ్ చేసే అవకాశం ఆమెకి దక్కలేదు. ఉన్నంతసేపు అంజలి బాగానే సందడి చేసింది. రిచర్డ్ ఫొటోగ్రఫీ ఫరవాలేదు. జీవీ ప్రకాశ్ కుమార్ నేపథ్య సంగీతం కాస్త గందరగోళంగానే సాగింది. శ్రీకాంత్ ఎడిటింగ్ వైపు నుంచి చూసుకుంటే, 3 గంటల నిడివిలో ట్రిమ్ చేయవలసిన సీన్స్ కొన్ని కనిపిస్తాయి.

మాస్ యాక్షన్ హీరోగా విశాల్ కి మంచి అనుభవం ఉంది. అయితే దర్శకుడిగా ఆయన రొటీన్ కథను రొటీన్ గా చెబుతూ వచ్చాడు. అందువల్లనే గతంలో వచ్చిన సినిమాలలో ఇప్పటి విశాల్ ను చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. 'మకుటం' సంగతి అలా ఉంచితే, సాగతీత సన్నివేశాలతో కూడిన ఈ సినిమా, ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్ష పెడుతుంది.