ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథల సందడి ఎక్కువ. ఈ జోనర్లో రూపొందిన సినిమాలు   .. సిరీస్ ల పట్ల ఆడియన్స్ ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అయితే తమిళ .. మలయాళ మేకర్స్ వైపు నుంచి ఈ తరహా కంటెంట్ ఎక్కువగా వస్తుంటుంది. అలాంటిది ఈ సారి తెలుగులో ఈ జోనర్ నుంచి ఒక సిరీస్ వచ్చింది. ఉదయభాను నిర్మాతగా వ్యవహరించిన ఈ సిరీస్ కి, మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించాడు. 6 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్, ఈ రోజు (సెప్టెంబర్ 11) నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

'జైరామ్' (భరత్) ఓ పోలీస్ ఆఫీసర్. అనాథగా పెరిగిన అతనికి ఆ బాధ ఎలా ఉంటుందనేది తెలుసు. అందువల్లనే అతను 'ఆది' అనే ఓ కుర్రాడిని చేరదీసి చదివిస్తుంటాడు. హాస్టల్లో ఉంటున్న 'ఆది' అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. ఆ దృశ్యాన్ని చూసి జైరామ్ తల్లడిల్లిపోతాడు. అతనిని ఇష్టపడుతున్న యువతిగా ధరణి (మేధారెడ్డి) ఓదార్చినా ప్రయోజనం లేకుండా పోతుంది. అంతకు కొన్ని రోజుల ముందే జోసెఫ్ .. మురళి అనే మరో ఇద్దరు అనాథ యువకులు చనిపోతారు. ప్రమాదవశాత్తు అలా జరిగి ఉంటుందని జైరామ్ భావిస్తాడు. అయితే మురళి తండ్రి మారుతి పోలీస్ స్టేషన్ కి వచ్చి, తన కొడుకు మరణం విషయంలో తనకి కొన్ని అనుమానాలు ఉన్నాయని చెబుతాడు. 

ఈ నేపథ్యంలోనే ముగ్గురు యువకులు కూడా ప్రమాదవశాత్తు చనిపోలేదనీ, దారుణంగా హత్య చేయబడ్డారనే విషయం జైరామ్ కి అర్థమవుతుంది. దాంతో హంతకులు ఎవరు?  ఏ కారణంగా హత్యలు చేస్తున్నారు? అనే విషయంపై ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఈ నేపథ్యంలోనే చనిపోయింది ముగ్గురు కాదు, నలుగురు అనే విషయం అర్థమవుతుంది. అయితే నాలుగో వ్యక్తి ఎవరనేది తేలడానికి సంబంధించిన ఆధారాలు దొరకవు. వాటి కోసం అతను అన్వేషణ మొదలుపెడతాడు. 

ఇదిలా ఉండగా, తల్లిదండ్రులను కోల్పోయిన 'దేవకి'ని 'హరి' పెళ్లి చేసుకుంటాడు. ఆమె తమ్ముడు 'జై' బాగోగులు తాను చూసుకోవడానికి 'హరి' అంగీకరిస్తాడు. దాంతో ఆమె హరిని పెళ్లి చేసుకుని, తమ్ముడిని కూడా తనవెంట తీసుకుని వస్తుంది. అయితే చాలా చిన్న అనారోగ్య సమస్య కారణంగా హాస్పిటల్ కి వెళ్లిన దేవకి చనిపోతుంది. అక్కయ్య లేని కారణంగా 'జై' అనాథ అవుతాడు. కనిపించకుండా పోయిన తన బావను వెతకడం మొదలుపెడతాడు. జరుగుతున్న హత్యలకు .. దేవకీ కథతో ఉన్న సంబంధం ఏమిటి? ఒకే రోజున ముగ్గురు అనాథ యువకులను ఎందుకు హత్య చేయవలసి వస్తుంది? హంతకులను పట్టుకునే విషయంలో 'జైరామ్' ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది మిగతా కథ.

తెరపై వరుసగా హత్యలు జరుగుతుంటాయి .. అందుకు సంబంధించిన పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటుంది. హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకోసం చేస్తున్నారు? చనిపోయినవారి వేలిముద్రలు ఒకేలా ఉండటం ఎలా సాధ్యం? అనే సందేహాలను రేకెత్తిస్తూ ఫస్టాఫ్ నడుస్తుంది. చనిపోతున్న వాళ్లంతా అనాథలే కావడం .. దేవకీ ఫ్యామిలీ ట్రాక్ వెళుతున్న తీరు కుతూహలాన్ని పెంచుతూ సెకండాఫ్ కొనసాగుతూ ఉంటుంది. 

ఈ కథ మొదలయ్యే తీరు చూడగానే ఇది సైకో థ్రిల్లర్ కావొచ్చని అనిపిస్తుంది. కథ చాలాసేపు మర్డర్ మిస్టరీల చుట్టూ తిరుగుతుంది. ఆ తరువాత జరిగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ నిదానంగా మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ దిశగా తీసుకుని వెళుతుంది. క్లినికల్ ట్రైల్ పేరుతో ఫార్మా కంపెనీలు అమాయక పేద ప్రజలను తమ ఉచ్చులోకి ఎలా లాగుతున్నారు? డబ్బు సంపాదనే ప్రధాన లక్ష్యంగా కొంతమంది డాక్టర్లు ఆర్గాన్ ట్రాఫికింగ్ ఎలా పాల్పడుతున్నారనే దిశగా ఈ కథను నడిపించారు. 

మొత్తం 6 ఎపిసోడ్స్ లో 4 ఎపిపోడ్ వరకూ కూడా ఏం జరుగుతుందనే విషయంలో ఆడియన్స్ కి ఒక క్లారిటీ అనేది రానీయకుండా సస్పెన్స్ లో ఉంచడం కోసమే దర్శకుడు ప్రయత్నించాడు. అప్పటివరకూ వాళ్లంతా కాస్త అయోమయంగానే ఉంటారు. చివర్లో సస్పెన్స్ ను రివీల్ చేయాలనే దర్శకుడు ఆలోచన కొంతమందికి నచ్చుతుంది. చివర్లో తెలుసుకోవడం వలన ప్రయోజనం ఏముంటుంది? అని మరికొందరికి అనిపించవచ్చు. 

జైరామ్ ను ధరణి ప్రేమిస్తుండటం .. అతను పట్టించుకోకపోవడం .. దాంతో ఆమె మరొకరితో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం .. దీనివలన ప్రయోజనం ఏమిటనేది అర్థం కాదు. హంతకుడు ఎవరు? హత్యలకు కారకులు ఎవరు? అనేది చెప్పడానికి చాలా సమయం తీసుకున్నారు. కొంత ఉత్కంఠను పెంచారు కూడా. అయితే వాళ్లు ఎవరన్నది చూపించిన తరువాత ఆ పాత్రలను వెంటనే ముగించడం అసంతృప్తిని కలిగిస్తుంది.

జైరామ్ - ధరణి, దినేశ్ - విద్య ట్రాక్, పిల్లల ట్రాక్ .. దేవకీ ట్రాక్ .. ఆర్గాన్ ట్రాఫికింగ్ కి సంబంధించిన ఎపిసోడ్స్ పై మరింత కసరత్తు చేయవలసిందని అనిపిస్తుంది. చెప్పవలసినంత గాఢంగా చెప్పలేదనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే షఫీ పాత్రను ఇంకాస్త డిఫరెంట్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. అన్నదమ్ముల అనుబంధం .. అక్కాతమ్ముళ్ల బంధానికి సంబంధించిన ఎమోషన్స్ ఇంకాస్త బలంగా చూపించవలసిందేమో.  

భరత్ .. రూపాలక్ష్మి .. శివాజీరాజా .. నటన ఆకట్టుకుంటుంది. మేధారెడ్డి పాత్రకు స్కోప్ తక్కువగా ఉంది. సందీప్ కాంత్ ఫొటోగ్రఫీ ఫరవాలేదు. శ్రీనివాస్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. నరేశ్ కుమారన్ నేపథ్య సంగీతం బాగుంది.'పంచనామా' అంటే అందరికీ తెలిసిందే. ఈ కథకి ఈ టైటిల్ కరెక్టుగా సెట్ అయింది. ఇంట్రెస్టింగ్ గా అనిపించే టైటిల్ కూడా. కాకపోతే ఆ టైటిల్ కి తగిన స్థాయిలో కంటెంట్ ను వర్కౌట్ చేయలేకపోయారేమోనని అనిపిస్తుంది.