'బలగం' సినిమాతో సుధాకర్ రెడ్డికి - మురళీధర్ గౌడ్ కి మంచి పేరు వచ్చింది. తెలంగాణ నేపథ్యంతో కూడిన సినిమాలలో వాళ్లకంటూ ప్రత్యేకమైన పాత్రలను క్రియేట్ చేసే స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నారు. అలాంటి వాళ్లిద్దరూ తండ్రీకొడుకులుగా నటించిన సినిమానే 'పళ్ల బురుసు'. ఉదయ్ చౌహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆగస్టు 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ రోజు (సెప్టెంబర్ 2)వ తేదీ నుంచి ఈ సినిమా 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

అది తెలంగాణ ప్రాంతంలోని ఒక పల్లెటూరు. అక్కడ శంభూ (సుధాకర్ రెడ్డి) అనే రైతు నివసిస్తుంటాడు. శంభూకి తిరుపతి (మురళీధర్ గౌడ్) అనే కొడుకు ఉంటాడు. ఆయన భార్య మారుతి .. కూతురు 'రేఖ' ఇదే ఆయన కుటుంబం. ప్రభుత్వ ఉద్యోగి అయిన తిరుపతి, తన తండ్రిని గురించి పెద్దగా పట్టించుకోడు. అందువలన శంభూ వేరే ఉంటూ, తనకున్న 'ఎకరం భూమి'ని సాగుచేసుకుంటూ ఉంటాడు. కొంతకాలంగా 'పంటి' సమస్యతో ఆయన బాధపడుతుంటాడు. డాక్టర్ చెప్పిన ప్రకారం 'పళ్ల బురుసు'(టూత్ బ్రష్) వాడాలని నిర్ణయించుకుంటాడు.

శంభూ తనకి 'పళ్ల బురుసు' తెచ్చిపెట్టమని తిరుపతికి చెబుతాడు. అయితే అతను తన కూతురు 'రేఖ' పెళ్లిపనులలో ఉండటం వలన తీసుకురాలేకపోతాడు. ఉద్దేశ పూర్వకంగానే తన తండ్రిని పెళ్లికి పిలవడం మానేస్తాడు. తన మనవరాలి పెళ్లికి తనని పిలిచేదేమిటని భావించిన శంభూ ఆ పెళ్లికి వెళతాడు. అయితే తనని పట్టించుకోవడం మానేశారనే బాధ లోలోపల తొలిచేస్తూ ఉంటుంది. దాంతో అతను తన కొడుకు తనని పట్టించుకోవడం లేదంటూ కోర్టులో కేసు వేస్తాడు. తండ్రి తీసుకున్న ఈ నిర్ణయం తిరుపతిని షాక్ కి గురిచేస్తుంది.

కూతురు పెళ్లి కోసం అయిన అప్పును తీర్చడం కోసం తన తండ్రి పేరుతో ఉన్న ఎకరం పొలాన్ని అమ్మేయాలని తిరుపతి భావిస్తాడు. తాను బ్రతికుండగా ఆ పొలాన్ని అమ్మేయడానికి ఒప్పుకోనని శంభూ తేల్చి చెబుతాడు. అప్పుడు తిరుపతి ఏం చేస్తాడు? శంభూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనేది మిగతా కథ.

విలేజ్ నేపథ్యంలోని ఒక తండ్రి .. ఒక కొడుకు .. ఒక 'పళ్ల బురుసు' (టూత్ బ్రష్) చుట్టూ తిరిగే కథ ఇది. తనకి పళ్ల బురుసు కొనిపెట్టమని ఆ తండ్రి కొడుకును అడగడం .. అతను ఆ విషయాన్ని గురించి అంతగా పట్టించుకోకపోవడం .. దాంతో కొడుకుపై అతను కేసు వేయడం .. తండ్రికున్న కొద్దిపాటి పొలానికి కూడా ఆ కొడుకు ఎసరు పెట్టడం వంటి అంశాలను కలుపుకుంటూ దర్శకుడు ఈ కథను ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. 

నిజానికి శంభూ ఆ టూత్ బ్రష్ ను ఎవరితోనో ఒకరితో తెప్పించుకోవచ్చు. కానీ తన కోసం తన కొడుకు ఆ మాత్రం సమయాన్ని కేటాయిస్తాడా లేదా అనే తండ్రి నిరీక్షణయే ఈ కథలో ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. అలాగే రచ్చబండ దగ్గర చేరే శంభూ తోటివాళ్లు .. వాళ్ల బలహీనతలు, ఒక కుర్ర ప్రేమజంటను కలుపుకుంటూ దర్శకుడు ఈ కథను నడిపించాడు. ప్రధానమైన కథ నుంచి కాస్త వినోదం దిశగా ఈ ట్రాకులు తీసుకెళతాయి.

పిల్లలు ఎదిగిన తరువాత .. తల్లిదండ్రుల అవసరం తీరిపోయిన తరువాత వాళ్లను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. వాళ్లు ఏం చేస్తున్నారో .. ఎలా ఉంటున్నారో అనేది పట్టించుకోవడం మానేస్తున్నారు. వాళ్లను అడగాలి .. వాళ్లకి చెప్పాలి అనే విషయం మరిచిపోతున్నారు. ఒంట్లో ఓపిక నశించి ఒంటరిగా మిలిపోయిన పరిస్థితులలో వాళ్లు ఎంతగా బాధపడుతూ ఉంటారనేది దర్శకుడు ఆవిష్కరించిన విధానం ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది.

ఇక ఇది వరకూ పల్లెల్లో మంచి చెడూ మాట్లాడుకోవడం, పక్కవాడిని పట్టించుకుని సాయం చేయడం ఉండేవి. కానీ ఇప్పుడు స్మార్టు ఫోన్లు వచ్చిన తరువాత అందరూ వాటితోనే గడిపేస్తున్నారు. ఎవరి కష్టం .. నష్టం ఎవరూ పట్టించుకోని పరిస్థితులలోకి పల్లెలు వెళ్లిపోయాయనే విషయాన్ని దర్శకుడు టచ్ చేసిన విధానం ఆలోచింపజేస్తుంది. అలాగే పల్లెలోని లొకేషన్స్ మనసును పట్టుకుంటాయి. 

అయితే ఈ కథను దర్శకుడు కామెడీ టచ్ తోనే చెప్పాలని అనుకున్నాడు. అయితే ఆశించిన స్థాయిలో కామెడీ వర్కౌట్ కాకపోవడం వలన కాస్త సీరియస్ గా మారిపోయినట్టు అనిపిస్తుంది. కామెడీపై మరింత ఫోకస్ పెడితే, కంటెంట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదని అనిపిస్తుంది. ఫొటోగ్రఫీ ..  నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు. పాటలు .. పాటలలోని సాహిత్యం ఆకట్టుకుంటాయి. పల్లె జీవితాలు .. బంధాలు .. అనుబంధాలను తాకుతూ అర్థవంతంగా సాగుతాయి. 

వయసు మళ్లిన తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి కోరుకునేది తాము ఇంకా బ్రతికే ఉన్నామనే గుర్తింపు, అండగా ఉన్నామంటూ ఇచ్చే ఓదార్పు అంతే. ఇదే సందేశంతో సాగిపోయే సినిమా ఇది. కథనం కాస్త నిదానంగా అనిపించినా, సహజత్వంతో మెప్పించే కంటెంట్ గానే కనిస్తుంది.