కోలీవుడ్ లో యోగిబాబు స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. ఒక వైపున కీలకమైన పాత్రలను చేస్తూనే, మరో వైపున ప్రధానమైన పాత్రలను పోషిస్తూ కథానాయకుడిగాను కొనసాగుతున్నాడు. ఆయన నుంచి ఇటీవల వచ్చిన తమిళ సినిమానే 'సన్నిధానం పోస్ట్ ఆఫీస్'. అముత సారథి దర్శకత్వం వహించిన సినిమా ఇది. జూన్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఆ మరుసటి నెలలోనే స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే రీసెంటుగానే తెలుగులో అందుబాటులోకి వచ్చింది.

యశోద (సితార) ఒక ఒంటరి మహిళ .. ఆమెకి మాటలు రావు. ఆమెకి పదేళ్ల వయసున్న ఒక కొడుకు ఉంటాడు. అతని పేరే 'శబరి. అతనికి కూడా మాటలు రావు. అయితే అతనికి మాటలు రావాలనే బలమైన కోరికతో యశోద ఉంటుంది. అయ్యప్పస్వామి మాల వేస్తే మాటలు వస్తాయని కొంతమంది చెప్పడంతో ఆమె శబరికి మాల వేస్తుంది.దీక్ష పూర్తిచేయించి .. ఇరుముడి కట్టించి 'పులిమేడు' సన్నిధానానికి తీసుకొస్తుంది. శబరికి దాహంగా ఉండటంతో, అతనికి మంచినీళ్లు తీసుకురావడానికి యశోద వెళుతుంది. 'సన్నిధానం పోస్టాఫీస్' దగ్గర నిలబడిన అతను, ఆ తరువాత కనిపించకుండా పోతాడు. 

శబరి కనిపించకపోవడంతో యశోద కంగారు పడిపోతుంది. తన కొడుకు కోసం కంగారుగా వెదకడం మొదలుపెడుతుంది. అదే సమయంలో కొంతమంది పోలీసులు అక్కడికి వస్తారు. ఒక గోల్డ్ చైన్ దొంగతనం కేసులో ఆమెను అరెస్ట్ చేస్తారు. తనకి ఎలాంటి సంబంధం లేదని ఎంతగా చెబుతున్నా వినిపించుకోకుండా ఆమెను స్టేషన్ కి తీసుకు వెళతారు. ప్రత్యక్ష సాక్షులు ఉండటం వలన ఆ కేసు నుంచి బయటపడటానికి ఆమెకి చాలా కాలం పడుతుంది. 

యశోద నుంచి తప్పిపోయిన శబరి ఎక్కడికి వెళతాడు? మాటలు రాని అతనిని ఎవరు ఆదరిస్తారు? అతని జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? జైలు నుంచి విడుదలైన యశోద తన కొడుకుని కలుసుకోగలుగుతుందా? అయ్యప్పస్వామి ఆ తల్లి కొడుకుల జీవితాలను ఏ గమ్యానికి చేరుస్తాడు? అనేది మిగతా కథ.

అయ్యప్పస్వామి మహిమలకు సంబంధించిన కథలతో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ఈ తరహా కథలు అయ్యప్పస్వామి దీక్షా కాలంలో ఎక్కువగా థియేటర్లకు వస్తుంటాయి. అలా కాకుండా 'జూన్' మాసంలో ఈ సినిమా విడుదల చేశారు. అయ్యప్ప మాల వేస్తే తన కొడుకుకి మాటలు వస్తాయనే ఒక తల్లి విశ్వాసం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ స్వామిపై ఆమె పెట్టుకున్న  నమ్మకం ఎంతవరకూ నిలబడిందనేదే ఈ సినిమాలోని ప్రధానమైన అంశం. 

యశోద మాటలురాని తన కొడుకుకి అయ్యప్ప మాలవేయడం .. అతను తప్పిపోవడం .. ఆమె జైలుకు వెళ్లవలసి రావడం .. ఆమె ఒక చోట .. కొడుకు ఒకచోట .. అలా ఫస్టాఫ్ నడుస్తుంది. తల్లి కొడుకులు కలుసుకుంటారా లేదా? అలాంటి ఒక సందర్భం ఎప్పుడు ఎక్కడ వస్తుంది? అనే ఆసక్తికరమైన అంశాలతో సెకండాఫ్ కొనసాగుతుంది.

అయ్యప్పస్వామి తన భక్తులను పరీక్షిస్తాడు. ఆ నేపథ్యంలో వాళ్ళ జీవితాలు ఎన్నో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ ఉంటాయి. అలాంటి మలుపులతోనే ఈ కథ కూడా నడుస్తుంది. అయితే తల్లి నుంచి తప్పిపోయిన తరువాత కొడుకుకి ఎదురైన సంఘటనలు, కొడుకు దూరమైపోయిన తరువాత ఒక తల్లి తల్లడిల్లిపోయిన తీరు కదిలించలేకపోతాయి. ఆ స్థాయిలో సన్నివేశాలను డిజైన్ చేయలేకపోయారు.  ఆడియన్స్ ఫీల్ తో గానీ .. ఫీలింగ్స్ తో గాని పని లేకుండా ఈ సినిమా నడుస్తుంటుంది. 

 మొదటి నుంచి చివరివరకూ కూడా ఎక్కడా ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోయింది. కథలో 'ఆత్మ' అనేది కనిపించదు. సన్నివేశాలు చాలా కృతకంగా అనిపిస్తూ బలహీనమై తేలిపోతుంటాయి. మనసును భారం చేసే ఎమోషన్స్ గానీ ..అదే మనసును తేలిక చేసే కామెడీ గాని వర్కౌట్ కాకపోవడం ప్రేక్షకులకు నిరాశను కలిగిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ సినిమా ఒక స్టేజ్ డ్రామాను తలపిస్తూ ఉంటుంది. 

ఇది యోగిబాబు సినిమా అయినప్పటికీ, కామెడీలో ఆయన మార్క్ ఎక్కడా కనిపించదు.అసలు కామెడీ గురించిన ఆలోచన పెద్దగా చేయలేదు కూడా. పోనీ తల్లీ కొడుకుల అనుబంధానికి సంబంధించిన సన్నివేశాలను హైలైట్ చేశారా అంటే అదీ లేదు. ఇక అయ్యప్పస్వామి వైపు నుంచి లీలా విశేషం ఏమైనా చూపించారా అంటే, అది కూడా చాలా సింపుల్ గా తేల్చేశారు. ఏ ట్రాక్ వైపు నుంచి కూడా ప్రభావితం చేయలేని కంటెంట్ గానే ఇది కనిపిస్తుంది. 

సితార .. యోగిబాబు తదితరులు సహజమైన నటనను ప్రదర్శించారు. వినోద్ భారతి ఫొటోగ్రఫీ .. ఏజీఆర్ నేపథ్య సంగీతం .. పొన్ కథిరేశ్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. అయ్యప్పస్వామి మహిమలలో ఒకటిగా .. ఆయన లీలా విశేషాలలో ఒకటిగా ఈ కథను ఆవిష్కరించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. కాకపోతే ఆ ప్రయత్నం ఫలించలేదు అంతే.