తమిళంలో ఈ మధ్యకాలంలో ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. స్వీయ దర్శకత్వంలో ఎవరికి వారు హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. అలా పరిఎలవళగన్ తన దర్శకత్వంలో తానే హీరోగా చేసిన సినిమా 'అన్బే డయానా'.  రొమాంటిక్ కామెడీ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, జులై 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా ఈ రోజు (ఆగస్టు 28వ తేదీ) నుంచి, 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

సీతాకృష్ణ (పరి ఎలవళగన్) ఓ మిడిల్ క్లాస్ కి చెందిన యువకుడు. తండ్రి భాస్కర్ ( చేతన్) తల్లి సరళ (రోజా) అన్నయ్య మంగబాబు .. అక్క సత్యవతి .. ఇదే అతని ఫ్యామిలీ. భాస్కర్ ప్రభుత్వ ఉద్యోగి. గతంలో అతను ఆంగ్లో ఇండియన్ ను ప్రేమిస్తాడు. అయితే ఆ యువతిని పెళ్లి చేసుకోలేకపోయాననే బాధ అతనిలో అలాగే ఉండిపోతుంది. అందువల్లనే సీతాకృష్ణ వివాహం ఆంగ్లో ఇండియన్ అమ్మాయితోనే జరిపిస్తానని తన స్నేహితుల దగ్గర ఛాలెంజ్ చేస్తాడు. 


సరళ 'పిండి మిల్లు' నడుపుతూ తన ఖర్చులకు అవసరమైన డబ్బులు తానే సంపాదించుకుంటూ ఉంటుంది. కులమతాల విషయంలో ఆమె చాలా కఠినంగా ఉంటుంది. అలాంటి పెళ్లిళ్లకు వెళ్లడం కూడా ఆమెకి ఇష్టం ఉండదు. తన ఇద్దరు కొడుకులు కూడా తాను చూపించిన సంబంధాలనే చేసుకుంటారనే బలమైన నమ్మకంతో సరళ ఉంటుంది. సీతాకృష్ణకి తన తమ్ముడు కూతురైన 'తనీషా'తో పెళ్లి జరిపించాలని నిర్ణయించుకుంటుంది. 

అయితే అప్పటికే సీతాకృష్ణ, ఆంగ్లో ఇండియన్ అమ్మాయి 'మ్యాజిక్' (రమ్య రంగనాథన్) ప్రేమలో పడతాడు. మ్యాజిక్ కుటుంబం పద్ధతులకు .. తమ ఆచారాలకు ఏ మాత్రం పొసగదనే విషయం సీతాకృష్ణకి అర్థమవుతుంది. అయినా ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ నేపథ్యంలోనే తన తమ్ముడిని .. అతని కూతురును ఊరు నుంచి పిలిపిస్తుంది సరళ. అప్పుడు ఏం జరుగుతుంది? సీతాకృష్ణ వివాహం ఎవరితో జరుగుతుంది? అనేదే మిగతా కథ.

ఇంట్లో పెళ్లీడు కొచ్చిన పిల్లలు ఉన్నారంటే, వాళ్ల పేరెంట్స్ లో టెన్షన్ మొదలవడం సహజమే. ఎందుకంటే తమ మనసుకి నచ్చినవారిని పెళ్లి చేసుకోవాలని యూత్ కోరుకుంటుంది. తమ కులానికి చెందినవారితోనే తమ పిల్లల పెళ్లి జరగాలని పెద్దలు భావిస్తుంటారు. ఈ రెండు విషయాలకి సంబంధించిన ఒక సంఘర్షణ, ఈ రెండు తరాల మధ్య నడుస్తూ ఉంటుంది. ఆ సంఘర్షణ చుట్టూ అల్లుకున్న కథ ఇది. 

కథానాయకుడైన సీతాకృష్ణకు ఒక బెంగ పట్టుకుంటుంది. అతని తల్లి సరళకు కులాంతర వివాహాలు ఎంతమాత్రం నచ్చవు. ఆ మాట ఎత్తితేనే ఆమె గందరగోళం చేస్తుందనే విషయం అతనికి తెలుసు. అలాంటిది అతను వేరే మతానికి చెందిన 'మ్యాజిక్'ను లవ్ చేస్తాడు. ఈ ఇద్దరి పరిచయం .. ప్రేమకి సంబంధించిన సన్నివేశాలతో ఫస్టాఫ్ కొనసాగుతుంది. ఇక తమ ప్రేమ గురించి అతను తన తల్లికి ఎలా చెబుతాడు? ఆమె ఒప్పుకుంటుందా లేదా? అనేది సెకండాఫ్ గా కొనసాగుతుంది.

సీతాకృష్ణ తన మనసులోని మాటను మ్యాజిక్ కి చెప్పే సన్నివేశం .. తన తమ్ముడు కూతురును కోడలిగా చేసుకోవాలని సరళ నిర్ణయించుకోవడం .. మ్యాజిక్ ను చర్చిలోనే వివాహమాడాలని ఆమె తండ్రి సీతాకృష్ణకి చెప్పడం .. మ్యాజిక్ తండ్రితో సీతాకృష్ణకి గల పాత గొడవలు ఈ కథలో ఆసక్తికరమైన అంశాలుగా కనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ కథాబలాన్ని మరింత పెంచేలా కనిపిస్తాయి.

ఇది లవ్ స్టోరీ. ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగానే ఉన్నప్పటికీ, యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సినిమా. అయితే రొమాన్స్ కి అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ దర్శకుడు ఆ వైపు దృష్టి పెట్టలేదు. అలాగే పాటల సంగతి పట్టించుకోకపోవడం కూడా అసంతృప్తిని కలిగిస్తుంది. నటీనటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. రమ్య రంగనాథన్ గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవాలి. షెల్లీ ఫొటోగ్రఫీ .. భరత్ శంకర్ నేపథ్య సంగీతం .. పార్థ ఎడిటింగ్ ఫరవాలేదు. 

లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను వినోదభరితంగా చెప్పడానికి ప్రయత్నించిన సినిమా ఇది. పిల్లల పెళ్లిళ్ల విషయంలో పెద్దవాళ్లు పరువు ప్రతిష్ఠలంటూ పంతాలకు పోవడం సహజంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటివాళ్లు పిల్లల ఇష్టాయిష్టాలను గురించి కూడా ఆలోచన చేయాలి అనే ఒక సందేశం ఈ సినిమాలో కనిపిస్తుంది.