తమిళంలో విజయ్ కథానాయకుడిగా రూపొందిన సినిమానే 'జననాయగన్'. తెలుగులో బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'భగవంత్ కేసరి' సినిమాకి ఇది రీమేక్. విజయ్ సినిమాను తెలుగులో ఈ సినిమాను 'జననాయకుడు'టైటిల్ తో రిలీజ్ చేశారు. హెచ్ వినోత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జులై 23వ తేదీన థియేటర్లకు వచ్చింది. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీ నుంచి 'జీ 5'  స్ట్రీమింగ్ అవుతోంది. 

వెట్రి కొండాన్ ( విజయ్) కొంతకాలంగా జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తూ ఉంటాడు. జైలు అధికారి ( గౌతమ్ మీనన్)కి అతని వ్యక్తిత్వం నచ్చుతుంది. చావుబతుకుల్లో ఉన్న తల్లిని చివరి చూపు చూసేందుకు వెట్రికి అవకాశం ఇస్తాడు. అంతే కాకుండా ఆగస్టు 15 సందర్భంగా క్షమాభిక్ష జాబితాలో వెట్రి పేరును చేర్చి అతను విడుదలయ్యేలా సహకరిస్తాడు. అయితే ఆ తరువాత ఆ పోలీస్ అధికారి  చనిపోవడంతో అతని కూతురు విజ్జి (మమితా బైజు) ఒంటరి అవుతుంది. దాంతో విజ్జి బాధ్యతను వెట్రి తీసుకుంటాడు. 

చిన్నప్పుడు తల్లిని కోల్పోయిన దగ్గర నుంచే విజ్జికి ఒక భయం .. బలహీనత ఏర్పడతాయి.  ఆ రెండిటినీ దూరం చేసి, ఆర్మీలో చేర్పించాలనే ఆమె తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చాలని వెట్రి నిర్ణయించుకుంటాడు. ఆ దిశగా ఆమెను నడిపించడానికి కఠినమైన శిక్షణను ఇప్పిస్తుంటాడు. అయితే ఆమెకి మాత్రం ఆర్మీ దిశగా వెళ్లడం ఎంతమాత్రం ఇష్టం ఉండదు. తాను ప్రేమించిన సురేశ్ తో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోవాలని ఆమె ఆశపడుతూ ఉంటుంది. 
  
ఈ నేపథ్యంలోనే  తమిళనాడు రాజకీయాలను శాసించే స్థాయికి రోజా రంగస్వామి (ప్రకాశ్ రాజ్) చేరుకుంటాడు. అనుచరులను .. ఆయుధాలను చూపిస్తూ అరాచకాలు సృష్టిస్తూ ఉంటాడు. అదే సమయంలో జాన్ హిమ్లర్ (బాబీ దేవోల్) రంగంలోకి దిగుతాడు. తాను తలపెట్టిన  'ప్రాజెక్ట్ ఎమ్ ఎమ్'ను పూర్తి చేయడం అతని లక్ష్యం. అందుకోసం అతను రోజా రంగస్వామితో చేతులు కలుపుతాడు. అదే సమయంలో విజ్జీని అంతం చేయడానికి అనుచరులను నియమిస్తాడు. 

జాన్ హిమ్లర్ ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి? ఆయన తలపెట్టిన ప్రాజెక్టు ఉద్దేశం ఎలాంటిది? విజ్జీని అంతం చేయాలని అనుకోవడానికి కారణం ఏమిటి? ఆమెలోని భయాన్ని పోగొట్టాలనే వెట్రి ప్రయత్నం ఫలిస్తుందా? మాఫియా వైపు నుంచి హిమ్లర్ ను .. రాజకీయాల వైపు నుంచి రోజా రంగస్వామిని వెట్రి ఎలా ఎదుర్కొంటాడు? ఆ విషయంలో ఆయనకి ఎదురయ్యే పరిణామాలు ఎలాంటివి? అసలు ఆయన జైలుకు ఎందుకు వెళ్లాడు? అనేది మిగతా కథ.

తనపట్ల మానవతావాదంతో వ్యవహరించిన ఒక పోలీస్ ఆఫీసర్ కూతురును ఒక ఖైదీ చేరదీయవలసి వస్తుంది. ఆ పోలీస్ ఆఫీసర్ ఆశయం దిశగా ఆ కూతురును నడిపించవలసి వస్తుంది. అదే సమయంలో లోకల్ గా ఉన్న రాజకీయనాయకుడి అరాచకాలను .. ఆయన సపోర్టుతో దేశంలో అల్లకల్లోలం సృష్టించాలనుకున్న ఒక మాఫియా లీడర్ ను కూడా వెట్రి ఎదుర్కోవలసి వస్తుంది. తన ముందున్న ఈ సమస్యలను ఆయన ఎలా ఛేదిస్తూ వెళ్లాడు? అనే ఒక ఆసక్తికరమైన అంశం చుట్టూ ఈ కథను బిగిస్తూ వెళ్లారు.

ఈ సినిమా మొదలైన తరువాత ఆడియన్స్ కి కలిగే మొదటి సందేహం, వెట్రి ఎందుకు జైలుకు వెళ్లవలసి వస్తుంది? అనే. ఇక ఆ తరువాత  లోకల్ గా రోజా రంగస్వామిని .. పై నుంచి దిగిన 'హిమ్లర్' ను ఆయన ఎలా ఢీకొట్టనున్నాడు? అనేది టెన్షన్. ఇక ఈ మూకనందరినీ దాటుకుని, ఆ పోలీస్ ఆఫీసర్ కూతురును అతను ఎలా కాపాడుకుంటాడు? అనేది ఫైనల్ టెన్షన్. హీరో అధిగమించవలసిన ఈ సవాళ్ల  జాబితా చూసుకుంటే కొంచెం బీపీ పెరగడమైతే ఖాయమేనని చెప్పాలి.

ఈ సినిమాను తెలుగులో భారీ హిట్ కొట్టిన 'భగవంత్ కేసరి'కి రీమేక్ గా తెరకెక్కించారు. అయితే 'భగవంత్ కేసరి'లో కనిపించే ఎమోషన్ ఈ సినిమాలో మిస్సయింది. ఇక హీరోకి సంబంధించిన ఎలివేషన్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టడం వలన కూడా అసలు కథ పలచబడిపోయినట్టుగా అనిపిస్తుంది. కథలోని మార్పులు .. చేర్పులు కొంతవరకూ దెబ్బతీశాయనే భావన కలగకండా ఉండదు. తనని నలుగురిలో అవమానించిన రోజా రంగస్వామితో హిమ్లర్ డీల్ కుదుర్చుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

'భగవంత్ కేసరి' సినిమా ఆడియన్స్ తో ఎమోషనల్ జర్నీ చేయిస్తుంది. యాక్షన్ సీన్స్ కూడా బలమైన ఎమోషన్స్ కి తగినట్టుగా అనిపిస్తూ విజిల్స్ వేయిస్తాయి. ఇక్కడ ఎమోషన్ కనెక్ట్ కాకపోవడంతో, యాక్షన్ డోస్ ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఎలివేషన్స్ .. భారీతనం .. హింసను పెంచుకుంటూ వెళ్లడమే ఈ సినిమాకి శాపమై కూర్చుందని చెప్పచ్చు. ఇంటర్వెల్ తరువాత ప్రీ క్లైమాక్స్ స్టార్ట్ అయిందేమో అనే సందేహం కలుగుతుంది. 

ఆఫ్రిక .. పాకిస్థాన్ అంటూ చాలా హడావిడి చేశారు. దేశాలు .. మతాలు అంటూ గందరగోళం లేపారు. తెరపై విలయం .. విధ్వంసం .. రక్తపాతం .. కత్తులు - తుపాకులు కలబడుతున్న చప్పుళ్లు. సామాన్య ప్రేక్షకుడు తట్టుకోలేని ఆవిష్కరణ ఇది. పూజ హెగ్డే కనిపిస్తేనైనా మనసు కాస్త కుదుటపడుతుందేమోనని ప్రేక్షకులు అనుకుంటే, ఆమె పట్టుమని పది నిముషాలు కనిపిస్తే ఒట్టు. పూజ హెగ్డే లాంటి హీరోయిన్ ను తీసుకుని, నటన పరంగా గానీ, గ్లామర్ పరంగా గాని ఏ మాత్రం ఉపయోగించుకోకపోవడం ఆడియన్స్ కి అసంతృప్తిని కలిగిస్తుంది.

విజయ్ కి ఇలాంటి పాత్రలు చేసిన అనుభవం విపరీతంగా ఉంది. ఇక మమతా బైజు నటన మామూలే. పూజ హెగ్డే పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఇక కేరక్టర్ ఆర్టిస్ట్ ల జాబితాలో ప్రియమణి పాత్ర కూడా అంతే. సత్యన్ సూర్యన్ ఫొటోగ్రఫీ బాగుంది. అనిరుధ్ నేపథ్య సంగీతంలో హోరు ఎక్కువైపోయింది. ప్రదీప్ రాజీవ్ ఎడిటింగ్ కి ఓ మాదిరి మార్కులే పడతాయి.

'జన నాయగన్' టైటిల్ బాగుంది. 'భగవంత్ కేసరి' కథను ఉన్నదున్నట్టుగా ఫాలో అయితే మరింత బాగుండేది. ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవడం .. సన్నివేశాలను సాగదీస్తూ పెంచిన నిడివి .. కొన్ని పాత్రలను అవసరానికి మించి ఎత్తేసి, మరికొన్ని పాత్రలను అసలు పట్టించుకోకపోవడమే ఈ సినిమాలోని ప్రధానమైన లోపంగా అనిపిస్తుంది.