వరలక్ష్మి శరత్ కుమార్ కి తెలుగులోను మంచి క్రేజ్ ఉంది. లేడీ ఓరియెంటెడ్ కథలు .. విలనిజంతో కూడిన కీలకమైన పాత్రలను పోషిస్తూ ఆమె ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఆమె  ప్రధానమైన పాత్రను పోషించిన సినిమానే 'పోలీస్ కంప్లైంట్'. హారర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమాకి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించాడు. జూన్ 12వ తేదీన థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు. అలాంటి ఈ సినిమా ఈ రోజు (జులై 31)నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది.

'మహంకాళి' (రవి శంకర్) వెయ్యికోట్ల ఆస్తులకు అధిపతి. ఆస్తులను అనుభవించడం కోసం ఆయుష్షును పెంచుకోవాలనే ఒక దురాశతో క్షుద్రపూజలు చేస్తూ ఉంటాడు. అతని పూజకు భంగం కలిగించకుండా అనుచరులు కాపలా ఉంటారు. మరో వైపున నగరంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. గొలుసులతో 'ఉరి' బిగించి చంపుతుండటంతో, ఇదంతా ఎవరో సీరియల్  కిల్లర్ చేస్తున్న హత్యలుగా అనుమానిస్తారు. ఈ కేసును ఛేదించడానికి సీత వరలక్ష్మి ( వరలక్ష్మీ శరత్ కుమార్) రంగంలోకి దిగుతుంది. 

సీత వరలక్ష్మీ ఏఎస్పీ గా పనిచేస్తుంటుంది. ఆమె భర్త రామ్ ప్రసాద్ ( నవీన్ చంద్ర) ఓ డాక్టర్. వాళ్లకి 'భవిత' అనే ఒక కూతురు ఉంటుంది. సీతా వరలక్ష్మీకి రీల్స్ చేయడం .. పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ. అందువలన ఆమె సిన్సియర్ గా డ్యూటీ ఫై దృష్టి పెట్టేది చాలా తక్కువ. ఇక ఆమెకి రామ్ ప్రసాద్ అంటే అమితమైన ప్రేమ .. అపారమైన నమ్మకం. అతను కూడా ఆమెతో అలాగే ఉంటూ ఉంటాడు. అందువలన ఆమె చాలా హ్యాపీగా తన కెరియర్ ను కొనసాగిస్తూ ముందుకు వెళుతుంటుంది.  

 వరుస హత్యల గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్న సీత వరలక్ష్మి కి అపుడప్పుడు 'అద్వైత' అనే పాప తారసపడుతూ ఉంటుంది. తనకి తండ్రి కావాలని అడుగుతూ, తన తండ్రి ఫలానా అని చూపిస్తూ ఉంటుంది. ఆమె అలా ఎవరినైతే చూపిస్తుందో ఆ మరుసటి రోజునే వాళ్లు దారుణంగా హత్య చేయబడుతూ ఉంటారు. ఇదంతా సీత వరలక్ష్మికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

అలా ఒక రోజున ఆ పాప తన తండ్రి అతనేనంటూ, హోమ్ మినిష్టర్ కొడుకు 'రాకేశ్' ను చూపిస్తుంది. దాంతో సీత వరలక్ష్మి ఉలిక్కి పడుతుంది. రాకేశ్ ను ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో హోమ్ మినిష్టర్ ఇంటికి వెళుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? రాకేశ్ ప్రాణాలను ఆమె కాపాడగలుగుతుందా? హత్యకి గురవుతున్నవారి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అద్వైత ఎవరు?  ఇన్వెస్టిగేషన్ లో సీత వరలక్ష్మికి తెలిసే మరో చేదు నిజం ఏమిటి? అనేది మిగతా కథ.

ఒక వైపున క్షుద్ర పూజలు .. మరో వైపున వరుస హత్యలు .. ఈ మధ్యలో సాగే ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ఈ హత్యలకు .. దెయ్యానికి గల సంబంధం ఏమిటనేది ఆడియన్స్ లో కుతూహలాన్ని రేకెత్తిస్తూ ఉంటుంది. సాధారణంగా దెయ్యం కథలు రివేంజ్ లో నుంచే పుట్టుకొస్తూ ఉంటాయి. ఆ మాటకొస్తే ప్రతీకారం తీర్చుకోవడానికే ప్రేతాత్మలుగా మారతారు అని కూడా చూపిస్తూ ఉంటారు. అలాంటి ఒక రివేంజ్ కథతోనే రూపొందిన సినిమా ఇది.

వరలక్ష్మీ శరత్ కుమార్ పోలీస్ ఆఫీసర్ అనగానే ఆమె పాత్రను ప్రేక్షకులు ఒక రేంజ్ లో ఊహించుకుంటారు. కానీ ఈ సినిమాలో ఆమె పాత్ర కాస్త కామెడీ టచ్ తో మొదలవుతుంది. చుట్టూ ఉన్న పోలీసులు .. ఆమె కామెడీ చేయడంలో పోటీపడుతూ ఉంటారు. ఇంత కమెడియన్స్ ను పోలీసులుగా ఎలా తీసుకున్నారబ్బా అనే డౌటు ఆడియన్స్ కి రాకుండా ఉండదు. ఎటొచ్చి ఆ కామెడీ ఏ మాత్రం పేలకపోవడమే ఇక్కడ విచారించవలసిన విషయం.

ఇక మహంకాళి పాత్ర సినిమా మొదలైన దగ్గర నుంచి చివరివరకూ క్షుద్రపూజలు చేస్తూనే ఉంటుంది. ఎందుకోసం ఈ పూజలు అనే విషయంలో ఒక క్లారిటీ మాత్రం మనకి రాదు. ఒకటీ రెండు డైలాగులను బట్టి 'ఇందుకోసం అన్నమాట' అని మనం అనుకోవాలంతే. ఇక హత్యకి గురైనవారితో అంతకుముందు దెయ్యానికి జరిగిన అన్యాయం ఏమిటా అనే ఇక ఆసక్తి ప్రేక్షకులలో కలుగుతుంది .. అది కూడా ఆ 'ముడి' విప్పేవరకు మాత్రమే. ఆ తరువాత ఓస్ ఇంతేనా అనిపిస్తుంది. 

ఇక నవీన్ చంద్ర ఉన్నాడు అంటే, అటువెళ్లి .. ఇటు వెళ్లి తిరిగి విలనిజం అనేది ఆయన పాత్రవైపుకే పరిగెత్తుకు వస్తుందనే సత్యాన్ని చాలా సినిమాలు ... సిరీస్ లు నిరూపించాయి. అదే ఆనవాయితీని అనుసరిస్తూ వెళ్లిన కంటెంట్ ఇది. ఇక నిర్మాత కృష్ణసాయి తనలోని నటుడిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నమైతే చేశాడు. ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు .. పాటలు కృతకంగా అనిపించడమే ఇక్కడ నిరాశ పరిచే విషయం.

శ్రీనివాస రెడ్డి కామెడీ చాలడం లేదనేదేమో .. సప్తగిరిని కూడా రంగంలోకి దింపారు. అయితే స్క్రిప్ట్ లో బలం లేకపోవడం వలన ఆయన కూడా ఏమీ చేయలేకపోయాడు. కథలో ఏవైతే బలమైన అంశాలో .. అవే బలహీనపడితే ఎలా ఉంటుందో .. అలా ఉంటుంది. హరీశ్ ఫొటోగ్రఫీ .. సుధీంద్ర టీమ్ నేపథ్య సంగీతం .. రేణుకా బాబు ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. సాధారణంగా హారర్ సినిమాలలో తెరపైకి దెయ్యాలు వచ్చేసి భయపడుతూ ఉంటాయి. కానీ ఈ సినిమా కామెడీతో భయపెడుతుంది .. అంతే తేడా.