వివిధ భాషలకి చెందిన సిరీస్ లు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి పొలోమంటూ దిగిపోతున్నాయి. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళుతున్నాయి. ఈ మధ్యలో తెలుగు సిరీస్ లు కూడా తమ బలాన్ని నిరూపించుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. అలాంటి సిరీస్ గా వచ్చినదే 'ఆజాదీ 501'. సాయితేజ కల్వకోట ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ కి, శివతేజ దర్శకత్వం వహించాడు. ఈ నెల 29వ తేదీ నుంచి 6 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.
అది 2014వ సంవత్సరం. జితేంద్ర (సాయితేజ) తన తల్లి 'యశోద' .. చెల్లెలు 'ప్రీతి'తో కలిసి 'కాకినాడ'లో నివసిస్తూ ఉంటాడు. కొంతకాలం క్రితమే అతని తండ్రి చనిపోతాడు. అతను నిర్మించిన స్కూల్ విషయంలో భాగస్వాములు మోసం చేయడమే అతని మరణానికి కారణమవుతుంది. ఆ స్కూల్ పై అధికారం కోసం కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది. తండ్రి లేకపోవడంతో కుటుంబం బాధ్యత జితేంద్రపై పడుతుంది. అతని సంపాదనకీ .. బాధ్యతలకు పొంతన లేకుండా పోతుంది. మేనమామ చేసిన అవమానం అతణ్ణి మరింత ఆలోచనలో పడేస్తుంది.
తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే బిజినెస్ ఏదైనా చేయాలనే నిర్ణయానికి వస్తాడు. ఈ విషయంలో తన స్నేహితుడైన 'కిషన్' సహాయం తీసుకుంటాడు. ఇద్దరూ కలిసి ఇన్వెస్ట్ మెంట్ కోసం శ్రీకాంత్ మెహతాను కలుసుకుంటారు. స్మార్ట్ ఫోన్ కొనాలనేది చాలామంది కల. అయితే ఖరీదు ఎక్కువ కారణంగా అది కొంతమందికే పరిమితమవుతూ ఉంటుంది. అందువలన అతి తక్కువ ధరకి స్మార్ట్ ఫోన్ ఇవ్వాలని జితేంద్ర భావిస్తాడు. చైనా ఫోన్స్ కొనేసి, 'మేడ్ ఇన్ ఇండియా' అంటూ తమ లోగో .. తమ బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి వదలాలని నిర్ణయించుకుంటాడు.
'ఆజాదీ 501' పేరుతో జనంలోకి స్మార్ట్ ఫోన్స్ ను వదులుతాడు జితేంద్ర. సెంట్రమ్ మినిష్టర్ శరత్ గోయెల్ ( హర్షవర్ధన్)తో లాంచ్ చేయిస్తాడు. 'ఆజాదీ 501' అనేది ఒక సంచలనంగా మారుతుంది. దాంతో జితేంద్ర లాభాలపై శరత్ గోయెల్ కన్నుపడుతుంది. అదే సమయంలో ఐపీఎస్ ట్రైనీగా ఉన్న చాణక్య చక్రవర్తి ( శశాంక్)కి ఈ స్మార్ట్ ఫోన్ పై అనుమానం తలెత్తుతుంది. ఇక ఈ ప్రొడక్ట్ కి సంబంధించిన సందేహాల ఆధారంగా, నిజానిజాలు తెలుసుకోవడం కోసం స్పెషల్ ఆఫీసర్ గా రఘురామ్ (రవివర్మ) రంగంలోకి దిగుతాడు.
జితేంద్రకి తన బిజినెస్ లో ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? శరత్ గోయెల్ .. చాణక్య చక్రవర్తి .. రఘురామ్ వైపు నుంచి ఆయన ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది? తన తండ్రి ఆశయమైన స్కూల్ ను జితేంద్ర దక్కించుకోగలుగుతాడా? అతని జీవితంలో చోటుచేసుకునే మలుపులు ఎలాంటివి అనేది మిగతా కథ.
ఈ కథ 2014 నుంచి 2018 మధ్యకాలంలో నడుస్తుంది. కొంతకాలం క్రితం స్మార్ట్స్ ఫోన్స్ కి సంబంధించి జరిగిన ఒక భారీ స్కామ్ ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. అప్పట్లో ఎక్కడ చూసినా ఈ స్కామ్ గురించే మాట్లాడుకున్నారు. ఆ స్కామ్ ను ఆధారంగా చేసుకుని అల్లుకున్న కథనే ఇది. వ్యాపారం - మోసం అనే రెండు కోణాలను టచ్ చేస్తూ ఈ కథ ముందుకు వెళుతుంది. వ్యాపారంలో మోసం చేయడం .. మోసం చేయడం కోసమే వ్యాపారం చేయడం అనేవి ప్రధానమైన అంశాలుగా కనిపిస్తాయి.
సాధారణంగా అవినీతికి .. అక్రమాలకు పాల్పడేవారిని బ్లాక్ మెయిల్ చేస్తూ, అధికారులు .. రాజకీయనాయకులు తమ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. కానీ ఈ కథలో నాయకుడు అటు రాజకీయ నాయకులకుగానీ .. ఇటు అధికారులకు గాని భయపడకుండా .. వాళ్లకి లంచాలు ఇవ్వకుండా ఎలా తన ప్లాన్ వర్కౌట్ చేస్తూ వేళ్లాడనేది దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది.
ఒక వైపున హీరో తనదైన పద్ధతిలో తన ప్లాన్ వర్కౌట్ చేస్తూ వెళుతుంటాడు. అతని మోసాన్ని బయటపెట్టడానికి అధికారం - పలుకుబడి ఉన్న ముగ్గురు బలమైన వ్యక్తులు బరిలోకి దిగుతారు. హీరోకి మూడు వైపుల నుంచి ఈ ముగ్గురు వ్యక్తులు కదలడం ఈ కథలో ఆసక్తిని రేకెత్తించే ప్రధానమైన అంశంగా కనిపిస్తుంది.
హీరో ఒక వైపున తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలి. మరో వైపున తల్లి ముచ్చట తీర్చాలి. ఇంకొక వైపున తన కలను నిజం చేసుకోవాలి. ఈ బాధ్యతలన్నీ హీరో భుజాలపై ఉంటాయి. ఇక తనని ఒక చట్రంలో ఇరికించడానికి ప్రయత్నిస్తున్న శత్రువులకు చిక్కకుండా పావులు కదపాలి. ఇలాంటి ఒక క్లిష్టమైన దారిలో హీరో కొనసాగించే ప్రయాణం ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే వెళుతుంది.
కథ - స్క్రీన్ ప్లే రెండూ చాలా నీట్ గా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. ఎక్కడా కన్ఫ్యూజన్ అనేది లేకుండా ప్రేక్షకులను ముందుకు తీసుకుని వెళతాయి. కథలోని ప్రతి అంశం క్లారిటీతో ముందుకు వెళుతుంది. అలాగే ప్రధానమైన పాత్రలన్నీ కూడా బలంగా కనిపిస్తాయి. చివర్లో వచ్చే ట్విస్ట్ .. ఈ కంటెంట్ ను మరింత పెర్ఫెక్ట్ గా మారుస్తుంది. మదర్ సెటిమెంట్ పాళ్లు కాస్త తగ్గినట్టు అనిపించినా, హీరో వైపు నుంచి లవ్ ట్రాక్ లేకపోవడం కాస్త అసంతృప్తిని కలిగించినా, ఒక భారీ స్కామ్ పై ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ సిరీస్ గా చెప్పుకోవచ్చు.
'ఆజాదీ 501' (ఆహా) సిరీస్ రివ్యూ!
Azadi Review
Movie Details
Movie Name: Azadi
Release Date: 2026-07-29
Cast: Sai Teja, Harsha Vardhan, Shashank, Geetha Bhaskar, Ravi Varma, Rocky Krishna
Director: Shiva Teja
Music: Surya Tej
Banner: Thursday Cinemas
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer