రానవ్ - రోస్మిన్ ప్రధానమైన పాత్రలను పోషించిన తమిళ సినిమానే 'బ్రేక్ ఫాస్ట్'. గిరిజా వరదరాజ్ నిర్మించిన ఈ సినిమాకి, గాంధీకృష్ణ దర్శకత్వం వహించాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఏప్రిల్ 24వ తేదీన థియేటర్లకు వచ్చింది. సంపత్ రాజ్ - అర్చన కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 24వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు .. కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
శంతను (రానవ్) ఇంజనీరింగ్ పూర్తి చేసి, మలేసియాలో కొంతకాలం పాటు జాబ్ చేస్తాడు. ఆ తరువాత కొన్ని కారణాల వలన అతను అక్కడి నుంచి వచ్చేయవలసి వస్తుంది. అయితే తాను మలేసియాలో ఉన్నట్టుగానే తల్లిదండ్రులను నమ్మిస్తూ, వాళ్ల అవసరాలను తీరుస్తుంటాడు. తండ్రి ట్రీట్మెంట్ కి తగిన డబ్బును పంపిస్తూ ఉంటాడు. తన సర్టిఫికెట్స్ కూడా సీజ్ చేయబడటంతో, డబ్బు కోసం తనకి తోచిన పనులను చేస్తూ వెళుతుంటాడు.
అలాంటి అతను ఒక రోజున జాన్వీ (రోస్మిన్) కంటపడతాడు. ఆ తరువాత కూడా ఒకటి రెండు సార్లు ఆమెకి తారసపడతాడు. అతని కేరక్టర్ ఆమెకి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. శ్రీమంతుడైన రాజారామ్ (సంపత్ రాజ్)కి ఆమె కూతురు. తండ్రి నడుపుతున్న బిస్కట్ కంపెనీకి ఆమె జె ఎమ్ డి గా ఉంటుంది. అలాంటి ఆమె శంతను గురించి తెలుకుని అతనికి తమ సంస్థలో జాబ్ ఇస్తుంది. అప్పటి నుంచి వాళ్లిద్దరి మద్య పరిచయం మొదలై అది కాస్తా ప్రేమగా మారుతుంది ..పెళ్లి వరకూ వెళుతుంది.
రాజా రామ్ మొదటి భార్య కూతురే జాన్వీ. తన కూతురు శంతనును ప్రేమిస్తుందనే విషయం అతనికి తెలిసిపోతుంది. ఈ విషయంలో అతను కూతురును మందలిస్తాడు. తన అంతస్తుకి తగిన వాడిని పెళ్లి చేసుకోమని చెప్పి, ఒక సంబంధం తీసుకొస్తాడు. అప్పుడు జాన్వీ ఏం చేస్తుంది? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? శంతనుతో ఆమె జీవితం ఎలా కొనసాగుతుంది? అనేది మిగతా కథ.
రిషభ్ - లక్ష్మీ అనే ఇద్దరు యువతీ యువకులు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. పెళ్లైన మూడు నెలలకే విడిపోవాలని నిర్ణయించుకుంటారు. ఈ విషయంలో కౌన్సిలింగ్ కోసం సైకియాట్రిస్ట్ 'గంగాదేవి'( కస్తూరి)ని కలుస్తారు. తనముందే వాళ్లిద్దరూ పడుతున్న గొడవను చూసిన గంగాదేవి, గతంలో జరిగిన శంతను - జాన్వీ ప్రేమకథను చెప్పడం మొదలుపెట్టడంతోనే అసలు కథ మొదలవుతుంది. ఈ గంగాదేవికి .. ఆ శంతను కథకు లింక్ ఏమిటి? అనే కుతూహలాన్ని రేకిత్తిస్తూ దర్శకుడు ఈ కథను నడిపించాడు.
శ్రీమంతురాలైన జాన్వీ, పేదింటికి చెందిన శంతనును ప్రేమించడం .. తండ్రిని ఎదిరించి పెళ్లి చేసుకోవడం .. తన సంస్థను అతని చేతులలో పెట్టడం .. ఫస్టాఫ్ గా కొనసాగుతుంది. ఇక శంతను తల్లిదండ్రులు ఆ ఇంటికి రావడం .. ఆ పల్లె మనుషుల అలవాట్లు ఆమెకి నచ్చకపోవడం .. వాళ్ల విషయంలో ఆమె కఠిన వైఖరి సెకండాఫ్ పై మరింత కుతూహలాన్ని పెంచుతూ వెళతాయి. భార్యాభర్తల మధ్య ఈగోలు ఈ కథను మరింత వేడెక్కిస్తూ ప్రీ క్లైమాక్స్ దిశగా నడిపిస్తాయి.
సాధారణంగా తండ్రి బాగా డబ్బు - పలుకుబడి ఉన్న వ్యక్తి అయినప్పుడు, కూతురు అతనికి ఇష్టం లేని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు .. ఆ తండ్రి ఏం చేస్తాడోననే ఒక టెన్షన్ ఆడియన్స్ కి ఉంటుంది. అందుకు తగినట్టుగానే ఆ తండ్రి రకరకాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది. కానీ అక్కడి నుంచి అందుకు భిన్నంగా ఈ కథ ముందుకు వెళుతుంది. తండ్రి పాత్ర పక్కకి వెళ్లిపోయి, భార్యాభర్తలు తలపడటం కొత్తగా అనిపిస్తుంది.
కథలో ఎక్కువ భాగం హీరో - హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. ప్రేమికులుగా .. భార్యాభర్తలుగా వాళ్ల పాత్రలలో వేరియేషన్స్ ఉంటాయి. వాళ్లిద్దరూ అలా గొడవపడుతూ ఉంటే, చివరిలో కనువిప్పు కలగడం కామనే గదా అనుకుంటాము. కానీ అక్కడే ఎవరూ గెస్ చేయని ఒక ట్విస్ట్ పడుతుంది. ఆ ట్విస్ట్ అప్పటివరకూ చూసిన కథ బరువును పెంచుతుంది. ఈ కంటెంట్ ను యావరేజ్ ప్లేస్ లో నిలబెడుతుంది.
ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా బాగా చేశారు. డబ్బు .. అహంభావం కూడిన పాత్రలో రోస్మిన్ నటన ఆకట్టుకుంటుంది. తన మాట మాత్రమే నెగ్గాలనే పంతం కలిగిన ఆ పాత్రలో ఆమె అభినయం మెప్పిస్తుంది. ఇక తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా మసలుకునే పాత్రలో రానవ్ నటన మంచి మార్కులు కొట్టేస్తుంది. పన్నీర్ సెల్వమ్ ఫొటోగ్రఫీ ..జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం .. ఫరవాలేదు. భాస్కర్ ఎడిటింగ్ ఓకే.
తల్లిదండ్రులను ప్రేమించలేనివారు మరెవరినీ ప్రేమించలేరు. బంధాలకు .. అనుబంధాలకు విలువనీయలేరు. ఈగో కారణంగా వైవాహిక జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. సర్దుకుపోవడంలోనే సంతోషం ఉంటుంది అనే సందేశాన్ని ఇచ్చిన ఈ సినిమా, యావరేజ్ కేటగిరీలోకి వస్తుందని చెప్పొచ్చు.
'బ్రేక్ ఫాస్ట్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Breakfast Review
Movie Details
Movie Name: Breakfast
Release Date: 2026-06-24
Cast: Raanav, Rosmin, Sampathraj, Archana,Krithik Mohan, Amritha Ranganath
Director: Gandhi Krishna
Music: G V Prakash Kumar
Banner: Prem Classic Pictures
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer