యూత్ ఫుల్ డ్రామా నేపథ్యంలో సాగే కథలకు యూత్ నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తూనే ఉంటుంది. అదే జోనర్ నుంచి వచ్చిన మరో సినిమానే 'జయముంది భయమేల మనసా'. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీకి వచ్చేసిన సినిమా ఇది. భరణ్ .. రవి .. రాజేశ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, రంజిత్ పాశం దర్శకత్వం వహించాడు. ఈ నెల 18వ తేదీ నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
సురేశ్ .. కిరణ్ .. వరుణ్ ముగ్గురూ కూడా మంచి స్నేహితులు. ముగ్గురూ మిడిల్ క్లాస్ కి చెందిన యువకులే. బీటెక్ పూర్తి చేసిన తరువాత తమ లక్ష్య సాధన విషయంలో క్లారిటీ రావడానికి కొంత సమయం తీసుకుంటారు. సురేశ్ కి క్రియేటర్ కావాలనే కోరిక బలంగా ఉంటుంది. అయితే అందుకు సంబంధించిన ట్రాక్ ను పట్టుకునే ప్రయత్నాలలో ఉంటాడు. కిరణ్ బ్రేకప్ కారణంగా డీలాపడిపోయి ఉంటాడు. అందులో నుంచి బయటపడటానికి నానాపాట్లు పడుతుంటాడు.
ఇక వరుణ్ కి సినిమా రచయితగా పేరు తెచ్చుకోవాలనే ఆశ ఉంటుంది. కాలేజ్ రోజుల్లో 'మధు'పై మనసు పారేసుకున్న క్షణాలను వరుణ్ గుర్తుచేసుకుంటూ ఉంటాడు. ఏదైనా జాబ్ చూసుకోమని వరుణ్ ను అతని తండ్రి పోరుతూ ఉంటాడు. దాంతో ఇంట్లో ప్రశాంతంగా స్క్రిప్ట్ రాసుకునే అవకాశం లేక వరుణ్ ఇబ్బంది పడుతుంటాడు. సురేశ్ .. కిరణ్ ఇద్దరూ కూడా తమకి కాస్త ప్రశాంతత అవసరమని భావిస్తారు. దాంతో ముగ్గురూ కలిసి సరదాగా రోడ్ ట్రిప్ వేయాలనే నిర్ణయానికి వస్తారు.
తమ బడ్జెట్ లో .. కోరుకున్న మానసిక ప్రశాంతతను పొందాలంటే, రోడ్ ట్రిప్ అనేది సైకిల్స్ పై పూర్తి చేయడమే బెటర్ అని భావిస్తారు. ఈ ట్రిప్ తప్పకుండా తాము ఆశించిన ఎనర్జీని ఇస్తుందనే నమ్మకంతో ఉంటారు. అలా ముంబై వరకూ వెళ్లి రావాలనే ఉద్దేశంతో బయల్దేరుతారు. ఆ ప్రయాణంలో వాళ్లకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? ఆ పరిస్థితులలో వాళ్లు ఏం చేస్తారు? అనేది మిగతా కథ.
ఇది ముగ్గురు స్నేహితుల చుట్టూ అల్లుకున్న కథ. ఆ ముగ్గురూ కలిసి చేసే ప్రయాణంతో పాటు సాగే కథ. వాళ్ల ఊహలు .. ఉద్వేగాలు .. భావాలు .. ఆశలు .. ఆశయాలను పరిచయం చేస్తూ పరిగెత్తే కథ. ఒక రోడ్ ట్రిప్ వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? తమ జీవితంలో ముందుకు సాగడానికి అవసరమైన అనుభవాలను ఈ రోడ్ ట్రిప్ ఎలా అందిస్తుంది? అనే ఒక సందేశంతో ఈ కథ ముందుకు వెళుతుంది.
ముగ్గురు మిత్రులు తమ కెరియర్ లో ముందుకు వెళ్లడం కోసం, అందుకు అవసరమైన ఉత్సాహాన్ని పొందడం కోసం ప్లాన్ చేసిన రోడ్ ట్రిప్ తో అసలు కథ మొదలవుతుంది. స్నేహం .. ప్రేమ .. కెరియర్ అనే అంశాలను కలుపుకుంటూ సన్నివేశాలు సాగుతుంటాయి. ఈ కథలో ముగ్గురు స్నేహితుల పాత్రలకు ప్రాధాన్యత సమానంగా ఉంటుంది .. ముగ్గురి జీవితాలు ఈ కథలో భాగమవుతాయని ఆడియన్స్ అనుకుంటారు. కానీ కథలో వరుణ్ ట్రాక్ కి మాత్రమే ఇంపార్టెన్స్ కనిపిస్తుంది.
మూడు పాత్రలు సమానంగా .. మూడు వైపుల నుంచి ఎమోషన్స్ ను టచ్ చేస్తూ సాగుతాయని భావిస్తాం. కానీ సమానంగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన మూడు పాత్రలలో, మిగతా రెండు పాత్రలు, వరుణ్ ట్రాక్ ను సపోర్ట్ చేయడానికి మాత్రమే పరిమితమవుతాయి. ఆ రెండు పాత్రల వైపు నుంచి ఎలాంటి ఫీల్ ను వర్కౌట్ చేయలేకపోయారు.
ఇక ఈ రోడ్ ట్రిప్ లో తీసుకెళ్లిన సైకిళ్లు పోగొట్టుకుని వాటి కోసం వెతకడం .. ఒకరినొకరు తిట్టుకోవడం .. వరుణ్ మనసులో ఉన్న బాధను పోగొట్టడం కోసం, పూణెలో ఉన్న అతని లవర్ 'మధు'ను కలిసేలా చేయడం మినహా మరెలాంటి ప్రయోజనం కనిపించదు. ఈ మొత్తం ప్రయాణంలో ఎమోషనల్ గా హృదయానికి హత్తుకుపోయే సన్నివేశాలంటూ ఏమీ కనిపించవు. లవ్ ట్రాక్ కూడా అంతగా ప్రభావితం చేయలేకపోతుంది.
ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా కొత్త ఆర్టిస్టులే. ఎవరి పాత్ర పరిథిలో వాళ్లు బాగానే చేశారు.ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం బాగున్నాయి. ఈ రెండూ కూడా లవ్ ట్రాక్ వైపు నుంచి అవసరమైన ఫీల్ ను ఆవిష్కరించగలిగాయి. ఎడిటింగ్ వర్క్ కూడా నీట్ గానే అనిపిస్తుంది.
గతంలో స్నేహితులంతా కలిసి రోడ్ ట్రిప్ వేయడం .. ఆ ప్రయాణంలో వాళ్లకి ఎదురయ్యే అనుభవాలతో చాలా సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలకు భిన్నంగా .. కొత్త పాయింట్ ను మాత్రం టచ్ చేయలేకపోయారు. టైటిల్ కి తగిన స్థాయి సాహసాలు కూడా ఇందులో ఏమీలేవు. 'జీవితమంటే నచ్చినట్టుగా ఉండటం .. నచ్చినట్టుగా బ్రతకడం' అనే డైలాగ్ బాగుంది. కానీ ఆ దిశగా మనసుకు హత్తుకునే సన్నివేశాలను మాత్రం అల్లుకుంటూ వెళ్లలేకపోయారు.
'జయముంది భయమేల మనసా'(ఈటీవీ విన్) మూవీ రివ్యూ!
Jayamundi Bhayamela Manasa Review
Movie Details
Movie Name: Jayamundi Bhayamela Manasa
Release Date: 2026-06-18
Cast: Bharan Dandamudi, Ravi Mahadasyam, Rajesh Khanna, Sharanya Sharma
Director: Ranjith Pasham
Music: Kalyan Nayak
Banner: Anantha Chitralaya
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer