ఇప్పుడు 'జియో హాట్ స్టార్' లో ఒక కొత్త సిరీస్ ప్రత్యక్షమైంది. తమిళంలో రూపొందిన ఆ సిరీస్ పేరే 'బ్రదర్స్ అండ్ సిస్టర్స్'. చిదంబరం మణివన్నన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ కి వచ్చింది. ముందుగా 4 ఎపిసోడ్స్ ను వదిలారు. ఇకపై ప్రతి బుధవారం కొన్ని ఎపిసోడ్స్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. మొదటి నాలుగు ఎపిసోడ్స్ ఎంతవరకూ కనెక్ట్ అయ్యాయనేది ఇప్పుడు చూద్దాం. 

'చెన్నై' నగరంలో షణ్ముఖ సుందరం (బోస్ వెంకట్) ఒకపెద్ద బట్టల దుకాణాన్ని నడుపుతూ ఉంటాడు. భార్య (గాయత్రి శాస్త్రి) పిల్లలు జయశ్రీ (నిఖిలా శంకర్) హరిణి .. మీరా .. జగ్గూ .. ఇదే అతని ఫ్యామిలీ. జయశ్రీ లాయర్ గా పనిచేస్తూ ఉంటుంది. హరిణి ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ ఉంటుంది. ఇక మీరా విషయానికి వస్తే, ఆమె క్రికెట్ లో రాణించడానికి తనవంతు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ విషయంలో అశ్విన్ ఆమెను ప్రోత్సహిస్తూ ఉంటాడు.'జగ్గూ' మాత్రం డీజేగా తన కెరియర్ ను కొనసాగిస్తూ ఉంటాడు. 

హరిణి పనిచేసే సంస్థలో సిద్ధార్థ్ హెచ్ ఆర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతను ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని హరిణితో చెప్పినా ఆమె పెద్దగా పట్టించుకోదు. అయినా ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో సిద్ధార్థ్ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇక జయశ్రీ విషయానికి వస్తే, కొంతకాలం పాటు ఆమె బెంగుళూర్ లో ఉండవలసి వస్తుంది. అక్కడ పరిచయమైన మనోజ్ తో ఆమె సహజీవనం చేయడం మొదలుపెడుతుంది. 

షణ్ముఖ సుందరానికి తరచూ 'గిరిజ' అనే ఒక స్త్రీ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి. ఆమె అడిగినంత డబ్బును అతను ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఆయన రెండో కూతురు హరిణిని తన దారిలోకి తెచ్చుకోవడానికి సిద్ధార్థ్ తన తల్లి చెప్పిన ప్లాన్స్ ఆచరణలో పెడుతూ ఉంటాడు. జయశ్రీతో ఆరు నెలల పాటు సహజీవనం చేసిన మనోజ్, ఆ తరువాత కనిపించకుండా పోతాడు. దాంతో మనోజ్ ఫ్రెండ్ ప్రియన్ తో కలిసి జయశ్రీ అతనిని వెదకడం మొదలుపెడుతుంది. 

 షణ్ముఖ సుందరానికి తరచూ కాల్ చేసే గిరిజ ఎవరు? ఆమెతో ఆయనకి ఉన్న సంబంధం ఏమిటి? మనోజ్ కారణంగా మోసపోయిన జయశ్రీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? హారిణిని బుట్టలో వేసుకోవడానికి సిద్ధార్థ్ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? క్రికెట్ లో రాణించాలనుకున్న 'మీరా' కల నెరవేరుతుందా? అనేది మిగతా కథ.

'కుటుంబం అంటే నాలుగు గోడలు .. ఒక పై కప్పు కాదు, ప్రేమానురాగాల నిలయం' అనే డైలాగ్ ఆ మధ్య కాలంలో వచ్చిన ఒక సినిమాలో బాగా పేలింది. నిజం కూడా అంతే. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండాలి .. ఎవరెవరు ఏం చేస్తున్నారనేది ఆ కుటుంబంలో అందరికీ తెలియాలి. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా, అది తమ అందరిదిగా భావించాలి. ఆ బాధను పంచుకుంటూనే ధైర్యంగా నిలబడాలి. అనే ఒక అంశానికి కామెడి టాచ్ ఇస్తూ దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. 

తన భర్త ఎంతో గొప్పవాడని భార్య అనుకుంటుంది. అలాగే తన పిల్లలు ఎలాంటి తప్పు చేయరనే ఒక నమ్మకంతో ఉంటుంది. తన దగ్గర వాళ్లకి ఎలాంటి రహస్యాలు ఉండవని భావిస్తుంది. అలా ఒక బలమైన విశ్వాసంతో బ్రతుకుతున్న ఒక ఇల్లాలికి, తాను భ్రమలో బ్రతుకుతున్నానని తెలిసినప్పుడు ఎలా ఉంటుందనే అంశాన్ని కేంద్రంగా చేసుకుని ఈ కథ విస్తరిస్తుంది. 

 షణ్ముఖ సుందరం అనే ఒక బిజినెస్ కుటుంబం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ముగ్గురు ఆడపిల్లలు .. వాళ్ల కెరియర్ .. వాళ్ల ప్రేమ వ్యవహారాలను టచ్ చేస్తూ మొదటి ఎపిసోడ్స్ మొదలవుతాయి. మరో వైపున షణ్ముఖ సుందరంలోని కనిపించని కోణం వైపు నుంచి మరో ట్రాక్ నడుస్తూ ఉంటుంది. అందువలన ఈ కథ బోర్ అనిపించకుండా ముందుకు వెళుతూ ఉంటుంది.  

దర్శకుడు ఆయా పాత్రలను .. స్వరూప స్వభావాలను డిజైన్ చేసిన తీరు బాగుంది. మొదటి నాలుగు ఎపిసోడ్స్ లోనే ప్రధానమైన పాత్రలను చాలావరకూ పరిచయం చేసిన తీరు మెప్పిస్తుంది. కథ ఒక ఫ్లోలో వెళుతూ ఉండగానే పాత్రలన్నీ పరిచయమవుతూ ఉంటాయి. సజత్వానికి దగ్గరగా ఈ కథను ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. మణికందన్ రామమూర్తి ఫొటోగ్రఫీ .. శరణ్ రాఘవన్ నేపథ్య సంగీతం .. చంద్రూ ఎడిటింగ్ ఫరవాలేదు.

కథ మొదలైన దగ్గర నుంచి చాలా సహజంగా ముందుకు వెళుతుంది. ఎక్కడా కృతకంగా అనిపించదు. కథ ఎప్పటికప్పుడు లొకేషన్స్ మార్చుకుంటూ .. మలుపులు తీసుకుంటూ ముందుకు వెళుతుండటం వలన, ప్రేక్షకులు ఫాలో అవుతూ ఉంటారు. మున్ముందు ఎంట్రీ ఇవ్వనున్న విలక్షణమైన  పాత్రలు .. ఆసక్తికరమైన మలుపులు .. కామెడీ కంటెంట్ ను బట్టి, ఈ సిరీస్ కి మరింత బలం చేకూరే ఛాన్స్ ఉందని చెప్పచ్చు.