చైనాలో ఒకేసారి 196 పార్కింగ్ స్లాట్లు కొనుగోలు చేసిన మహిళ... భారీ లాభాలు ఆర్జిస్తున్న మహిళ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చైనాలో ఒకేసారి 196 పార్కింగ్ స్లాట్లు కొనుగోలు చేసిన మహిళ... భారీ లాభాలు ఆర్జిస్తున్న మహిళ!

Woman buys 196 parking slots at once in China earning huge profits
  • చైనాలో ఒకేసారి 196 పార్కింగ్ స్లాట్లు కొన్న మహిళ
  • డిమాండ్ పెరగడంతో భారీగా అద్దెలు, అమ్మకం ధరలు పెంపు
  • యజమానురాలిపై కోర్టుకు వెళ్లిన నివాసితులు
  • మహిళ కొనుగోలు చట్టబద్ధమేనని తీర్పు ఇచ్చిన కోర్టు
చైనాలో ఒక మహిళ తన ముందుచూపుతో చేసిన పెట్టుబడి ఆమెను కోటీశ్వరురాలిని చేయడమే కాకుండా, స్థానిక నివాసితులతో తీవ్ర వివాదానికి, తదనంతరం న్యాయపోరాటానికి దారితీసింది. అయితే, ఈ కేసును విచారించిన న్యాయస్థానం చివరకి ఆమెకే అనుకూలంగా తీర్పునివ్వడం గమనార్హం.

హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్షా నగరంలో 2018లో ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్టు పూర్తయింది. అప్పట్లో ఆ ప్రాంతంలో పాఠశాలలు, మార్కెట్లు, రవాణా సౌకర్యాలు తగినంతగా లేకపోవడంతో ఫ్లాట్లు లేదా పార్కింగ్ స్థలాలు కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. అయితే, 'వు' అనే మహిళ స్థానిక ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలను లోతుగా అధ్యయనం చేసి, ఆ ప్రాంత భవిష్యత్తును ముందుగానే అంచనా వేశారు. 

ఆ సమయంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డెవలపర్‌తో సంప్రదింపులు జరిపి, ఏకంగా 196 పార్కింగ్ స్లాట్లను 14 మిలియన్ యువాన్లకు (సుమారు రూ. 20 కోట్లు) ఒకేసారి కొనుగోలు చేశారు. ప్రాజెక్టులోని మొత్తం పార్కింగ్ స్థలాల్లో ఇది 40 శాతం కావడం విశేషం.

ఆమె ఊహించినట్టుగానే కొన్నేళ్లలో ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందింది. ఫ్లాట్లన్నీ అమ్ముడయ్యాయి. దీంతో పార్కింగ్ స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా భావించిన వు, తన స్థలాలను ఇతరులు వాడకుండా పార్కింగ్ లాక్స్ ఏర్పాటు చేశారు. గతంలో డెవలపర్ నెలకు సుమారు రూ. 3,600గా నిర్ణయించిన అద్దెను, ఆమె ఏకంగా రూ. 7,258కి పెంచేశారు. కొన్ని స్లాట్లను ఒక్కొక్కటి అసలు ధర కంటే 80 శాతానికి ఎక్కువకు విక్రయానికి ఉంచారు.

వు నిర్ణయంతో ఆగ్రహానికి గురైన స్థానికులు, అద్దె తగ్గించాలని కోరినా ఆమె అంగీకరించలేదు. ప్రభుత్వ అధికారులు మధ్యవర్తిత్వం వహించినా ఫలితం లేకపోయింది. దీంతో కొందరు నివాసితులు కలిసి కోర్టును ఆశ్రయించారు. పార్కింగ్ స్థలాలు నిత్యావసర సౌకర్యాలని, వాటిని ఒకే వ్యక్తి గుత్తాధిపత్యం చేసి లాభాలు ఆర్జించడం సరికాదని వాదించారు. వు, డెవలపర్ మధ్య జరిగిన ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు.

ఈ కేసును విచారించిన చాంగ్షా కోర్టు, ఈ ఏడాది ఫిబ్రవరిలో వుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ప్రాజెక్టు అమ్మకానికి పెట్టినప్పుడు పార్కింగ్ స్థలాలు కొనుగోలు చేసే అవకాశం నివాసితులందరికీ ఉందని, కానీ వారు ఆ హక్కును వినియోగించుకోలేదని కోర్టు పేర్కొంది. వు మాత్రం మార్కెట్ రిస్క్ తీసుకుని, సొంత నిధులతో పెట్టుబడి పెట్టారని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి ఎన్ని పార్కింగ్ స్థలాలైనా కొనుగోలు చేయవచ్చని, దీనిపై చట్టపరమైన పరిమితులు ఏవీ లేవని పేర్కొంది.
Advertisement
Ms Wu China parking space investment
Changsha real estate news
Hunan parking slot lawsuit

More Telugu News