నాపై పోటీ చేసి గెలువు: కేటీఆర్‌కు దానం నాగేందర్ సవాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాపై పోటీ చేసి గెలువు: కేటీఆర్‌కు దానం నాగేందర్ సవాల్

Danam Nagender challenges KTR to contest and win against him
  • ఖైరతాబాద్ బరిలో దిగాలని కేటీఆర్‌కు దానం నాగేందర్ సవాల్
  • ఉప ఎన్నిక తమ ప్రభుత్వ పాలనకు రెఫరెండం అని వ్యాఖ్య
  • ఇండియా కూటమి 'సేవ్ డెమోక్రసీ' ర్యాలీలో కీలక వ్యాఖ్యలు
ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ బహిరంగ సవాల్ విసిరారు. ఖైరతాబాద్‌లో తనపై పోటీ చేసి గెలవాలని, ఈ పోరులో తాడోపేడో తేల్చుకుందామని ఆయన వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో ఇండియా కూటమి చేపట్టిన 'సేవ్ డెమోక్రసీ' ర్యాలీలో దానం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉప ఎన్నికకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ‘దానం నాగేందర్ అంటేనే ఒక బ్రాండ్’ అని ధీమా వ్యక్తం చేసిన ఆయన, ఈ ఉప ఎన్నిక తమ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఒక రెఫరెండంగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ విధానానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపైనా దానం స్పందించారు. ప్రజల ఓటు హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదని, ఆ అధికారం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈ నిరసనలకు రాహుల్ గాంధీతో పాటు ఇండీ కూటమి నేతలు, యువత మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయనపై అనర్హత వేటు పడటంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలోనే జరగనున్న ఉప ఎన్నికలో విజయం సాధించి తీరుతామని దానం ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Danam Nagender
KTR
Khairatabad By Election
Telangana Politics
Congress Party
BRS Party

More Telugu News