జంతర్ మంతర్‌లో లైంగిక వేధింపులు.. ఢిల్లీ పోలీసులపై ముగ్గురు మహిళా జర్నలిస్టుల సంచలన ఆరోపణలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జంతర్ మంతర్‌లో లైంగిక వేధింపులు.. ఢిల్లీ పోలీసులపై ముగ్గురు మహిళా జర్నలిస్టుల సంచలన ఆరోపణలు!

Delhi Police accused of sexual harassment by three female journalists at Jantar Mantar
  • జంతర్ మంతర్‌లో ముగ్గురు మహిళా జర్నలిస్టులపై పోలీసుల లైంగిక వేధింపులు
  • ఓ ఏసీపీ తనతో అనుచితంగా ప్రవర్తించారని ఓ జర్నలిస్ట్ ఆరోపణ
  • ఫిర్యాదులను విచారణ కోసం క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేసిన పోలీసులు
  • ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 
  • కేంద్ర హోంమంత్రి సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం జరిగిన నిరసన కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న ముగ్గురు మహిళా జర్నలిస్టులపై పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఢిల్లీ పోలీసులు ఆ ఫిర్యాదులను నిష్పక్షపాత విచారణ కోసం క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనల సందర్భంగా ఈ ఘటన జరిగింది. బాధితురాళ్లలో ఒకరైన మహిళా జర్నలిస్ట్, ఓ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) తనతో అనుచితంగా ప్రవర్తించారని, లైంగికంగా వేధించారని ఆరోపించారు. 

తాను పోలీసుల చర్యలను వీడియో తీస్తుండగా, ఆ అధికారి తనను అసభ్యంగా తాకి పక్కకు నెట్టేశారని ఆమె వాపోయారు. ఘటన అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, వెంటనే కేసు నమోదు చేయడానికి నిరాకరించారని వారు ఆరోపించారు.

ఈ ఘటనపై 'ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా' (పీసీఐ) తీవ్ర దిగ్భ్రాంతి, ఆందోళన వ్యక్తం చేసింది. "ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రవర్తనను సాధారణ విషయంగా పరిగణించలేం. జర్నలిస్టులు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ విధులను నిర్వర్తించేలా చూడాలి. దేశ రాజధాని నడిబొడ్డున ఇలాంటి ఘటనలు జరగడం మీడియా స్వేచ్ఛకు మంచిది కాదు" అని పీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. 

మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, మీడియా ప్రతినిధులు బెదిరింపులు లేకుండా పనిచేసే వాతావరణం కల్పించాలని డిమాండ్ చేసింది.

రాహుల్ గాంధీ ఘాటు స్పందన‌
ఈ వ్యవహారంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తారని, కాబట్టి దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షానే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

"ఒక మహిళా జర్నలిస్ట్ పోలీస్ అధికారిపై ఆరోపణలు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనే డిమాండ్‌తో వందలాది మంది జర్నలిస్టులు గంటల తరబడి అక్కడే కూర్చున్నారు. కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం దారుణం" అని ఆయన 'ఎక్స్' వేదికగా విమర్శించారు. 

"ఒక మహిళ ఫిర్యాదును నమోదు చేయడానికి కూడా భయపడే ప్రభుత్వం దేనిని కాపాడుతోంది? అమిత్ షా గారూ, మీరెక్కడున్నారు? దీనికి మీరే సమాధానం చెప్పాలి" అని రాహుల్ సూటిగా ప్రశ్నించారు.
Advertisement
Delhi Police
Jantar Mantar
Female Journalists
Sexual Harassment Allegations
Rahul Gandhi
Press Council of India

More Telugu News