60 ఏళ్ల సుబ్బయ్య సూపర్.. 2 లక్షల కి.మీ. సైక్లింగ్‌తో అద్భుతం
Add ap7am to your home Screen

60 ఏళ్ల సుబ్బయ్య సూపర్.. 2 లక్షల కి.మీ. సైక్లింగ్‌తో అద్భుతం

Bandlamudi Subbaiah 60-year-old Guntur cyclist sets 2 lakh km cycling record
  • గుంటూరుకు చెందిన సైక్లిస్ట్ బండ్లమూడి సుబ్బయ్య అరుదైన ఘనత
  • కేవలం ఆరేళ్లలో 2 లక్షల కిలోమీటర్ల సైక్లింగ్ పూర్తి
  • సెప్టెంబర్ 30 నాటికి రికార్డు సాధించిన సుబ్బయ్య
  • రోజూ 100 కిలోమీటర్ల సైక్లింగ్‌తో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వైనం
  • ఆయనను ఘనంగా సత్కరించిన తోటి సైక్లిస్టులు
వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, సంకల్పం ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని నిరూపిస్తున్నారు గుంటూరుకు చెందిన ప్రముఖ సైక్లిస్ట్ బండ్లమూడి సుబ్బయ్య. సుబ్బయ్య వయసు ప్రస్తుతం 60 ఏళ్లు. ఆయన సాధించిన ఘనత ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏకంగా రెండు లక్షల కిలోమీటర్ల సైకిల్ ప్రయాణాన్ని పూర్తి చేసి, ఈ అరుదైన క్లబ్‌లో చేరిన అతి కొద్దిమందిలో ఒకరిగా నిలిచారు. నిన్న (సెప్టెంబర్ 30) బుధవారం నాటికి సుబ్బయ్య ఈ మైలురాయిని చేరుకున్నారు. 

గుంటూరు సమీపంలోని వెంగళాయపాలెం అనే చిన్న గ్రామంలో ఓ రైతు కుటుంబంలో సుబ్బయ్య జన్మించారు. కోటయ్య, సామ్రాజ్యమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, ఈయన రెండోవారు. సుబ్బయ్య వృత్తిరీత్యా సివిల్ ఇంజినీర్. ఆయన గుంటూరులో అనేక భవనాలు, ఫ్లాట్లు, వాణిజ్య భవనాల నిర్మాణంలో తన సేవలు అందించారు. సుబ్బయ్య పెద్దన్నయ్య సింగయ్య ఐఆర్ఏఎస్ అధికారిగా రైల్వే శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించి కొంతకాలం కిందట రిటైరయ్యారు. సుబ్బయ్య తమ్ముడు శ్రీనివాసరావు వ్యవసాయ రంగంలో ఉన్నారు.

ఆశ్చర్యకరంగా, సుబ్బయ్య తన సైక్లింగ్ ప్రస్థానాన్ని ప్రారంభించింది కేవలం ఆరేళ్ల క్రితమే. కరోనా మహమ్మారి సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధతో సైకిల్ తొక్కడం మొదలుపెట్టిన ఆయన, అనతికాలంలోనే దానిని తన జీవితంలో అంతర్భాగంగా మార్చుకున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు వరకు విరామం లేకుండా సుమారు 100 కిలోమీటర్లు తగ్గకుండా సైక్లింగ్ చేయడం ఆయన దినచర్య. ఇప్పటివరకు 1,623 సెంచరీ రైడ్లతో, 355 హాఫ్ సెంచరీ రైడ్లతో రెండు లక్షల కిలోమీటర్ల మైలురాయిని అందుకున్నారు. 

సుబ్బయ్య ప్రయాణం కేవలం గుంటూరు నగర వీధులకే పరిమితం కాలేదు. ఆయన తన సైకిల్‌పై దేశంలోని పలు ప్రాంతాలను చుట్టివచ్చారు. 'కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు' సాగించిన యాత్రతో సహా మొత్తం 15 సుదీర్ఘ రైడ్‌లను విజయవంతంగా పూర్తి చేశారు. ఆయన ఆల్-టైమ్ గణాంకాలను పరిశీలిస్తే, మొత్తం 2,268 రైడ్‌లలో ఈ అద్భుతమైన దూరాన్ని అధిగమించారు. ఒకసారి ఏకధాటిగా 1,058 కిలోమీటర్ల వరకు ప్రయాణించి తన శారీరక, మానసిక దృఢత్వాన్ని చాటుకున్నారు. 

ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని గుంటూరులోని విద్యానగర్ ఎక్స్‌టెన్షన్‌లో డాక్టర్ పోసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో తోటి సైక్లిస్టులు సుబ్బయ్యను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుబ్బయ్య మాట్లాడుతూ, "నిరంతర సాధన, క్రమశిక్షణతో సైక్లింగ్‌ను నా జీవితంలో భాగం చేసుకున్నాను. దాని ఫలితమే ఈ రికార్డు" అని వినమ్రంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎన్. వెంకటరావు, విజయ్, అనిల్, డాక్టర్ రంజిత్, డాక్టర్ సీతారామ్, మాదల శ్రీనివాస్ వంటి పలువురు ప్రముఖులు పాల్గొని సుబ్బయ్యను అభినందించారు. పట్టుదల ఉంటే ఏ వయసులోనైనా అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన సుబ్బయ్య, నేటి యువతకు స్ఫూర్తిదాతగా నిలుస్తున్నారు. 

అన్నట్టు.. సుబ్బయ్య మాస్టర్స్ కేటగిరీలో మంచి స్విమ్మర్ కూడా. హైస్కూల్ స్థాయిలో స్పోర్ట్స్ మన్ అయిన ఆయన, వివాహం తర్వాత క్రీడలకు దూరయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ క్రీడలవైపు మళ్లారు. ఈసారి ఆయన ఎంచుకున్నది స్విమ్మింగ్. కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజి వద్ద రోజుకు రెండు కిలోమీటర్ల మేర స్విమ్మింగ్ సాధన చేసి అందులో నైపుణ్యం సాధించారు. ఆయన స్విమ్మింగ్ ప్రయాణంలో కృష్ణా నదిలో చేసిన విన్యాసాలు ఒక ప్రత్యేక అధ్యాయం. విజయవాడ ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ ఏటా నిర్వహించే కృష్ణా నది ఈత పోటీల్లో పాల్గొన్నారు. తొలి ప్రయత్నంలో ఓటమి తర్వాత కఠోరంగా శ్రమించారు. ఆ తర్వాత నిర్వహించిన పోటీల్లో ఆయన మొదటి రెండు స్థానాల్లో ఉండేవారు. అయితే విజేత, లేకపోతే రెండో స్థానం... ఇలా సాగింది సుబ్బయ్య స్విమ్మింగ్ ప్రస్థానం. హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా పాల్గొని, తొలి ప్రయత్నంలోనే ఆరో స్థానం సాధించారు. సుమారు 20 ఏళ్ల పాటు స్విమ్మింగ్‌లో కొనసాగి, వివిధ వయసుల కేటగిరీలలో జాతీయ స్థాయి వరకు ఎన్నో పతకాలు సాధించారు. 

అనంతరం కరోనా సమయంలో సైక్లింగ్ ను ఎంచుకుని అందులోనూ తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు 2 లక్షల కి.మీ సైక్లింగ్ తో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. 

ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వ్యక్తిగత ఘనతలు, మైలురాళ్ల కంటే ఫిట్ నెస్, ఆరోగ్యం కోసం సైక్లింగ్ క్రీడకు యువతలో విస్తృత ప్రాచుర్యం కల్పించాలన్నదే ఆయన ఆలోచన.


Advertisement
Bandlamudi Subbaiah
Guntur Cyclist
2 Lakh KM Cycling Record
Kashmir to Kanyakumari Cycling
Indian Cyclist Achievement
Fitness Motivation for Seniors

More Telugu News