మతసామరస్యానికి ప్రతీక.. గణపతి ఊరేగింపులో 'భర్ దో ఝోలీ'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మతసామరస్యానికి ప్రతీక.. గణపతి ఊరేగింపులో 'భర్ దో ఝోలీ'

Symbol of religious harmony Bhar Do Jholi in Ganpati procession
  • చార్మినార్ వద్ద గణేశ్ శోభాయాత్రలో ఖవ్వాలి సందడి
  • 'భర్ దో ఝోలీ మేరీ యా మొహమ్మద్' పాటతో భక్తుల నృత్యాలు
  • హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీకగా నెటిజన్ల ప్రశంసలు
  • 2022లోనూ మక్కా మసీదు వద్ద ఇదే తరహా ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ నగరం తన విశిష్టమైన మత సామరస్య సంస్కృతిని మరోసారి చాటిచెప్పింది. శుక్రవారం రాత్రి చార్మినార్ పరిసరాల్లో జరిగిన గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో ఒక అపూర్వ దృశ్యం ఆవిష్కృతమైంది.

సాధారణంగా డీజే హోరుతో సాగే గణేశ్ ఊరేగింపులకు భిన్నంగా, ఇక్కడ అద్నాన్ సమీ ఆలపించిన ప్రసిద్ధ ఖవ్వాలి 'భర్ దో ఝోలీ మేరీ యా మొహమ్మద్' ప్రతిధ్వనించింది. 2015లో విడుదలైన 'బజరంగీ భాయిజాన్' చిత్రంలోని ఈ సూఫీ గీతానికి భక్తులు ఉత్సాహంగా నృత్యం చేస్తూ శోభాయాత్రలో ముందుకు కదిలారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌కే ప్రత్యేకమైన 'గంగా-జమున తహజీబ్'కు ఇది నిలువెత్తు నిదర్శనమంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భిన్న మతాల వారు పరస్పరం గౌరవించుకునే నగర విశిష్ట సంస్కృతిని ఈ ఘటన ప్రతిబింబించిందని పలువురు అభిప్రాయపడ్డారు.

ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇదేం మొదటిసారి కాదు. 2022లో సైతం పాతబస్తీలోని మక్కా మసీదు సమీపంలో జరిగిన గణేశ్ విగ్రహ ఊరేగింపులో ఇదే ఖవ్వాలీని ప్లే చేయగా, స్థానికులు ఎంతో ఆనందంగా ఆస్వాదించారు. తాజా ఘటనతో భాగ్యనగరం మరోసారి తన సోదరభావానికి, సాంస్కృతిక సమైక్యతకు మారుపేరుగా నిలిచింది.
Advertisement
Hyderabad Ganesh Nimajjanam
Charminar Ganesh Procession
Bhar Do Jholi Qawwali
Religious Harmony Hyderabad

More Telugu News