తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తత.. పెద్దారెడ్డి గృహనిర్బంధం
- తాడిపత్రిలోని గాంధీ విగ్రహం వద్ద సామూహిక దీక్ష చేపడతామన్న పెద్దారెడ్డి వర్గీయులు
- వైసీపీ దీక్షను అడ్డుకుంటామన్న జేసీ వర్గీయులు
- తాడిపత్రిలో భారీగా మోహరించిన పోలీసులు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాలు పోటాపోటీగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా పెద్దారెడ్డిని గృహనిర్బంధం చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... తాడిపత్రిలోని ప్రధాన కూడలి అయిన గాంధీ విగ్రహం వద్ద సామూహిక దీక్ష చేపడతామని పెద్దారెడ్డి వర్గీయులు ప్రకటించారు. అయితే, ఈ దీక్షను ఏమాత్రం సాగనివ్వబోమని, తాము అడ్డుకుంటామని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులైన టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఇదే సమయంలో జేసీ వర్గం మరో అడుగు ముందుకేసి.. అనంతపురంలో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు చేస్తామని ప్రకటించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది.
జిల్లాలో ఒకవైపు మొహరం వేడుకలు, మరోవైపు వీవీఐపీల పర్యటనలు ఉండటంతో... ఇరువురు నేతల కార్యక్రమాలకు అదనపు రక్షణ కల్పించడం సాధ్యం కాదని పోలీసులు తేల్చి చెప్పారు. ఇరు వర్గాల నిరసనలకు అనుమతి నిరాకరించారు. ప్రజా శాంతికి సహకరించాలంటూ ఇరుపక్షాల నేతలకు ముందస్తుగా లీగల్ నోటీసులు జారీ చేశారు.
ఇందులో భాగంగానే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు ఆయన ఇంట్లోనే గృహ నిర్బంధం చేశారు. ఆయన నివాసం చుట్టూ, అలాగే తాడిపత్రిలోని గాంధీ సర్కిల్, సున్నితమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు.