విజయవాడ సాయికృష్ణ ఒక క్రిమినల్ అన్నట్టుగా పవన్ మాట్లాడుతున్నారు: అంబటి రాంబాబు

Ambati Rambabu slams Pawan Kalyan over Vijayawada Sai Krishna missing case comments
  • పవన్ ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయనకే క్లారిటీ లేదన్న అంబటి
  • ఏడు జన్మలెత్తిని తమను ఏమీ చేయలేరని వ్యాఖ్య
  • పవన్‌కు హోంమంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నానన్న అంబటి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. విజయవాడ సాయికృష్ణ అదృశ్యం కేసు అంశంపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై అంబటి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రభుత్వం బాధితులకు న్యాయం చేస్తామని చెబుతుంటే... మరోవైపు సాయికృష్ణను ఒక క్రిమినల్ అన్నట్టు పవన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 


జనసేన నేత సామినేని ఉదయభాను మాత్రం బాధితుడి ఇంటికి వెళ్లి పవన్ పంపిస్తేనే వచ్చామంటున్నారని, అసలు పవన్ ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయనకే క్లారిటీ లేదన్నారు. ఈ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే ‘సిట్’ నాటకాలు ఆపి, సీబీఐ లేదా ఎన్ఐఏ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.


వైసీపీ నేతల తాటతీస్తామంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై అంబటి తీవ్రంగా స్పందించారు. "రాజ్యాంగబద్ధమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉండి మాట్లాడే భాషేనా ఇది? మీ ఎమ్మెల్యే పంతం నానాజీ భాష ఎలా ఉందో చూశారా? పవన్ గారూ.. మీరు ఏడు జన్మలెత్తినా మమ్మల్ని ఏమీ చేయలేరు. మీ ఉడత ఊపులకు, సొల్లు కబుర్లకు ఇక్కడెవరూ భయపడరు" అని స్పష్టం చేశారు. 


అలాగే ‘నేను హోంమంత్రిగా లేకపోవడం మీ అదృష్టం’ అని పవన్ అనడం ద్వారా ప్రస్తుతం ఉన్న హోంమంత్రి అనిత సరిగ్గా పని చేయడం లేదని ఆయనే ఒప్పుకున్నట్లయిందని... అందుకే పవన్‌కు హోంమంత్రి పదవి ఇవ్వాలని తాను సీఎం చంద్రబాబును రిక్వెస్ట్ చేస్తున్నానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని, ముంబై దాడుల నిందితుడు కసబ్‌ను కూడా చట్టప్రకారమే శిక్షించారని అంబటి గుర్తు చేశారు. ఒకవైపు సాయికృష్ణ ఇంటికి జనసేన నేతలను పంపుతూనే.. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడైన సీఐ నాగరాజును అరెస్ట్ చేయవద్దని వెనక ఉండి ఆందోళనలు చేయించడం పవన్ దుర్మార్గపు రాజకీయాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమలో కాపు నేతల సమావేశంపై పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, గతంలో కులాల గురించి పవన్ మాట్లాడినట్లుగా ఈ రాష్ట్రంలో ఎవరూ మాట్లాడి ఉండరని దుయ్యబట్టారు.

Go Back to Shorts
Ambati Rambabu
Pawan Kalyan
Vijayawada Sai Krishna case
Andhra Pradesh politics
YSRCP vs Janasena
CBI investigation demand

More Telugu News