పెట్రో ధరల తగ్గింపుపై ఆశలు.. ఇప్పుడే కుదరదంటున్న కేంద్రం!
- తగ్గిన పశ్చిమాసియా ఉద్రిక్తతలు
- దీంతో దిగొచ్చిన ముడి చమురు ధరలు
- రిటైల్ ధరలూ తగ్గుతాయని ప్రజల ఆశాభావం
- వెంటనే సాధ్యం కాదన్న సురేశ్ గోపీ
- ముడి చమురు సరఫరాలో ఇంకా ఇబ్బందులు
- అవి సద్దుమణిగాకే ఇంధన ధరల్లో సవరణకు అవకాశం
తక్కువ ధరకు కొనుగోలు చేసిన ముడిచమురు భారత్‌కు చేరేందుకు సమయం పడుతుందని సురేశ్ గోపీ చెప్పారు. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి మార్గంలో నౌకల రద్దీ ఎక్కువగా ఉండటంతో సరఫరా ప్రక్రియ సాధారణ స్థితికి రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల అంతర్జాతీయ ధరలు తగ్గిన వెంటనే దేశీయ ఇంధన ధరలను తగ్గించడం సాధ్యం కాదన్నారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇటీవల గ్లోబల్ ఇంధన మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు చోటుచేసుకున్నాయని మంత్రి తెలిపారు. ముడిచమురు ధరల పెరుగుదల ప్రభావం పూర్తిగా వినియోగదారులపై పడకుండా కేంద్ర ప్రభుత్వం గణనీయమైన భారం భరించిందన్నారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వానికి రూ.12 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పారు.
ఇంధన ధరలు పెరిగిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ పన్నులను తగ్గించి ఆదాయాన్ని వదులుకోలేదని మంత్రి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం, చమురు మార్కెటింగ్ సంస్థలు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే దిశగా దౌత్యపరమైన ప్రయత్నాలు ముందుకు సాగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 78 డాలర్లకు చేరగా డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 75 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. అయితే ఈ తగ్గుదల ప్రభావం దేశీయ ఇంధన ధరలపై కనిపించాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.