తెలంగాణలోని హన్మకొండలో పవన్ కల్యాణ్ పర్యటన

Pawan Kalyan fulfills last wish of ailing fan Niranjan in Hanamkonda
  • తీవ్ర నరాల సమస్యతో బాధపడుతున్న చిన్నారిని కలిసిన పవన్
  • ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను తెలుసుకున్న వైనం
  • హన్మకొండ నుంచి నేరుగా విజయవాడ వెళ్లనున్న పవన్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణలోని హన్మకొండలో పర్యటించారు. స్థానిక హనుమాన్ నగర్‌కు చెందిన 15 ఏళ్ల నిరంజన్ అనే బాలుడు తీవ్రమైన నరాల సమస్యతో బాధపడుతున్నాడు. దురదృష్టవశాత్తూ వయసు 15 ఏళ్లయినా ఆ వ్యాధి కారణంగా కేవలం రెండు, మూడేళ్ల పిల్లాడిలాగే కనిపిస్తాడు, పైగా కాళ్లు కూడా పనిచేయవు. జీవితంతో పోరాడుతున్న ఆ చిన్నారికి తన అభిమాన హీరో పవన్ కల్యాణ్‌ను కలిసి, ఆయన సినిమా డైలాగ్‌ను ఆయన ముందే చెప్పాలనేది ఒకే ఒక్క చివరి కోరిక. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్, నేరుగా ఆ బాలుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. నిరంజన్‌ను ప్రేమగా పలకరించి, వారి తల్లిదండ్రులతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.


ఈ భావోద్వేగ భేటీ ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ హన్మకొండలోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత స్థానిక రిసార్ట్‌లో జనసేన కార్యకర్తలతో (జనసైనికులతో) ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. అక్కడే లంచ్ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం తిరిగి విజయవాడకు ప్రయాణమవుతారు. మరోవైపు, పవన్ కల్యాణ్ ను చూసేందుకు హన్మకొండలో అభిమానులు పోటెత్తారు.

Go Back to Shorts
Pawan Kalyan
Hanamkonda
Janasena Party
Bhadrakali Temple
Telangana Visit
Niranjan Fan

More Telugu News