ఇతడి పని బాగుంది... స్విమ్మింగ్ పూల్ పై రోజుకు రూ.75 వేల ఆదాయం!

Meerut Farmer Earns 75000 Per Day With Swimming Pool On Farm
  • పొలంలో స్విమ్మింగ్ పూల్ నిర్మించి నెలకు రూ.22.5 లక్షలు సంపాదిస్తున్న రైతు!
  • సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్
  • రూ.100 ప్రవేశ రుసుము.. రోజుకు 700-800 మంది సందర్శకులు
  • వాడిన నీటిని రైతులకు అమ్మి అదనపు ఆదాయం పొందుతున్న వైనం
  • వ్యాపార ఆలోచనపై ప్రశంసలతో పాటు లెక్కలపై సందేహాలు
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ రైతు తన వ్యవసాయ క్షేత్రంలో స్విమ్మింగ్ పూల్ నిర్మించి నెలకు రూ.22.5 లక్షలు సంపాదిస్తున్నాడు. మీరట్‌లోని ఎన్‌హెచ్-58 సమీపంలో ఉన్న ఓ రైతు తన పొలంలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశాడు. వేసవి సెలవుల్లో రోజుకు 700 నుంచి 800 మంది సందర్శకులు వస్తుండగా, ఒక్కొక్కరి నుంచి ప్రవేశ రుసుముగా రూ.100 వసూలు చేస్తున్నాడు. దీని ద్వారా రోజుకు సుమారు రూ.75,000, నెలకు రూ.22.5 లక్షల ఆదాయం వస్తోందట. దాంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణ రోజుల్లో రోజుకు 250 మంది వస్తారని, తద్వారా నెలకు రూ.7.5 లక్షలు సమకూరుతుందని సదరు రైతు తెలిపాడు. ఈ మేరకు 'మనీ కంట్రోల్' మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది.

ఈ వ్యాపారంలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పూల్‌లో వాడిన నీటిని ఖాళీ చేశాక, దాన్ని సమీపంలోని ఇతర రైతులకు సాగు అవసరాల కోసం అమ్ముతూ అదనపు ఆదాయం పొందుతున్నాడు. నిర్వహణ ఖర్చులు కూడా తక్కువే, ఇద్దరు సెక్యూరిటీ గార్డులకు నెలకు రూ.20,000 జీతం మాత్రమే ఇస్తున్నాడట.

ఈ వినూత్న వ్యాపార ఆలోచనపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. "ఒకే ఆస్తితో బహుళ మార్గాల్లో డబ్బు సంపాదించడమే నిజమైన వ్యాపార నైపుణ్యం" అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే, మరికొందరు ఈ ఆదాయ లెక్కల వాస్తవికతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక ఫామ్‌లోని స్విమ్మింగ్ పూల్‌కు రోజూ అంతమంది రావడం సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు. పూల్ శుభ్రత, లైఫ్‌గార్డులు, సీసీటీవీ వంటి ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకోలేదని విమర్శిస్తున్నారు.

Go Back to Shorts
Meerut Farmer
Swimming Pool Business
Innovative Farming Ideas
Uttar Pradesh News
Farmer Income Idea
Viral Business Story

More Telugu News