టాటా ఐఫోన్ ప్లాంట్‌పై కాలుష్య నియంత్రణ మండలి కొరడా.. మూసివేస్తామని హెచ్చరిక
- టాటా ఐఫోన్ విడిభాగాల ప్లాంట్‌పై కాలుష్య ఆరోపణలు
- వ్యర్థజలాలతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని ఫిర్యాదు
- ప్లాంట్ మూసివేస్తామని తమిళనాడు పొల్యూషన్ బోర్డు హెచ్చరిక
- ఆరోపణలను ఖండించిన టాటా ఎలక్ట్రానిక్స్
- అన్ని నిబంధనలు పాటిస్తున్నామని స్పష్టం చేసిన సంస్థ
స్థానిక రైతుల నుంచి కొన్ని నెలలుగా వస్తున్న ఫిర్యాదులతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రంగంలోకి దిగారు. డిసెంబర్ 2025 నుంచి మే 2026 మధ్య ఐదుసార్లు ప్లాంట్‌లో తనిఖీలు నిర్వహించారు. ఫ్యాక్టరీలోని వ్యర్థ జలాలను వర్షపు నీటి సంరక్షణ చెరువులోకి వదిలారని, అది పొంగిపొర్లి సమీప వ్యవసాయ భూములు, బావుల్లోని నీటిని కలుషితం చేసిందని మే 25న జారీ చేసిన నోటీసులో మండలి పేర్కొంది. గతంలో ఇచ్చిన ఆదేశాలను కూడా టాటా పాటించలేదని తెలిపింది.
అయితే, ఈ ఆరోపణలను టాటా ఎలక్ట్రానిక్స్ తోసిపుచ్చింది. తమ ప్లాంట్‌లో అన్ని నిబంధనలు పాటిస్తున్నామని, గుర్తింపు పొందిన స్వతంత్ర ల్యాబ్‌లో చేయించిన పరీక్షల్లో ఇది రుజువైందని ఒక ప్రకటనలో తెలిపింది. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, అధికారులకు ఇప్పటికే వివరణ ఇచ్చామని స్పష్టం చేసింది.
చైనాకు ప్రత్యామ్నాయంగా యాపిల్ సంస్థ తమ ఐఫోన్ల తయారీని భారత్‌కు తరలిస్తున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. 2026 నాటికి ప్రపంచ ఐఫోన్లలో 26% భారత్‌లోనే తయారవుతాయని అంచనా. ఈ విషయంపై స్పందించేందుకు యాపిల్, తమిళనాడు ప్రభుత్వ వర్గాలు నిరాకరించాయి.