ప్రేక్షకుల ముందుకు సమంత... 'మా ఇంటి బంగారం' రిలీజ్ ఎప్పుడంటే..!
- సెన్సార్ పూర్తి చేసుకున్న సమంత 'మా ఇంటి బంగారం'
- జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల
- యాక్షన్, ఫ్యామిలీ డ్రామాగా రానున్న చిత్రం
- స్వీయ నిర్మాణంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న సమంత
- ఐపీఎల్ కారణంగా గతంలో వాయిదాపడిన రిలీజ్
బి.వి. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సమంత తన సొంత నిర్మాణ సంస్థ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరులతో కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, ఓం ప్రకాశ్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించారు. సుమారు రెండు గంటల నిడివి కలిగిన ఈ చిత్రంలో సమంత సాహసోపేతమైన యాక్షన్ సన్నివేశాలను స్వయంగా చేసినట్లు తెలుస్తోంది.
సంప్రదాయ కుటుంబానికి చెందిన ఓ నవవధువు గతాన్ని చుట్టుముట్టిన రహస్యాలు, వాటి వల్ల ఆమె కుటుంబానికి ఎదురయ్యే ముప్పును ఆమె ఎలా దీటుగా ఎదుర్కొందనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని మే 15నే విడుదల చేయాలని భావించినప్పటికీ, ఐపీఎల్ 2026 సీజన్ దృష్ట్యా జూన్ 19కి వాయిదా వేశారు.
కొంత విరామం తర్వాత సమంత ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం కావడంతో సినీ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం తమిళంలో 'ఎంగల్ తంగం' పేరుతో ఏకకాలంలో విడుదల కానుంది. ఇక జూన్ 18 నుంచే ఓవర్సీస్ ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.