జంతువులతో మాట్లాడే రోజులు వచ్చేస్తున్నాయి.. సైన్స్ ఫిక్షన్‌ను నిజం చేస్తున్న ఏఐ!

AI May Soon Help Humans Talk to Animals and Decode Communication
  • జంతువుల భాషను డీకోడ్ చేస్తున్న ఏఐ
  • చాట్‌జీపీటీ సాంకేతికతతో శబ్దాల విశ్లేషణ
  • తిమింగలాల శబ్దాలపై జరుగుతున్న పరిశోధనలు.
  • ఎలుకల శబ్దాల్లోని తేడాల గుర్తింపు
  • జంతువులతో మాట్లాడేందుకు శాస్త్రవేత్తల యత్నాలు
మనం తిమింగలంతో మాట్లాడగలిగితే ఎలా ఉంటుంది? పక్షి ఏం చెబుతుందో మనకు అర్థమైతే ఎలా ఉంటుంది? ఇప్పటివరకు కేవలం హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూసిన ఇలాంటి వింతలు.. త్వరలోనే నిజం కాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత సాయంతో జంతువుల, పక్షుల భాషను డీకోడ్ చేయడానికి శాస్త్రవేత్తలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. చాట్‌జీపీటీ వెనుక ఉన్న సాంకేతికతను వాడుతూ మూగజీవాల నోటి నుంచి వచ్చే శబ్దాల వెనుక ఉన్న అసలు అర్థాలను కనిపెడుతున్నారు.

ఇటీవలి కాలంలో ఎలుకలు, డాల్ఫిన్లు, కోతులు, పక్షులు, తిమింగలాలు, కటిల్‌ఫిష్ వంటి జీవులపై జరిగిన పరిశోధనల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జంతువుల సమూహాల్లో ఒకదానికొకటి చేసుకునే విభిన్న శబ్దాలు, వాటి వెనుక ఉన్న ప్రత్యేక అర్థాలను గుర్తించడంలో ఏఐ సిస్టమ్స్ శాస్త్రవేత్తలకు సహాయపడుతున్నాయి. ఉదాహరణకు ఆఫ్రికన్ చారల ఎలుకలపై చేసిన పరిశోధనలో ఏకంగా 1.22 లక్షల కంటే ఎక్కువ శబ్దాలను విశ్లేషించి వాటిలో వేర్వేరు రకాల పిలుపులను ఏఐ గుర్తించింది.

అన్నింటికంటే పెద్ద ప్రాజెక్ట్ తిమింగలాల భాషను అర్థం చేసుకోవడంపైనే నడుస్తోంది. స్పర్మ్ తిమింగలాలు చేసుకునే మిలియన్ల కొద్దీ క్లిక్ శబ్దాలను మెషీన్ లెర్నింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు. ఆ శబ్దాల్లో మనుషుల భాష లాంటి పదాలు, మాండలికాలు, పేర్లు లేదా వ్యాకరణం వంటి నిర్మాణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పరిశోధనలు సాగుతున్నాయి. తిమింగలాల కమ్యూనికేషన్ మనం అనుకునే దానికంటే చాలా క్లిష్టంగా, అద్భుతంగా ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

జంతువుల భాషను కేవలం అర్థం చేసుకోవడమే కాకుండా.. వాటితో మనుషులు తిరిగి మాట్లాడేలా చేయడంపై కూడా శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. ‘ఎర్త్ స్పిషీస్ ప్రాజెక్ట్’, ‘ప్రాజెక్ట్ సీఈటీఐ’ వంటి సంస్థలు జంతువుల శబ్దాల్లో దాగి ఉన్న నమూనాలను వెతుకుతున్నాయి. భవిష్యత్తులో మనుషులు, జంతువులకు మధ్య అర్థవంతమైన సంభాషణలు సాధ్యమేనా అనే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. జంతువుల భాష అర్థమైతే వచ్చే చట్టపరమైన, నైతికపరమైన పరిణామాలను కూడా అధ్యయనం చేస్తున్నారు.

అయితే జంతువుల కమ్యూనికేషన్‌ను డీకోడ్ చేయడం అంటే.. మనుషుల భాషను అనువదించినంత సులువు కాదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఏఐ శబ్దాలను గుర్తించినప్పటికీ.. జంతువులు ఈ ప్రపంచాన్ని చూసే విధానం మనుషుల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కాబట్టి వాటితో పూర్తిస్థాయిలో మాట్లాడటం అనేది పెద్ద సవాల్‌తో కూడుకున్న పని. అయినప్పటికీ ఇతర జీవులు ఏం మాట్లాడుకుంటున్నాయో తెలుసుకోవడానికి, వాటికి తిరిగి సమాధానం ఇచ్చే రోజులకు ఏఐ మనల్ని చాలా దగ్గరగా తీసుకెళుతోంది.
Go Back to Shorts
Animal communication
Decode whale language
Earth Species Project
Machine learning
ChatGPT
Interspecies communication
Artificial intelligence

More Telugu News