మనీ లాండరింగ్ కేసు.. రాబర్ట్ వాద్రాకు బెయిల్

Robert Vadra Granted Bail in Money Laundering Case
  • 3.53 ఎకరాల ల్యాండ్ డీల్ కేసు
  • రూ. 58 కోట్ల మేర అక్రమ సొమ్ము ఆర్చించారన్న ఈడీ
  • షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన రౌస్ అవెన్యూ కోర్టు

హర్యానాలోని గురుగ్రామ్ భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పెద్ద ఉపశమనం లభించింది. ఈరోజు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ఆయనకు ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.


కేసు వివరాల్లోకి వెళితే... ఇది 3.53 ఎకరాల ల్యాండ్ డీల్ కేసు. 2008లో హర్యానాలోని శిఖోపూర్ గ్రామంలో జరిగిన భూ లావాదేవీల చుట్టూ ఈ కేసు నడుస్తోంది. రాబర్ట్ వాద్రాకు చెందిన 'స్కై లైట్ హాస్పిటాలిటీ' సంస్థ, ఒంకార్వేగర్ ప్రాపర్టీస్ నుండి ఈ భూమిని కొనుగోలు చేసింది. ఈ డీల్ సమయంలో తప్పుడు పత్రాలు సమర్పించారని, ఎలాంటి నగదు చెల్లించకుండా (నగదుగా మారని చెక్కు ద్వారా) లావాదేవీలు జరిపారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. అప్పటి రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి ఈ భూమికి కమర్షియల్ లైసెన్స్ సంపాదించి, ఆ తర్వాత దానిని 'డీఎల్ఎఫ్' సంస్థకు భారీ లాభానికి విక్రయించారని ఈడీ పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారం ద్వారా పిఎంఎల్‌ఏ (PMLA) చట్టం ప్రకారం రూ. 58 కోట్ల మేర అక్రమ సొమ్ము ఆర్జించారని ఈడీ చార్జ్‌షీట్‌లో స్పష్టం చేసింది.


ఈ కేసు చార్జ్‌షీట్‌ను పరిశీలించిన ప్రత్యేక కోర్టు రాబర్ట్ వాద్రాకు సమన్లు జారీ చేస్తూ మే 16న హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం శనివారం హాజరైన వాద్రాకు రూ. 50,000 వ్యక్తిగత పూచీకత్తు, అంతే మొత్తానికి సమానమైన ఒక షూరిటీ సమర్పించాలనే షరతుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.


బెయిల్ లభించిన అనంతరం రాబర్ట్ వాద్రా మీడియాతో మాట్లాడుతూ.. దేశ న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అయితే దర్యాప్తు సంస్థ అయిన ఈడీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా నడుచుకుంటోందని, తనను ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం చెప్పినట్లు ఈడీ నడుచుకుంటోందని ఆరోపించారు. తన వద్ద దాచడానికి ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.
Go Back to Shorts
Robert Vadra
Vadra bail
money laundering case
Gurugram land scam
Priyanka Gandhi
DLF
Enforcement Directorate ED
Haryana land deal

More Telugu News