కునో నేషనల్ పార్క్‌లో విషాదం.. నాలుగు చీతా కూనల మృతి

Kuno National Park Four Cheetah Cubs Die in Tragedy
  • వేరే జంతువు దాడి చేయడం వల్లే మృతి చెందినట్లు అనుమానం
  • నెల రోజుల క్రితం జన్మించిన కూనలు
  • తల్లి చీతా క్షేమంగానే ఉందని తెలిపిన అధికారులు
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విషాదం చోటుచేసుకుంది. నెల రోజుల వయసున్న నాలుగు చీతా కూనలు మంగళవారం ఉదయం మృతి చెందాయి. వేరే జంతువు దాడి చేయడం వల్లే ఇవి చనిపోయి ఉంటాయని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

షియోపూర్ జిల్లాలోని కునో పార్కులో మానిటరింగ్ బృందం ఈ విషయాన్ని గుర్తించింది. KGP12 అనే ఆడ చీతా ఏప్రిల్ 11న ఈ నాలుగు కూనలకు జన్మనిచ్చింది. మే 11వ తేదీ సాయంత్రం వరకు ఇవి ఆరోగ్యంగానే కనిపించాయని అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో వీటి డెన్ సమీపంలో కళేబరాలను గుర్తించామని, అవి పాక్షికంగా తినివేసి ఉన్నాయని వివరించారు.

తల్లి చీతా మాత్రం క్షేమంగా, ఆరోగ్యంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. పోస్ట్‌మార్టం నివేదిక, పూర్తి స్థాయి విచారణ తర్వాత మరణానికి కచ్చితమైన కారణాలు తెలుస్తాయని వారు పేర్కొన్నారు.

ఈ నాలుగు కూనల మరణంతో భారత్‌లో చీతాల సంఖ్య 53కి తగ్గింది. ప్రస్తుతం కునో పార్క్‌లో 50 చీతాలు (వీటిలో 33 భారత్‌లో పుట్టినవి), గాంధీ సాగర్ అభయారణ్యంలో మూడు చీతాలు ఉన్నాయి. మిగిలిన చీతాలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. కాగా, 2022లో నమీబియా నుంచి 8, 2023లో దక్షిణాఫ్రికా నుంచి 12, ఈ ఏడాది ఫిబ్రవరిలో బోట్స్వానా నుంచి 9 చీతాలను భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Kuno National Park
Cheetah Cubs
Madhya Pradesh
Cheetah Deaths
Wildlife Conservation
Animal Attack
India Cheetah Project
Namibia
South Africa
Botswana

More Telugu News