యూఎస్-ఇరాన్ సంక్షోభం.. భారీ మూల్యం చెల్లిస్తున్న పాకిస్థాన్!

US Iran war strikes structural blow to Pakistans economy
  • అమెరికా-ఇరాన్ ఘర్షణతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
  • వీక్లీ చమురు దిగుమతి బిల్లు 300 నుంచి 800 మిలియన్ డాలర్లకు పెరుగుదల
  • వార్షిక చమురు భారం దాదాపు దేశ ఎగుమతుల ఆదాయానికి సమానం
  • 85-90 శాతం చమురు దిగుమతులపై ఆధారపడటమే ప్రధాన బలహీనత
  • తీవ్ర ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వల సంక్షోభంలో కూరుకుపోయిన పాక్
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు పొరుగు దేశమైన పాకిస్థాన్‌ను ఆర్థికంగా కుదిపేస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర ద్రవ్యోల్బణం, క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వలు, పడిపోతున్న కరెన్సీ విలువతో సతమతమవుతున్న పాక్ ఆర్థిక వ్యవస్థకు ఈ చమురు ధరల షాక్ పెను భారంగా మారింది. ఇది కేవలం తాత్కాలిక సమస్య కాదని, పాక్ ఆర్థిక వ్యవస్థకు తగిలిన నిర్మాణాత్మక దెబ్బ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇండియా నేరేటివ్ తన కథనంలో విశ్లేషించిన ప్రకారం, అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం కారణంగా ఈ ప్రాంతంలో అత్యంత నష్టపోతున్న దేశం పాకిస్థాన్. హ‌ర్మూజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయంగా బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 112 డాలర్లకు పైగా చేరింది. దీంతో రవాణా, బీమా ప్రీమియంలు రికార్డు స్థాయికి పెరిగాయి. ఫలితంగా పాకిస్థాన్ వీక్లీ పెట్రోలియం దిగుమతి బిల్లు 300 మిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 800 మిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే, 167 శాతం పెరుగుదల నమోదైంది. ఈ విషయాన్ని ఈ ఏడాది ఏప్రిల్ లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ధృవీకరించారు.

ఈ లెక్కన పాకిస్థాన్‌పై ఏటా అదనంగా 26 బిలియన్ డాలర్ల భారం పడుతోంది. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో పాకిస్థాన్ మొత్తం ఎగుమతుల ద్వారా సంపాదించిన 29.8 బిలియన్ డాలర్లతో దాదాపు సమానం. అంటే, దేశం మొత్తం ఎగుమతుల ద్వారా సంపాదించిన ఆదాయాన్ని కేవలం ఒక్క చమురు దిగుమతులకే చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులనే కదిలించే అంశమని సదరు కథనం పేర్కొంది.

పాకిస్థాన్ తన పెట్రోలియం అవసరాల్లో 85 నుంచి 90 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతుంది. ప్రధానంగా గల్ఫ్ దేశాల నుంచి హర్మూజ్ జలసంధి మార్గం ద్వారానే ఈ దిగుమతులు జరుగుతాయి. పాక్‌కు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలు లేకపోవడం, వ్యూహాత్మక చమురు నిల్వలు లేకపోవడం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు, ఆ ప్రభావం పాకిస్థాన్‌లో నేరుగా ఇంధన ధరలు, రవాణా ఛార్జీలు, విద్యుత్ టారిఫ్‌లు, నిత్యావసర వస్తువుల ధరలపై పడుతుంది. ఐఎంఎఫ్ అంచనా ప్రకారం, చమురు ధరలు 10 శాతం పెరిగితే పాక్‌లో ద్రవ్యోల్బణం 0.4 నుంచి 0.6 శాతం పెరుగుతుంది. ఇది దక్షిణాసియాలోనే అత్యధికం కావడం గమనార్హం.
Go Back to Shorts
Pakistan Economy
Shehbaz Sharif
US Iran Crisis
Pakistan Economic Crisis
Oil Imports
Inflation Pakistan
Hormuz Strait
Brent Crude Oil
Pakistan Exports

More Telugu News