ఏయూ వందేళ్ల వేడుకలు... వేదికపై నుంచి చంద్రబాబుకు నారా లోకేశ్ విజ్ఞప్తి

Nara Lokesh speech in Andhra University Centenary Celebrations
  • ఏయూ పరిశోధనల కోసం రూ.250 కోట్లు కేటాయించాలని సీఎంను కోరిన లోకేశ్
  • మంగళగిరి ఓటమి తర్వాత కసితో పనిచేసి గెలిచానని వ్యాఖ్య
  • ఆంధ్రా యూనివర్సిటీ దేశానికే తలమానికం అని ప్రశంస
  • వర్సిటీలు కాలానుగుణంగా కరిక్యులమ్ మార్చుకోవాలని సూచన
  • రేపు గూగుల్‌కు శంకుస్థాపన చేయబోతున్నట్లు వెల్లడి
ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) పరిశోధనల అభివృద్ధికి రూ.250 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆంధ్రా యూనివర్సిటీ శత వసంతాల వేడుకల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "అడగందే అమ్మయినా అన్నం పెట్టదు అంటారు. అందుకే ఈ సభా వేదిక నుంచి సీఎం గారిని కోరుతున్నా. ఏయూలో పరిశోధన రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు రూ.250 కోట్లు కేటాయించాలి" అని కోరారు. ప్రధాని మోదీ చెప్పినట్లుగా రీసెర్చ్ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని లోకేశ్ అభిప్రాయపడ్డారు.

ఓటమి నుంచి గెలుపు వరకు.. 
ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను లోకేశ్ విద్యార్థులతో పంచుకున్నారు. "నేను 'నో రిస్క్ నో స్టోరీ' అనే సిద్ధాంతాన్ని నమ్ముతాను. 2019లో తొలిసారి మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఎంతో వేదనకు గురయ్యాను. కానీ ఆ ఓటమి తర్వాత మరింత కసితో పనిచేశాను. దాని ఫలితంగానే 2024 ఎన్నికల్లో 91 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందాను. ఈ వేదికపై ఉన్న మహోన్నత వ్యక్తుల జీవితాల్లో కూడా ఎన్నో త్యాగాలు, కృషి ఉన్నాయి. అందుకే వారు ఈ స్థాయిలో ఉన్నారు" అని వివరించారు.

ఏయూ దేశానికే తలమానికం.. 
ఆంధ్రా యూనివర్సిటీ చరిత్రను, ప్రాముఖ్యతను లోకేశ్ కొనియాడారు. "ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడిన తర్వాత మనం మాట్లాడడం చాలా కష్టం. దేశంలోని ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో ఏయూ ఒకటి. దీని స్థాపన వెనుక ఎంతోమంది మహానుభావుల త్యాగం, కృషి ఉన్నాయి. ఫిజిక్స్ నుంచి పాలిటిక్స్ వరకు ప్రతి రంగంలోనూ ఏయూ తనదైన ముద్ర వేసింది. ఇక్కడి పూర్వ విద్యార్థులు ఎందరో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వెంకయ్యనాయుడు వంటి అనేకమంది రాజకీయ ప్రముఖులు ఇక్కడే చదివారు. మన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కూడా ఈ వర్సిటీ విద్యార్థే. ఈ వర్సిటీలో చదవనందుకు నేను ఎంతో బాధపడుతున్నాను" అని అన్నారు.

అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు 
రాష్ట్ర విభజన తర్వాత తొలి క్యాబినెట్ సమావేశం ఏయూలోనే జరిగిందని లోకేశ్ గుర్తు చేశారు. వర్సిటీలకు విజన్ ఉన్న వీసీలు ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. వర్సిటీలు కాలానుగుణంగా తమ కరిక్యులమ్‌ను మార్చుకోవాలని, భవిష్యత్తులో ఏయూ విద్యార్థులు రాజకీయాల్లోకి కూడా రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడుల గురించి మాట్లాడుతూ.. "రేపు గూగుల్‌కు శంకుస్థాపన చేయబోతున్నాం" అని వెల్లడించారు. వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం అనేది ఒక వర్సిటీ చరిత్రలో అరుదైన ఘట్టమని, ఏయూ రాష్ట్రానికే కాక దేశానికే తలమానికం అని ప్రశంసించారు.

ఏడాదిలోగా పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాం
అతి చిన్న వయసులో విద్యాశాఖ మంత్రిగా నన్ను సీఎం చంద్రబాబు గారు నియమించారు. నేను విద్యాశాఖ తీసుకుంటానంటే కష్టమని, వద్దని చాలామంది వారించారు. దేశ చరిత్ర తిరిగి రాయాలంటే మా పిల్లలే రాయాలని నేను ఛాలెంజ్ ను స్వీకరించడం జరిగింది. ఇంకా మార్పులు తీసుకురావాలి. నిధులు కేటాయించాలి. మౌలిక వసతులే కాదు.. శాశ్వత సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉంది. పెండింగ్ పోస్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సీఎం గారు చెప్పారు. వచ్చే ఏడాదిలోగా పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాం... అని నారా లోకేశ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 


Go Back to Shorts
Nara Lokesh
Andhra University Centenary Celebrations
Vizag
TDP
Andhra Pradesh

More Telugu News