పహల్గామ్ నెత్తుటి జ్ఞాపకం.. ఏడాది తర్వాత కూడా వీడని విషాదం.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్

PM Modi Remembers Victims a Year after Pahalgam Attack
  • పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది పూర్తి
  • 'ఎక్స్' వేదికగా అమరులను స్మరించుకున్న ప్రధాని మోదీ
  • ఉగ్రవాదానికి భారత్ ఎన్నటికీ తలొగ్గదని స్పష్టీకరణ
  • ఈ దాడికి ప్రతీకారంగా భార‌త‌ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన అత్యంత హేయమైన ఉగ్రదాడికి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. 2025 ఏప్రిల్ 22న జరిగిన ఈ దుర్ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకరమైన రోజుపై ప్రధాని మోదీ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదికగా భావోద్వేగంగా స్పందించారు. దాడిలో మరణించిన వారిని స్మరించుకుంటూ, వారి కుటుంబాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఉగ్రవాదంపై భారత్ తన పోరాటంలో ఎప్పటికీ వెనకడుగు వేయదన్నారు.

"గతేడాది ఇదే రోజున జరిగిన దారుణమైన పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులను స్మరించుకుంటున్నా. వారిని ఎన్నటికీ మరచిపోలేము. ఈ నష్టం నుంచి కోలుకుంటున్న మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఒక దేశంగా మనం దుఃఖంలోనూ, సంకల్పంలోనూ ఐక్యంగా నిలబడ్డాం. భారతదేశం ఏ రూపంలోనూ ఉగ్రవాదానికి తలొగ్గదు. ఉగ్రవాదుల హేయమైన కుట్రలు ఎన్నటికీ సఫలం కావు" అంటూ ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.

ఏడాది క్రితం ఏం జరిగింది?
గతేడాది ఏప్రిల్ 22న దక్షిణ కాశ్మీర్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన పహల్గామ్‌లోని బైసన్ పచ్చిక బయళ్లలో ఈ దారుణం చోటుచేసుకుంది. పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక స్థానికుడితో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 25 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా తీవ్ర సంచలనం సృష్టించింది.

ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం కఠిన చర్యలు చేపట్టింది. దాడి జరిగిన కొన్ని రోజులకే, మే 7న 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్ భూభాగంలో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో వందకు పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టి పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక పంపింది. అంతేకాగాక పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు పారిపోకముందే వారిని మట్టుబెట్టేందుకు 'ఆపరేషన్ మహదేవ్' చేపట్టింది. ఈ రెండు ఆపరేషన్ల ద్వారా ఉగ్రవాద చర్యలను సహించేది లేదని భారత్ ప్రపంచానికి స్పష్టమైన సంకేతం ఇచ్చింది.
Go Back to Shorts
PM Modi
Pahalgam Attack
Pahalgam Terror Attack

More Telugu News