హరీశ్ రావు రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉంది: తుమ్మల నాగేశ్వరరావు

Harish Raos Future in Darkness Says Tummala Nageswara Rao
  • హరీశ్ రావు మానసిక వేదనతో బాధపడుతున్నారన్న తుమ్మల
  • జరుగుతున్న అవమానాలవల్లే ఆయన స్థితి ఇలా తయారైందని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా అహంకారం తగ్గలేదని విమర్శ

బీఆర్ఎస్ అగ్రనేత హరీశ్ రావుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు వ్యవస్థలను దోచుకుని రాష్ట్రాన్ని రావణకాష్ఠంగా మార్చారని ఆరోపించారు. హరీశ్ రావు రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉందని, అందుకే ఏం చేయాలో దిక్కుతోచక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. "హరీశ్ రావు ప్రస్తుతం మానసిక వేదనతో బాధపడుతున్నారు. గతంలో ఆయనకు జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న అవమానాల వల్లే ఆయన స్థితి ఇలా తయారైంది" అంటూ తుమ్మల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎక్కడికి వెళ్లినా ఒకే ఆవు కథ, ఒకే రికార్డింగ్ క్యాసెట్ వినిపించడం హరీశ్ రావుకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.


సీతారామ సాగర్ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే హక్కు లేదని తుమ్మల అన్నారు. ఈ ప్రాజెక్టు తన రాజకీయ ఆకాంక్ష అని, దీనిని పూర్తి చేయడమే తన జీవిత లక్ష్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కేంద్ర అనుమతులు లేకుండా రూ. 8 వేల కోట్లు ఖర్చు చేసిందని, కేవలం కమీషన్ల కోసమే లోపభూయిష్టమైన డిజైన్లతో పనులు చేపట్టారని ఆరోపించారు. హెడ్ వర్క్స్ లిఫ్ట్ కూడా పూర్తి చేయలేని స్థితిలో బీఆర్ఎస్ పాలన సాగిందని మండిపడ్డారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో వంద కోట్లు వెచ్చించి గోదావరి జలాలను వైరా రిజర్వాయర్‌కు తరలించామని, సత్తుపల్లి టన్నెల్ కోసం మరో రూ. 1,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి వివరించారు. ప్రజలు బుద్ధి చెప్పి అధికారం నుంచి దూరం చేసినా బీఆర్ఎస్ నేతలకు ఇంకా అహంకారం తగ్గలేదని తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Go Back to Shorts
Tummala Nageswara Rao
Harish Rao
BRS
Telangana Politics
Revanth Reddy
Seetharama Sagar Project
Telangana
వైరా రిజర్వాయర్‌
Sattupalli Tunnel

More Telugu News