మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వండి: ఏపీలోని అన్ని పార్టీలకు సీఎం చంద్రబాబు లేఖ

Chandrababu Naidu Urges Support for Womens Reservation Bill in AP
  • మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ సీఎం చంద్రబాబు లేఖ
  • రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ఎంపీలకు కీలక విజ్ఞప్తి
  • 2029 ఎన్నికల నుంచే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పిలుపు
  • ఇది పార్టీలకు అతీతమైన, దేశ గౌరవానికి సంబంధించిన విషయమని వెల్లడి
  • ప్రధాని మోదీ సంకల్పాన్ని సమష్టిగా బలపరుద్దామని చంద్రబాబు విజ్ఞప్తి
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 'నారీ శక్తి వందన్ అధినియం'పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ముందడుగు వేశారు. ఈ చారిత్రక బిల్లుకు సంపూర్ణ మద్దతు కూడగట్టే లక్ష్యంతో ఆయన రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు మంగళవారం లేఖ రాశారు. రాబోయే 2029 ఎన్నికల నుంచే ఈ రిజర్వేషన్లు అమల్లోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షను అందరూ కలిసికట్టుగా బలపరచాలని తన లేఖలో చంద్రబాబు గట్టిగా విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 16న పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచిపోతుందని చంద్రబాబు తన లేఖలో అభిప్రాయపడ్డారు. "మహిళా రిజర్వేషన్ బిల్లుపై విస్తృతంగా చర్చలు జరిగాయి. త్వరితగతిన ఈ చారిత్రక చట్టం అమల్లోకి రావాలన్న ఏకాభిప్రాయం కూడా నాడు వ్యక్తమైంది. ఇందులో భాగంగా 2029లో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు కావాలన్న ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆకాంక్షకు మనందరం మద్దతు పలుకుదాం" అని ఆయన కోరారు.

ఈ అంశం రాజకీయాలకు అతీతమైనదని, దేశ గౌరవానికి సంబంధించిన విషయమని చంద్రబాబు స్పష్టం చేశారు. "మహిళా రిజర్వేషన్ పై అంతా ఒకే స్వరం వినిపించాలని ఆడబిడ్డల తరుపున బాధ్యతతో ఈ లేఖ రాస్తున్నాను. మన ఇంటి ఆడబిడ్డలను, మన దేశ మహిళలను గౌరవించుకునే ఈ అవకాశాన్ని మనందరం అదృష్టంగా భావిద్దాం. ఈ పవిత్ర ఘట్టంలో భాగస్వామి అయ్యే సందర్భాన్ని ఎవరూ వదులుకోవద్దు" అని ఆయన హితవు పలికారు. ప్రతీ పార్టీ, ప్రతీ ఎంపీ ఈ చారిత్రాత్మక నిర్ణయంలో తమదైన ముద్ర వేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు.

ప్రభుత్వంలో, పరిపాలనలో, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 'నారీ శక్తి వందన్ అధినియమ్' కేవలం మహిళా సాధికారతకే కాకుండా, యావత్ దేశ ఉన్నతికి దోహదపడుతుందని పేర్కొన్నారు. భరతమాతను పూజించే మన దేశంలో, నారీ శక్తికి వందనం పలికే ఈ గొప్ప క్షణాలకు 140 కోట్ల మంది భారతీయులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని చేకూర్చడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని సమష్టిగా బలపరచాలని చంద్రబాబు తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
Chandrababu Naidu
AP CM
Mahila Reservation Bill
Nari Shakti Vandan Adhiniyam
Women Reservation Bill
Andhra Pradesh Politics
2029 Elections
Narendra Modi
Political Parties
Women Empowerment

More Telugu News