Telangana Liquor Prices: యుద్ధం ఎఫెక్ట్.. తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు

Telangana to Hike Liquor Prices in May Due to War
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలోని మద్యం ప్రియులకు త్వరలో ధరల షాక్ తగలనుంది. మే నెల నుంచి మద్యం, బీర్ల ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రంలో మద్యం ధరల సమీక్ష గడువు ముగియడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

పశ్చిమాసియాలో యుద్ధం వల్ల సహజవాయువు సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో గాజు సీసాల తయారీ ఖర్చు విపరీతంగా పెరిగింది. ఫలితంగా దేశంలో గాజు సీసాల ఉత్పత్తి 40 శాతం వరకు పడిపోగా, ఖాళీ సీసాల ధరలు 20 శాతం పెరిగాయి. ఈ అదనపు భారాన్ని భరించలేమని, ధరలను 12-15 శాతం పెంచాలని డిస్టిలరీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులను కలిసి ఈ మేరకు వినతిపత్రం కూడా సమర్పించాయి.

తయారీదారుల విజ్ఞప్తితో ప్రభుత్వం కూడా ధరల పెంపుపై సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఓ జ్యుడీషియల్ కమిటీని నియమించింది. ఈ కమిటీ బాటిల్ సైజ్, బ్రాండ్ రేంజ్, ట్యాక్స్ వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ధరల పెంపుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

ముఖ్యంగా బీర్ల ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. గత ఏడాదే 15 శాతం ధరలు పెరిగినప్పటికీ, ప్రస్తుతం సీసాల కొరత, అల్యూమినియం క్యాన్ల ధరలు పెరగడంతో కంపెనీలు మరోసారి పెంపును కోరుతున్నాయి. వేసవిలో బీర్లకు డిమాండ్ 30 శాతం పెరుగుతుండగా, సరఫరా 20 శాతం తగ్గడంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కొరత మొదలైంది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా మే నెలలో ప్రభుత్వం కొత్త ధరలను ప్రకటించే అవకాశం ఉంది. సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే బ్లాక్ మార్కెట్ పెరిగే ప్రమాదం ఉందని ఎక్సైజ్ శాఖ ఆందోళన చెందుతోంది. మొత్తంగా, ఎక్కడో జరుగుతున్న యుద్ధం.. రాష్ట్రంలోని మందుబాబుల జేబులకు చిల్లు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
Go Back to Shorts
Telangana Liquor Prices
Telangana
Liquor Prices
Beer Prices
Excise Department
War Impact
Glass Bottle Cost
Alcohol Price Hike

More Telugu News