Donald Trump: ఇరాన్ నాయకత్వాన్ని తుడిచిపెట్టేశాం.. సుప్రీం లీడర్ కూడా లేరు: ట్రంప్

Trump Claims Irans Supreme Leader is Dead Leadership Destroyed
షార్ట్స్‌లో చూడండి
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఆ దేశ నాయకత్వంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖ‌మేనీ మరణించి ఉండొచ్చని, ప్రస్తుతం ఆ దేశంలో పనిచేసే నాయకత్వమే లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. అమెరికా సైనిక దాడుల ప్రభావంతో ఇరాన్ ఉన్నత స్థాయి కమాండ్ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని, ఇది ఆ దేశ నాయకత్వంపై తీవ్ర అనిశ్చితిని సృష్టించిందని ట్రంప్ అన్నారు.

మయామిలో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్ ప్రయారిటీ సమ్మిట్‌లో ప్రసంగించిన ట్రంప్, ఇరాన్‌పై యుద్ధం, అమెరికా సైనిక చర్యల ప్రభావం గురించి విశ్లేషించారు. ఈ సందర్భంగా ఇరాన్ నాయకత్వం, సైనిక శక్తిని పూర్తిగా నాశనం చేశామని ఆయన వ్యాఖ్యానించారు. "వారి నాయకులంతా చనిపోయారు... వారి సుప్రీం లీడర్ ఇక సుప్రీం కాదు. ఆయన చనిపోయారు" అని ట్రంప్ తెలిపారు.

అమెరికా ఆపరేషన్లతో ఇరాన్ సైనిక సామర్థ్యాలను ఊహించిన దానికంటే ఎక్కువగా నిర్వీర్యం చేశామని ట్రంప్ అన్నారు. ఇరాన్ సైనిక శక్తిపై ఆయన మాట్లాడుతూ.. "ఇరాన్ నౌకాదళం ఇప్పుడు లేదు. అదంతా గల్ఫ్ సముద్రంలో మునిగిపోయింది. వారి వైమానిక దళం పూర్తిగా, సంపూర్ణంగా మరణించింది. వారి విమాన విధ్వంసక, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమైపోయాయి" అని వివరించారు.

అంతేగాక‌ ఇరాన్ ఆయుధ సంపత్తిని కూడా లక్ష్యంగా చేసుకున్నామని ట్రంప్ తెలిపారు. "ఎవరూ ఊహించని స్థాయిలో ఇరాన్ ఆయుధ నిల్వలను మేము ధ్వంసం చేస్తున్నాం. వారి క్షిపణులు, డ్రోన్ ఫ్యాక్టరీలను నాశనం చేస్తున్నాం. వారి రక్షణ పారిశ్రామిక స్థావరాన్ని ఏమీ లేకుండా చేస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలతో ఇరాన్ ప్రస్తుత పరిస్థితిపై అంతర్జాతీయంగా తీవ్ర చర్చ మొదలైంది.
Go Back to Shorts
Donald Trump
Iran
Iran supreme leader
Ayatollah Mojtaba Khamenei
US military
Iran military
Middle East
US foreign policy
Iran weapons
Future Investment Initiative Priority Summit

More Telugu News