Kavach: రైలు ప్రమాదాలకు 'కవచ్' అడ్డుకట్ట... కీలక మార్గంలో సేవలు ప్రారంభం

Kavach Train Protection System Launched on Key Route
షార్ట్స్‌లో చూడండి
రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, వేగవంతంగా మార్చే దిశగా భారతీయ రైల్వే కీలక ముందడుగు వేసింది. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ-హౌరా కారిడార్‌లోని ప్రయాగ్‌రాజ్-కాన్పూర్ సెక్షన్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'కవచ్' ఆటోమేటిక్ రైలు భద్రతా వ్యవస్థను సోమవారం విజయవంతంగా ప్రారంభించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ మధ్య సుమారు 190 కిలోమీటర్ల మార్గంలో ఈ వ్యవస్థను యాక్టివేట్ చేశారు. రైలు నంబర్ 14163 ద్వారా ఈ వ్యవస్థను అమలులోకి తీసుకురాగా, జనరల్ మేనేజర్ స్వయంగా సుబేదార్‌గంజ్ నుంచి మనౌరీ స్టేషన్ వరకు ఫుట్‌ప్లేట్ తనిఖీ నిర్వహించి పనితీరును సమీక్షించారు. డివిజనల్, హెడ్ క్వార్టర్స్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 'కవచ్' వ్యవస్థ, మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను నివారించడానికి రూపొందించబడింది. లోకో పైలట్ పొరపాటున రెడ్ సిగ్నల్ దాటినా, ఈ వ్యవస్థ ఆటోమేటిక్‌గా బ్రేకులు వేసి రైలును నిలిపివేస్తుంది. రైలు వేగాన్ని, సిగ్నళ్లను నిరంతరం పర్యవేక్షిస్తూ భద్రతను నిర్ధారిస్తుంది. ఈ వ్యవస్థతో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపడం సాధ్యమవుతుంది.

తొలి దశలో చౌరీ చౌరా ఎక్స్‌ప్రెస్‌తో సహా 8 జతల రైళ్లకు ఈ సేవలను అందిస్తారు. రాబోయే నెలల్లో వందే భారత్ సర్వీసులతో పాటు మరిన్ని రైళ్లకు దీన్ని విస్తరించనున్నారు. ఈ వ్యవస్థను ప్రారంభించడానికి ముందు, రైల్వే శాఖ విస్తృతమైన ట్రయల్స్ నిర్వహించింది. వ్యాప్-7 ఇంజిన్లు, ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు, 20 కోచ్‌ల వందే భారత్ రైలుతో ట్రయల్స్ జరిపి, విశ్వసనీయతను నిర్ధారించుకున్నారు. 20,000 కిలోమీటర్లకు పైగా ప్యాసింజర్ ట్రయల్స్ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా విజయవంతంగా పూర్తిచేశారు.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా కారిడార్‌లలోని కీలక సెక్షన్లతో కలిపి 1,450 కిలోమీటర్ల మార్గంలో 'కవచ్' వెర్షన్ 4.0ను ఏర్పాటు చేశారు. 'మిషన్ రఫ్తార్'లో భాగంగా తదుపరి దశలో ఘజియాబాద్-తుండ్లా సెక్షన్‌లో ఈ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Kavach
Indian Railways
Train Protection System
Delhi Howrah Corridor
Prayagraj Kanpur
Automatic Train Control
Train Accidents Prevention
Make in India
Vande Bharat
Mission Raftar

More Telugu News