Sajjanar: క్యూనెట్ కేసులో 32 మంది అరెస్టు.. ఎక్కువమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే: సజ్జనార్

Sajjanar Reveals 32 Arrests in QNet Case Mostly Software Employees
షార్ట్స్‌లో చూడండి
క్యూనెట్ సంస్థ మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట కోట్లాది రూపాయల మోసానికి పాల్పడింది. ఈ కేసులో సీసీఎస్ పోలీసులు 32 మంది నిందితులను అరెస్టు చేశారు. క్యూనెట్ కేసుకు సంబంధించి హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ, మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట క్యూనెట్ మోసం చేస్తోందని, మూడు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించామని ఆయన తెలిపారు. అరెస్టైన 32 మందిలో 11 మంది మహిళలు ఉన్నట్లు వెల్లడించారు.

అరెస్టై నిందితుల నుంచి భారీగా ఒప్పంద పత్రాలు, లాప్‌టాప్‌లు, వస్తువులు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ముప్పై బృందాలుగా విడిపోయి ఆపరేషన్ నిర్వహించినట్లు వెల్లడించారు. క్యూనెట్ నిర్వాహకులు 1998 నుంచి వివిధ రకాల పేర్లతో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ నగరంలో 22 మంది బాధితులు తెలిపిన వివరాల మేరకు కేసులు నమోదు చేశామని అన్నారు.

క్యూనెట్ కీలక ఆధారాల కోసం 30 టీమ్‌లతో ఈ కేసును ఛేదించినట్లు తెలిపారు. సిద్దిపేటకు చెందిన హరికృష్ణ రూ.5 లక్షల మేర మోసపోయారని, ఆయన ఫిర్యాదుతో ఈ సంస్థ కార్యకలాపాలపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. వెల్‌నెస్ ప్రొడక్ట్స్, బిస్కట్లు, హెల్త్ ఫుడ్స్ పేరిట ప్రజల్లోకి వెళుతూ మోసం చేస్తున్నట్లు గుర్తించామని అన్నారు. ఇష్టపూర్వకంగానే సంస్థలో చేరుతున్నట్లు ముందుగానే బాండ్‌పేపర్‌పై రాయించుకుని క్యూనెట్‌లోకి తీసుకుంటున్నారని తెలిపారు.

అరెస్టైన వారిలో ఎక్కువమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు నమోదైన 4 కేసుల్లో 11 మంది బాధితులకు దాదాపు రూ.75 లక్షల నష్టం జరిగినట్లు గుర్తించామని అన్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఇలాంటి పథకాల్లో చేరడం, చేర్పించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఇంకా బాధితులు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నెల రోజులుగా క్యూనెట్ సంస్థపై దర్యాప్తు చేసి, పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించి నిందితులను అరెస్టు చేసినట్లు సజ్జనార్ వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.
Go Back to Shorts
Sajjanar
QNet
QNet scam
Multi-level marketing
Hyderabad CCS
Cyberabad police
Software employees

More Telugu News