Qatar Military Helicopter: ఖతార్‌లో కూలిపోయిన సైనిక హెలికాప్టర్... ఆరుగురి మృతి

Qatar Military Helicopter Crashes Killing Six
షార్ట్స్‌లో చూడండి
ఖతార్‌లో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశానికి చెందిన ఒక సైనిక హెలికాప్టర్ సముద్ర జలాల్లో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు సిబ్బంది మరణించగా, మరొకరు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి కోసం అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడమే ప్రమాదానికి కారణమని ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. "ఖతార్‌కు చెందిన హెలికాప్టర్ రొటీన్ డ్యూటీలో ఉండగా సాంకేతిక సమస్య కారణంగా దేశ జలాల్లో కూలిపోయింది" అని ఆ ప్రకటనలో పేర్కొంది.

ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో మొత్తం ఏడుగురు సిబ్బంది ఉన్నారని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన ఏడో వ్యక్తి కోసం కోస్ట్ గార్డ్, బోర్డర్ సెక్యూరిటీ, అంతర్గత భద్రతా దళాలకు (లెఖ్వియా) చెందిన ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ ఘటన జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఇది కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగిన ప్రమాదమేనని, దీని వెనుక ఎలాంటి శత్రుచర్య లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ రకం, అది కూలిపోయిన కచ్చితమైన ప్రదేశం వంటి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Qatar Military Helicopter
Qatar
Military Helicopter Crash
Middle East
Helicopter Accident
Coast Guard
Border Security
Lekhwiya

More Telugu News