IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ జట్లకు గట్టి ఎదురుదెబ్బ.. కీలక పేసర్లు టోర్నీ నుంచి ఔట్

IPL 2026 Sunrisers Hyderabad Chennai Super Kings Suffer Injury Blows
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ఇంకా వారం రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. అయితే, ఈ సీజ‌న్ ప్రారంభానికి ముందు ప‌లువురు ఆట‌గాళ్లు గాయాల బారిన‌ప‌డ‌టంతో పలు ఫ్రాంచైజీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాకు చెందిన ముగ్గురు స్టార్ ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. రాబోయే అంతర్జాతీయ షెడ్యూల్ చాలా బిజీగా ఉండటంతో తమ కీలక ఆటగాళ్లపై పని భారం (వర్క్‌లోడ్) తగ్గించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అప్రోచ్ కారణంగానే ఈ పేసర్లు ఐపీఎల్ ప్రారంభానికి దూరమవుతున్నారు.

 సన్‌రైజర్స్‌కు డబుల్ షాక్.. కెప్టెన్ కమిన్స్‌తో పాటు కీలక ఆల్‌రౌండర్ ఔట్
ఈ పరిణామం ఢిల్లీ క్యాపిటల్స్ (స్టార్క్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (హేజిల్‌వుడ్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (కమిన్స్) జట్ల బౌలింగ్ లైనప్‌లపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టుకు ఇది డబుల్ షాక్‌గా మారింది. కెప్టెన్ పాట్ కమిన్స్ దూరం కావడమే కాకుండా, ఆ జట్టులోని మరో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ పాదం గాయం కారణంగా మొత్తం సీజన్‌కే దూరమయ్యాడు. గత వేలంలో రూ. 3 కోట్లకు అమ్ముడైన ఏకైక అన్‌క్యాప్డ్ విదేశీ ఆటగాడిగా ఎడ్వర్డ్స్ ఈ సీజన్‌లో ఐపీఎల్ అరంగేట్రం చేయాల్సి ఉండగా, గాయంతో ఆ అవకాశం కోల్పోయాడు. కమిన్స్ గైర్హాజరీలో భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

గత 12 నెలల్లో టెస్టుల్లో అత్యధిక బంతులు వేసిన పేసర్‌గా నిలిచిన స్టార్క్‌కు సీఏ విశ్రాంతినిచ్చింది. ఇక, వెన్నునొప్పి గాయం కారణంగా 2025 డిసెంబర్ నుంచి కమిన్స్ ఆటకు దూరంగా ఉంటున్నాడు. హేజిల్‌వుడ్ సైతం తొడ కండరాలు, అకిలెస్ సమస్యలతో యాషెస్ సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. రాబోయే వారాల్లో ఈ ముగ్గురు పేసర్ల ఫిట్‌నెస్ పురోగతిని బట్టి వారి లభ్యతపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది.

సీఎస్‌కేకు ఎదురుదెబ్బ
మరోవైపు ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ నాథన్ ఎల్లిస్ తొడ కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో టోర్నీ మొత్తానికి దూరమైనట్లు సీఎస్‌కే సీఈఓ కేఎస్ విశ్వనాథన్ వెల్లడించారు. ఈ నెల‌ 28న బెంగళూరులో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
Go Back to Shorts
IPL 2026
Pat Cummins
Sunrisers Hyderabad
Nathan Ellis
Josh Hazlewood
Mitchell Starc
Chennai Super Kings
Cricket Australia
Jack Edwards
Injury Update

More Telugu News