F-35 Lightning II: అమెరికాకు షాక్?.. ఇరాన్ దాడిలో దెబ్బతిన్న ఎఫ్-35 జెట్.. తీవ్ర ఉద్రిక్తత

F 35 Lightning II Jet Damaged in Iran Attack Sparks Tension
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రస్థాయికి చేరాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానంగా పేరుగాంచిన అమెరికా 'ఎఫ్-35 లైట్నింగ్ II' ఒకటి ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. ఇరాన్‌పై సైనిక ఆపరేషన్ ముగించుకుని తిరిగొస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇరాన్ దళాలు జరిపిన కాల్పుల్లోనే విమానం దెబ్బతిన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పైలట్ ఆ విమానాన్ని పశ్చిమాసియాలోని  అమెరికా సైనిక స్థావరంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఒకవేళ ఇది ఇరాన్ పనే అని తేలితే, ఫిబ్రవరిలో యుద్ధం మొదలైన తర్వాత అమెరికా యుద్ధ విమానాన్ని ఇరాన్ నేరుగా లక్ష్యం చేసుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది.

దాదాపు 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 800 కోట్లకు పైగా) విలువైన ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, పైలట్ క్షేమంగా ఉన్నారని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ సీఎన్‌ఎన్‌కు తెలిపారు. ఘటనపై విచారణ ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 10 రీపర్ డ్రోన్లతో సహా 16 అమెరికా విమానాలు ధ్వంసమయ్యాయి.

మరోవైపు, అమెరికా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. పెంటగాన్‌లో మాట్లాడిన అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్.. "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" విజయవంతంగా సాగుతోందని, యుద్ధంలో గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఇరాన్ మునుపెన్నడూ చూడని రీతిలో అతిపెద్ద వైమానిక దాడిని ఎదుర్కోబోతోందని ఆయన హెచ్చరించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ తన ఎస్-400, 'బావర్-373' గగనతల రక్షణ వ్యవస్థలను యుద్ధ ప్రాతిపదికన మొహరించింది. అమెరికా విమానాన్ని తామే దెబ్బతీశామంటూ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటోంది.
Go Back to Shorts
F-35 Lightning II
Iran
America
US Military
Middle East
Military Operation
Pentagon
Air Strike
S-400
Baavar-373

More Telugu News