ఏపీలో రూ.47 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
- ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో డ్రగ్స్ తయారీ కేంద్రంపై డీఆర్ఐ దాడులు
- ఆపరేషన్ 'వైట్ హ్యామర్' పేరుతో రూ.47 కోట్ల విలువైన అల్ప్రజోలం స్వాధీనం
- రసాయన పరిశ్రమ ముసుగులో అక్రమ దందా నిర్వహిస్తున్న వైనం
- 20 ఏళ్ల అనుభవమున్న కెమిస్ట్‌తో సహా ఇద్దరు సూత్రధారుల అరెస్ట్
- హైదరాబాద్‌లో వేర్వేరుగా నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో డీఆర్ఐ అధికారులు ఈ ఆపరేషన్ చేపట్టారు. రసాయనాల తయారీ యూనిట్ ముసుగులో పూర్తిస్థాయి పారిశ్రామిక వసతులతో అల్ప్రజోలం తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో జరిపిన సోదాల్లో రూ.47 కోట్ల విలువైన 237 కిలోల అల్ప్రజోలంతో పాటు, 800 కిలోలకు పైగా కీలక ముడి పదార్థాలు, 2,860 లీటర్ల వివిధ రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రియాక్టర్లు, డ్రైయర్లు, సెంట్రిఫ్యూజ్ వంటి భారీ పారిశ్రామిక పరికరాలను సీజ్ చేసినట్లు డీఆర్ఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది వ్యవస్థీకృతంగా, పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమ తయారీ కేంద్రమని అధికారులు నిర్ధారించారు.
ప్రాథమిక విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. రసాయన, ఫార్మా రంగంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఓ కెమిస్ట్ ఈ అక్రమ దందాకు సూత్రధారిగా వ్యవహరించినట్లు తేలింది. అతడికి మరో వ్యక్తి సహకరిస్తూ హైదరాబాద్‌లో ముడి పదార్థాల సేకరణ, తయారైన డ్రగ్స్ పంపిణీ బాధ్యతలను చూసుకునేవాడు. వీరిద్దరూ అల్ప్రజోలం అక్రమ తయారీ కోసమే ఈ ఫ్యాక్టరీని అద్దెకు తీసుకున్నారని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు సూత్రధారులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'నషా ముక్త్ భారత్ అభియాన్'లో భాగంగా డీఆర్ఐ తన నిఘాను పటిష్ఠం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎనిమిది రహస్య డ్రగ్ తయారీ కేంద్రాలను ఛేదించినట్లు అధికారులు తెలిపారు. మాదకద్రవ్యాల ముప్పు నుంచి సమాజాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని డీఆర్ఐ పునరుద్ఘాటించింది.